గురువారం 22 అక్టోబర్ 2020
Jayashankar - Oct 10, 2020 , 06:35:31

కాటారం-పెద్దపల్లి రోడ్డుకు మరో రూ.వంద కోట్లు ఇవ్వండి

కాటారం-పెద్దపల్లి రోడ్డుకు  మరో రూ.వంద కోట్లు ఇవ్వండి

  • సీఎం కేసీఆర్‌కు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు వినతి

కాటారం, అక్టోబర్‌ 9: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రం వరకు నాలుగు లేన్ల రోడ్డు విస్తరణలో భాగంగా మరో రూ.వంద కోట్లు మంజూరు చేయాలని పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధూకర్‌ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గురువారం కలిసి పలు అభివృద్ధి పనులపై విజ్ఞప్తులు చేశారు. కాటారం-పెద్దపల్లి రహదారి విస్తరణకు గతంలో రూ.114 కోట్లు మంజూరు చేశారని, అదనంగా మరో రూ. వంద కోట్లు కేటాయించాలని విన్నవించారు.

జయశంకర్‌ జిల్లాలోని కాటారం మండలకేంద్రంతో పాటు ధన్వాడ, దేవరాంపల్లి, కొయ్యూరు గ్రామాల వద్ద, పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామాల వద్ద నాలుగు లేన్ల రోడ్డుతోపాటు సైడ్‌ డ్రైనేజీలు, డివైడర్లు, లైటింగ్‌ కోసం మరో రూ.100కోట్లు కేటాయించాలని విన్నవించారు. దీని వల్ల రహదారి అభివృద్ధితోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి త్వరలోనే మరో రూ.వంద కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు పుట్ట మధు తెలిపారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని బరాజ్‌లు, పంప్‌హౌస్‌ల వద్ద పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. 


తాజావార్తలు


logo