శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Oct 10, 2020 , 06:35:29

సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలి

సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలి

పాలపల్లి కలెక్టరేట్‌, అక్టోబర్‌9:ప్రజల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వంద శాతం లబ్ధిదారులకు చేరేలా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో కలిసి జడ్పీచైర్‌ పర్సన్‌ వివిధ శాఖల ద్వారా చేపట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిని సమీక్షించారు. వివిధ మండలాల సమస్యలను జడ్పీటీసీలు, ఎంపీపీల ద్వారా తెలుసుకొని వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ  అన్ని మండలాల్లోని ప్రజాసమస్యలను ప్రభుత్వ సమస్యలుగా భావించి శాసన సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి సహకారంతో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.

ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు త్వరలో పట్టాలు

భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు సాగు చేసుకుంటున్న అసైన్డ్‌ భూములకు త్వరలో పట్టాలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నదని అన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా జిల్లాలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా శుద్ధమైనా తాగునీరు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించడానికి ముందుకు వచ్చే వైద్యులకు పోత్సాహం అందిస్తామని, రైతులు పండించే ప్రతి పంటను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని అన్నారు. త్వరలో చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు. ఉద్యానవన పంటల్లో రైతులను పోత్సహించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.

సంయుక్త కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత మాట్లాడుతూ గతంలో రైస్‌ మిల్లులకు ధన్యం పంపించడానికి లారీల కొరత ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, నల్గొండ తదితర ప్రాంతాల్లోని రైస్‌ మిల్లులకు తరలించామని అన్నారు. ఈ సారి కూడా రెండు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈవో నాగపద్మజ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.