శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jayashankar - Oct 21, 2020 , 01:56:58

మన పల్లెల్లో ఆంధ్రా కూలీలు..

మన పల్లెల్లో ఆంధ్రా కూలీలు..

  • ఒంగోలు, గుంటూరు, ప్రకాశం నుంచి రాక
  • దేవరుప్పుల, కడవెండి, నీర్మాలలో పనులు 
  • కొన్ని నెలల పాటు ఇక్కడే నివాసం
  • సీజన్‌ ముగిసిన తర్వాత స్వస్థలాలకు..
  • స్థానికంగా కూలీల కొరతతో అక్కడివారికి డిమాండ్‌

నాడు ఎవుసం భారమై పనుల్లేక వలసలతో కళ తప్పిన ఊర్లే కనిపించేవి.. ‘కృషీ’వలుడు సీఎం కేసీఆర్‌ సంకల్పంతో నేడు ఆ పల్లెలే మరికొందరికి బతుకుదెరువు చూపుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, బావులతో సాగు నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చి వ్యవసాయం పండుగైన తరుణంలో పక్క రాష్ర్టాల వారికి సైతం పని కల్పించే స్థాయికి ఎదిగాయి. వరి నాట్లు వేసేందుకు, పత్తి ఏరేందుకు ఆంధ్రా నుంచి వచ్చిన కూలీలను, జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాలు అక్కునచేర్చుకున్నాయి.  

- దేవరుప్పుల 

గతం : సమైక్య పాలనలో నాలుగు పట్టెల (ఎకరం) భూమి ఉన్నా నీళ్లు లేక ఒక పట్టె (పది గుంటలు)లో నాట్లేసేటోళ్లు. తిండి మందం పండించుకునేటోళ్లు. చెరువులున్నా చుక్క నీరు లేక ఒక్క పంటే గగనమయ్యేది. వ్యవసాయం పెద్దగ లేక చేద్దామన్నా పని ఉండక రైతు కుటుంబాలే కూలీకివోయి పదో.. పర్కో సంపాదించుకుని పొట్ట పోసుకునేటియి. చాలా మంది ఎవుసం విడిచి వేరే పని చూసుకునేటోళ్లు. చివరికి పట్నానికి వలసబాట పట్టేటోళ్లు.

ప్రస్తుతం : వ్యవసాయం స్వరూపమే మారింది. మిషన్‌ కాకతీయతో బాగుపడిన గొలుసుకట్టు చెరువులతో పాటు సాగునీటి ప్రాజెక్టులతో పంటలకు పుష్కలంగా నీరందుతున్నది. పడావుపడ్డ భూములు సైతం పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. ఏటా ఒక్క పంటకే దిక్కు లేని పరిస్థితి నుంచి రైతులు రెండు, మూడు పంటలు వేయగలుతున్నారు. అందరూ సాగు బాట పట్టడంతో కూలీలకు కొరత ఏర్పడి ఆంధ్రా నుంచి పనులకు వలస వస్తున్నారు.

దేవరుప్పుల : వ్యవసాయ పనులు పుష్కలంగా ఉండడంతో జనగామ జిల్లా దేవరుప్పులకు ఆంధ్రా కూలీల వలసలు పెరిగాయి. వరి నాట్లు వేసేందుకు, పత్తి ఏరేందుకు ప్రకాశం, ఒంగోలు, గుంటూరు, తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది ఇక్కడి పలెల్లకు వస్తున్నారు. పత్తి సీజన్‌ ముగిసేవరకు ఒక్కో గ్రామంలో పనిచేసుకుంటూ ఉంటారు. తిండి, ఇతర ఖర్చులు యజమానులే భరిస్తుండడంతో ఒక్కొక్కరు సీజన్‌లో 30వేల నుంచి రూ.40వేల దాకా సంపాదిస్తున్నారు. కుటుంబంతో సహా ఇక్కడే ఉండి సీజన్‌ ముగిశాక స్వస్థలాలకు వెళ్తూ పనులు ప్రారంభం కాగానే తిరిగి రావడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది.

నాడు మన దగ్గర ఉపాధి లేక బొంబాయి, దుబాయికి వలస వెళ్లే వారితో కళ తప్పిన పల్లెలే కనిపించేవి.. ఇప్పుడు అవే పల్లెలు మరొకరికి బతుకుదెరువు చూపుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషితో వ్యవసాయం పండుగైన తరుణంలో ఇతర రాష్ట్ర కూలీలకు పని కల్పించే స్థాయికి చేరాయి. వరి నాట్లేసేందుకు, పత్తి ఏరేందుకు ఆంధ్రా నుంచి కూలీలు ఇక్కడికి వలస రావడం గ మనార్హం. జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలానికి ప్రకాశం, ఒంగోలు, గుంటూరు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వచ్చి పొట్టపోసుకుంటున్నారు. నేడు మిషన్‌ కాకతీయ పేర గొలుసుకట్టు చె రువులు మరమ్మతులకు నోచుకోవడంతో ప్రతి యేడూ అవి నిండి అలుగుపోస్తున్నాయి. మరోవైపు దేవాదుల, కాళేశ్వరం నీరు కాల్వల ద్వారా గ్రా మాలకు చేరుతున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టే చెక్‌డ్యాములు నిర్మించడంతో నీటికి కొరత లే కుండా పోయింది. దీంతో రైతులకు స్థానికంగా కూలీలు దొరకడం ఇబ్బందిగా మారింది. అడపాదడపా దొరికినా ఎక్కువ కూలి అడుగుతుండడంతో ఆంధ్రా ప్రాంత కూలీలతో పనులు చేయించుకుంటున్నారు.

ఐదేళ్లుగా కూలీల వలస

దేవరుప్పుల మండలంలో పత్తి పెద్ద ఎత్తున సాగువుతుంది. అన్ని గ్రామాల్లో ఒకేసారి పంట చేతికి రావడం వల్ల పత్తి ఏరేందుకు కూలీలు దొరకడం లేదు. ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని భావించిన రైతులు, కూలీల కొరతను అధిగమించేందుకు ఐదేళ్ల నుంచి ఆంధ్రా కూలీలతో గుత్తా మాట్లాడుకుంటున్నారు. అక్కడ వారికి కూడా ఉపాధి దొరకకపోవడంతో ప్రకాశం, ఒంగోలు, గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి వందలాది మంది కూలీలు వచ్చి నెలల తరబడి ఇక్కడే ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఒక గ్రామంలో పూర్తయ్యాక మరో గ్రామానికి వెళ్తారు. ఇలా అంతటా పత్తి ఏరడం పూర్తయిన తర్వాత వారి ప్రాంతాలకు వెళ్తారు. ఈ కూలీలు మన కూలీలతో పోల్చితే కొంత తక్కువ కూలీకి పనిచేయడం ఒక కారణమైతే, ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు గుత్తా పనులు చేస్తుండడంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇలా మండలంలోని నీర్మాల, దేవరుప్పుల, కడవెండి గ్రామాల్లో ఎక్కువగా ఆంధ్రా వలస కూలీలే కనిపిస్తారు.

ఆదరించి, ఆశ్రయం కల్పించి..

ఆకలైతే అన్నం పెట్టే గుణం మన తెలంగాణ రైతు కుటుంబాలది. ఇంటికి వచ్చిన సుట్టాలను సాదరంగా ఆహ్వానించడమే గాక సకల మర్యాదలు చేయడం మన నైజం. ఆంధ్రా నుంచి వచ్చే వలస కూలీలకు ఇక్కడి రైతులు ఆతిథ్యం ఇస్తారు. రైతు తనకు చెందిన కూలీలకు తన ఇంట్లోనే వసతి కల్పించి, వారికి పొయిల కట్టెలు, ఇతర వసతులు కల్పిస్తారు. ఇక ఆదివారం వస్తే చికెన్‌ తెచ్చి ఇవ్వడం ఇక్కడ రైతుల ఆదరణను చాటుతుంది. వలస కూలీల వల్ల పనులు త్వరగా పూర్తికావడం, కూలీలకు సైతం చేతినిండా పనులు దొరుకుతుండండంతో ఇద్దరికీ మేలేనని రైతులు చెబుతున్నారు.

ఒక్కొక్కరం రూ.40వేలు సంపాదిస్తం..

ఆంధ్రాల పనులు దొరకక ఇక్కడికి వచ్చాం. ఈ ఏరియాల పత్తి మొత్తం ఏరే వరకు ఇక్కడే ఉంటం. ఒక్కొక్కరం రూ.30నుంచి రూ.40వేలు సంపాదించాలనే వచ్చాం. అక్కడచేసిన అప్పులు తీర్చాలె కదా. అందుకే పిల్లాజల్లతోటి వచ్చాం. పనులు దొరుకుతయ్‌ అనే నమ్మకంతోని ఉన్నాం. ఇక్కడ పూర్తయితే పక్క ఊరు వెళ్తాం. ఇక్కడి రైతులు చాలా మంచోళ్లు. మాకు అన్ని విధాలా సాయం చేస్తున్నారు. పొయ్యిల కట్టెలు ఇస్తరు నీళ్లు తెచ్చి పెడుతరు. అవసరమైతే కొన్ని డబ్బులు, బియ్యం కూడా ఇచ్చి సాయం చేస్తారు.

- వయ్యి దేవమ్మ, కూలీ

అక్కడ పనులు లేక వచ్చాం..

మాది ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం. మాకు అక్కడ పనులు లేవు. వరినాట్లు లేవు. మిర్చి వేశారు వచ్చే సంవత్సరం మే వరకు పనులు దొరకవు. అందుకే ఇక్కడ పత్తి ఏరడానికి వచ్చాం. మా గుంపు 30మందిమి ఉన్నాం. రైతులు ఉండడానికి ఇల్లిచ్చారు. మంచిగ పనిచేసి అంతోఇంతో సంపాయించుకోవాలని వచ్చినం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పత్తి ఏరుతం. కిలోకు ఇంత అని ముందే మాట్లాడుకున్నం. పత్తి ఏరడానికి రావాలని చాలామంది పిలుస్తున్నరు. పూర్తిగా ఏరే వరకు ఇక్కడే ఉంటం.

- మంద దేవదాసు, కూలీ, ప్రకాశం

రోజుకు 70 కిలోలు ఏరుతం

మా కుటుంబం మొత్తం కూలీ పనులకు వచ్చాం. ఇక్కడ వానలు ఎక్కువ పడి పత్తి జాలుపట్టింది. పత్తి మంచి కాత ఉంటే ఒక్కొక్కరం 70కిలోల వరకు ఏరుతం. పొద్దున్నే వంట వండుకొని పొలానికి వెళ్లి సాయంత్రం వస్తం. ఇక్కడి రైతులు  మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు. పత్తి చేన్లు ఇక్కడ బాగున్నయ్‌. కరోనాతోటి కొంచెం ఇబ్బందిగా ఉంది. జాగ్రత్తగా ఉంటున్నం. తెలంగాణ గవర్నమెంట్‌ మాకు కూడా బియ్యం, కూరగాయలు ఇచ్చి సాయం చేస్తే బాగుండు.

- జడ్డ దానమ్మ, మహిళా కూలీ

VIDEOS

logo