గురువారం 22 అక్టోబర్ 2020
Jayashankar - Oct 17, 2020 , 02:36:22

పౌష్టికాహారంపై అవగాహన కల్పించండి

పౌష్టికాహారంపై అవగాహన కల్పించండి

  • మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య రాజన్‌
  • కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు

భూపాలపల్లి కలెక్టరేట్‌, అక్టోబర్‌ 16: నీతి అయోగ్‌ సహకారంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిరు ధాన్యాలతో కూడిన పౌష్టికాహారం ఇచ్చేందుకు ప్రణాళికలు వేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య రాజన్‌ అన్నారు. శుక్రవారం ఆమె ఆస్పిరేషనల్‌ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. ఆస్పిరేషనల్‌ జిల్లాల్లో నిరుపేదలు అధికంగా ఉంటారని, చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం తరఫున పౌష్టికాహారం అందించేందుకు  నీతి అయోగ్‌ సహకారంతో చర్యలు చేపట్టాలని అన్నారు. కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ వేసి చిరు ధాన్యాల ప్రాధాన్యతను తెలియజేయడంతో పాటు అంగన్‌వాడీ ద్వారా చిరు ధాన్యాలతో కూడిన పౌష్టికాహారం అందజేయడం పై, తల్లులు, స్వయం సహాయక మహిళా సంఘాలకు, అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులతో సమావేశం నిర్వహించి జిల్లాలో వంద ఎకరాల్లో జొన్నలు తదితర చిరుధాన్యాలు పండించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.

జిల్లాలో మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ 

యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు 

కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వెంటనే జిల్లా స్థాయి కమిటీ వేసి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు చిరు ధాన్యాలతో కూడిన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ఎకరం స్థలంలో మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారి సత్యంబాబు, డీఎం సివిల్‌ సైప్లె రాఘవేందర్‌, సీడీపీవో అవంతిక, కలెక్టర్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ రవికుమార్‌, ఎస్బీఎం డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ వెంకటేశ్‌, డిప్యూటీ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.logo