ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Oct 05, 2020 , 05:35:03

నేటి నుంచి ఆల్బెండజోల్‌తో మాత్రల పంపిణీ

నేటి నుంచి ఆల్బెండజోల్‌తో మాత్రల పంపిణీ

  • ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్య ఆరోగ్యశాఖ 
  • మహాముత్తారంలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కలెక్టర్‌

భూపాలపల్లి టౌన్‌: సోమవారం నుంచి జాతీయ నులిపురుగుల నిర్మూలన వారోత్సవాలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నివారణకు  19 ఏళ్ల లోపు వారందరికీ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని మహాముత్తారం మండల కేంద్రంలో కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీం సోమవారం ప్రారంభిస్తారు. జిల్లాలో 85,361 మందికి ఈ మాత్రలను అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు డీఎంహెచ్‌వో సుధార్‌సింగ్‌  తెలిపారు. జిల్లాలోని ఆయా మండలాల్లో అర్హులైన పిల్లలను గుర్తించి, కార్యక్రమ నిర్వహణకు సంబంధించి డీఎంహెచ్‌వో ఇప్పటికే వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. విద్యా సంస్థల్లో మాత్రలు తీసుకునే పిల్లల పేర్లు నమోదు చేయడానికి రిపోర్టింగ్‌ ఫార్మాట్‌ అందజేశారు. 

నులిపురుగులతో హానికరం

నులిపురుగులు ప్రాణానికే ప్రమాదమని వైద్యులు అంటున్నారు. కడుపులో నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, వాంతులు, అతిసారం, బరువుతగ్గడం లాంటి సమస్యలతో బాధపడుతారని వైద్యులు తెలుపుతున్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం, పాదరక్షలు ధరించకుండా అపరిశుభ్ర ప్రదేశాల్లో తిరగడం, చేతులు కడుక్కోకుండానే ఆహారం భుజిస్తే నులిపురుగులు సంక్రమిస్తాయి. పిల్లల్లో సాధారణంగా మూడు రకాల క్రిములు కనబడుతాయని, అవి ఏలిక పాములు, నులిపురుగులు, కొంకి పురుగులు అని వైద్యులు తెలుపుతున్నారు.

85,361 పిల్లలకు మాత్రలు

జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల వారీగా 85,361 మంది ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు అందించడానికి ఏర్పాట్లు చేశారు. అంబట్‌పల్లి పీహెచ్‌సీ పరిధిలో 8768 మంది 19 ఏళ్లలోపు పిల్లలున్నట్లు గుర్తించారు. ఆజంనగర్‌ పీహెచ్‌సీ పరిధిలో 2191, భూపాలపల్లి పీహెచ్‌సీ పరిధిలో 19389 మంది, చెల్పూర్‌ పీహెచ్‌సీ పరిధిలో 4211, ఘణపురం పీహెచ్‌సీ పరిధిలో 3747, కాటారం పీహెచ్‌సీ పరిధిలో 10253, మహాముత్తారం పీహెచ్‌సీ పరిధిలో 5029, మొగుళ్లపల్లి పీహెచ్‌సీ పరిధిలో 5227, ఒడితెల పీహెచ్‌సీ పరిధిలో 6628, రేగొండ పీహెచ్‌సీ పరిధిలో 8037, తాడిచెర్ల పీహెచ్‌సీ పరిధిలో 5507, వెలిశాల పీహెచ్‌సీ పరిధిలో 6374 మంది 19 ఏళ్లలోపు పిల్లలున్నట్లు గుర్తించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన వారోత్సవాలను పురష్కరించుకుని జిల్లాలోని మహాముత్తారం మండల కేంద్రంలో కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీం మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని  ప్రారంభించనున్నారు. వివిధ కారణాలతో మాత్రలు తీసుకోని వారికి ప్రత్యేకంగా తేదీని నిర్ణయించి పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. 


logo