శనివారం 24 అక్టోబర్ 2020
Jayashankar - Oct 04, 2020 , 02:03:37

రోడ్లు, వంతెనల పనులు పూర్తి చేయండి

రోడ్లు, వంతెనల పనులు పూర్తి చేయండి

  • భూపాలపల్లి కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌, అక్టోబర్‌ 03: రహదారులు, వంతెనల నిర్మాణం, మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. జిల్లాలో డీఎంఅండ్‌ఎఫ్‌టీ నిధులతో చేపట్టిన కొత్త రోడ్లు, వంతెనల నిర్మాణ పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాలతో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్లు, వంతెనల మరమ్మతుకు 25 పనులను గుర్తించి వాటిని బాగు చేసేందుకు రూ.5 కోట్ల 30 లక్షల మంజూరు చేసినట్లు తెలిపారు. టెండర్‌ ప్రక్రియ పూర్తయినందున పనులను పూర్తి చేసి ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. రూ.42 కోట్ల డీఎంఅండ్‌ఎఫ్‌టీ నిధులతో జిల్లాలో చేపట్టిన కొత్త రహదారులు, వంతెనల నిర్మాణ పనులు 14 ఉన్నాయని, వాటిని కూడా 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారులు, వంతెనల నిర్మాణాలు, మరమ్మతుకు నిధులు అందుబాటులో ఉన్నందున పనుల్లో జాప్యం జరగకుండా చూడాలని ఆర్‌ అండ్‌ బీ ఈఈ వెంకటేశ్‌ను ఆదేశించారు. సమావేశంలో డీఈ రమేశ్‌, కలెక్టర్‌ కార్యాలయ ఏవో మహేశ్‌బాబు, సూపరింటెండెంట్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.


logo