బుధవారం 21 అక్టోబర్ 2020
Jayashankar - Oct 15, 2020 , 03:44:01

బతికుండగానే కాటికి

బతికుండగానే కాటికి

  • దింపుడుకల్లం వద్ద మూలుగు
  • అవాక్కయిన గ్రామస్తులు.. వెంటనే వైద్యశాలకు
  • ఆలస్యం కావడంతో యువతి మృతి
  • కుదురుపల్లిలో కలకలం 

మహదేవపూర్‌ : అందరూ చనిపోయింది అనుకున్నారు. పెళ్లీడుకొచ్చిన బిడ్డ చనిపోయిందని ఆ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు. శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేద్దామనుకున్నారు. ఈ క్రమంలో వారి సంప్రదాయం ప్రకారం యువతిని శవపేటికలో పెట్టి తీసుకెళ్తుండగా అంతలోనే ఆమె మూలిగిన శబ్దం రావడంతో గ్రామస్తులంతా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కుదురుపల్లిలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..కుదురుపల్లికి చెందిన మెండ లక్ష్మి-లక్ష్మయ్య దంపతుల కూతురు గీతాంజలి(20) మహదేవపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. 20 రోజులుగా జ్వరం రావడంతో కుటుంబీకులు నిర్లక్ష్యంతో ఊళ్లోనే ఆర్‌ఎంపీతో చికిత్స చేయించారు. జ్వరంతోనే యువతి వ్యవసాయ పనులకు సైతం వెళ్తున్నది. దీంతో జ్వరం తీవ్రం కావడంతో గీతాంజలి బుధవారం రాత్రి వరకు చలనం లేకుండా ఉండిపోవడంతో కుటుంబసభ్యులు ఆమె చనిపోయిందనుకున్నారు.

బంధువులు, గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో దింపుడుకల్లం వద్ద శవపేటికను దించి పిలవగా యువతి నుంచి మూలిగిన శబ్దం వచ్చింది. దీంతో అవాక్కైన గ్రామస్తులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారమందించి మహదేవపూర్‌ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా అప్పటికే యువతి చనిపోయిందని వైద్యుడు నిర్ధారించడంతో తిరిగి గ్రామస్తులు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ విషయంపై మహదేవపూర్‌ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ను వివరణ కోరగా విషయం తన దృష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదుచేస్తే విచారణ చేపడుతామని తెలిపారు.



logo