ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Oct 07, 2020 , 02:06:01

పండ్ల సాగుకు.. సర్కారు ప్రోత్సాహం..

పండ్ల సాగుకు.. సర్కారు ప్రోత్సాహం..

  • అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ మొక్కలపై రాయితీ
  • సబ్సిడీపై మినీ ట్రాక్టర్లు, బ్రష్‌ కట్టర్లు, ఇతర పరికరాలు
  • అత్యధికంగా ఆయిల్‌పామ్‌ మొక్కలపై 90శాతం..
  • సబ్సిడీతో రైతులకు ఎంతో మేలు

శాయంపేట : ఉద్యాన పంటలు సాగుచేసే రైతులకు సర్కారు ప్రోత్సాహం అందిస్తున్నది. వ్యవసాయ పరికరాలు, వాహనాలను సబ్సిడీపై, మొక్కలపై రాయితీ ఇస్తూ ఖర్చు తగ్గిస్తున్నది. ఈమేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను హార్టికల్చర్‌ అధికారులు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించా రు. పండ్ల తోటల పథకంలో అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ తోటలకు పలు రాయితీలను ప్రకటించింది. అలాగే సబ్సిడీపై మినీ ట్రాక్టర్లు, బ్రష్‌కట్టర్లు, ఇతర పరికరాలు అందిస్తుండగా రైతులకు ఎంతో మేలు చేకూరనుంది.

పండ్ల తోటలకు రాయితీ..

పండ్ల తోటలు సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ ద్వారా రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈమేరకు కొత్తగా బొప్పాయి, అరటి, జామ, దానిమ్మ తోటలు పెట్టాలనుకునే వారికి ఈ రాయితీ అందుతుంది. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌(ఎంఐడీహెచ్‌) పథకం ద్వారా పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వనున్నది. ఈ పండ్ల తోటల రాయితీ వివరాలను పరకాల హార్టికల్చర్‌ అధికారి తిరుపతి వెల్లడించారు. ఒక హెక్టారుకు రాయితీ సంవత్సరాల వారీగా ఇలా ఉన్నది. అరటిలో 8086 మొక్కలపై 40శాతం రాయితీ ఇస్తారు. మొదటి సంవత్సరం రూ.30,739, రెండో సంవత్సరం రూ.10,246 లభిస్తుంది. బొప్పాయిలో 3086 మొక్కలపై 50శాతం రాయితీ ఇస్తారు. మొదటి సంవత్సరం రూ.22,500, రెండో సంవత్సరం రూ.7500 వస్తుంది. జామలో 1111 మొక్కలపై 40శాతం రాయితీ ఇస్తారు. మొదటి సంవత్సరం రూ.17,599, రెండో సంవత్సరం రూ.5866, మూడో సంవత్సరం కూడా రూ.5866 వస్తుంది. దానిమ్మలో 667 మొక్కలపై 40శాతం రాయితీ లభిస్తుంది. ఇందులో మొదటి ఏడాది రూ.16,003, రెండో ఏడాది రూ.5334, మూడో ఏడాది రూ.5334 అందిస్తారని అధికారులు చెప్పారు.

మల్చింగ్‌ షీట్లకు రూ.16వేలు..

మల్చింగ్‌ షీట్లను ప్రభుత్వం రాయితీపై రైతులను అందిస్తున్నది. బిందుసేద్యం చేస్తున్న రైతులకు రక్షిత సాగులో భాగంగా మల్చింగ్‌ షీట్లకు ఒక హెక్టారుకు రూ.16వేలు సబ్సిడీ వస్తుంది. అలాగే కూరగాయలు సాగుచేసే రైతులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది.

ఆయిల్‌పామ్‌కు అత్యధికంగా..

ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం రాయితీలను అందిస్తున్నది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుకు 18వేల హెక్టార్ల భూమి అనుకూలంగా ఉన్నట్లు ఉద్యానశాఖ గుర్తించింది. ఈమేరకు మొక్కలపై 90శాతం సబ్సిడీ ఇస్తున్నది. ఎరువులపై మొదటి నాలుగు సంవత్సరాలకు హెక్టారుకు రూ.20వేలు లభిస్తుంది. పంట కోత పరికరాలు, గెలల కోత రవాణాకు సబ్సిడీ ఇస్తుంది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో నడికూడ, పరకాల, శాయంపేట, దామెర, ఆత్మకూరు, గీసుగొండ మండలాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ఆయిల్‌పామ్‌ సాగు విధానం, దాని లాభాలను ప్రతి రైతుకు వివరిస్తూ చైతన్యం తెస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా 250 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చినట్లు ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

యంత్రాలపై సబ్సిడీ ఇలా..

ఉద్యాన శాఖ ద్వారా యంత్రాలకు ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించింది. ఇందులో మినీ ట్రాక్టర్‌(20హెచ్‌పీ)పై ఎస్సీ, ఎస్టీ రైతులకు లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే బ్రష్‌కట్టర్లు సబ్సిడీపై ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు రూ.15వేలు, ఇతర రైతులకు రూ.12వేలు సబ్సిడీ ఉంటుంది.logo