శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jayashankar - Oct 02, 2020 , 02:22:56

ఇక సోలార్ ప‌వ‌ర్‌..!

ఇక సోలార్ ప‌వ‌ర్‌..!

  • సింగరేణిలో ‘సౌర’ వెలుగులు..
  • సౌర విద్యుదుత్పత్తి దిశగా సంస్థ చర్యలు
  • భూపాలపల్లిలో 10 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్మాణం
  • రూ. 45 కోట్లతో 55 ఎకరాల్లో ఏర్పాటు
  • అక్కడినుంచి చెల్పూర్‌ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం
  • సీఎండీ పర్యవేక్షణలో చురుగ్గా సాగుతున్న పనులు
  • వచ్చే ఏడాది జనవరిలో పూర్తయ్యే అవకాశం
  • ప్లాంట్‌తో సంస్థకు తప్పనున్న కరెంట్‌ చార్జీల భారం

బొగ్గు ఉత్పత్తి, రవాణాతో పాటు విద్యుదుత్పత్తిలోనూ దూసుకుపోతున్న సింగరేణి సంస్థ.. తాజాగా సోలార్‌ పవర్‌పై దృష్టిపెట్టింది. సింగరేణివ్యాప్తంగా 1500 ఎకరాల్లో 300 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని బాంబులగడ్డ వద్ద 10 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్‌ నిర్మిస్తున్నది. 55 ఎకరాల్లో నిర్మించే ఈ ప్లాంట్‌ కోసం 32,760 ప్యానెళ్లు అమర్చి అటునుంచి విద్యుత్‌ను చెల్పూర్‌ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేయనుంది. సీఅండ్‌ఎండీ శ్రీధర్‌, డైరెక్టర్‌(పా) చంద్రశేఖర్‌ పర్యవేక్షణలో పనులు చురుగ్గా సాగుతుండగా వచ్చే ఏడాది జనవరిలో ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సోలార్‌తో పర్యావరణానికి  మేలు కలగడమేగాక సంస్థకు ఏటా రూ.2 కోట్ల విద్యుత్‌ చార్జీల భారమూ తప్పనుంది.

- భూపాలపల్లి


విద్యుత్‌ ఉత్పత్తిలో భాగంగా సింగరేణి సౌర విద్యుత్‌ దిశగా అడుగులు వేస్తున్నది. విద్యుత్‌రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ప్లాంట్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు సింగరేణివ్యాప్తంగా రూ.1350 కోట్ల అంచనా వ్యయంతో 300 మెగావాట్ల ఉత్పత్తి చేసే లక్ష్యంతో పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని బాంబులగడ్డ వద్ద 10 మెగావాట్ల సామర్థ్యంతో 2019 డిసెంబర్‌లో ప్లాంట్‌ పనులు మొదలయ్యాయి. మొత్తం రూ.45 కోట్ల వ్యయంతో ప్రారంభించగా, సోలార్‌ ప్యానెళ్లు బిగింపు ప్రక్రియ సగం పూర్తయ్యింది. ప్లాంట్‌లో రెండు రకాల ప్యానల్స్‌ అమర్చనున్నారు. 335 వాట్ల సామర్థ్యంతో 24,660 సోలార్‌ ప్యానల్స్‌, 340 వాట్ల సామర్థ్యంతో 8,100 కలిపి మొత్తం 32,760 ప్యానల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. వీటిని అమర్చేందుకు 6,552 పైల్స్‌ (సపోర్ట్‌ పిల్లర్లు) వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 3వేల పిల్లర్స్‌ నిర్మాణం పూర్తయ్యింది. అలాగే 1.2 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యంతో నాలుగు ఇన్వర్టర్ల అవసరం కాగా వాటి కోసం గదులు నిర్మించారు. మెయిన్‌ కంట్రోల్‌ రూం (ఎంసీఆర్‌) పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యి, స్లాబ్‌లెవల్‌ పను లు కొనసాగుతున్నాయి. రెండు 440వీ/33 కేవీ సామర్థ్యంతో 2 ఎంవీఏ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను నెలకొల్పనున్నారు.

కొనసాగుతున్న విద్యుత్‌ లైన్‌ పనులు..

ప్లాంట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను చెల్పూరు సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేసేందుకు ఓవర్‌హెడ్‌ లైన్‌ వేయాల్సి ఉంది. ఈమేరకు 13.4కిలోమీటర్ల వరకు విద్యుత్‌ లైన్‌ అవసరం కాగా ఇప్పటివరకు 3.2 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయ్యింది.

విద్యుదుత్పత్తి, అనుసంధానం ఇలా..

పవర్‌ప్లాంట్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత సూర్యరశ్మి ఆధారంగా సోలార్‌ ప్యానల్స్‌లో డైరెక్ట్‌ కరెంట్‌ (డీసీ) ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇన్వర్టర్‌ రూములకు అనుసంధానం చేస్తారు. అక్కడ డెరెక్ట్‌ కరంటు(డీసీ) ఆల్టర్నేట్‌ కరంటు (ఏసీ)గా మారుతుంది. ఏసీగా మారిన కరెంట్‌ను 10 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి వరకే ఉంది కనుక 33కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత ఈ విద్యుత్‌ను మెయిన్‌ కంట్రోల్‌ రూం (ఎంసీఆర్‌)కు అనుసంధానిస్తారు. అనంతరం ప్లాంట్‌ నుంచి వెళ్లే ఓవర్‌ హెడ్‌లైన్‌కు కలుపుతారు. ఓవర్‌హెడ్‌లైన్‌ ద్వారా గణపురం మండలంలోని చెల్పూరు 33కేవీ ఎన్పీడీసీఎల్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు వెళ్తుంది. ఈ అనుసంధానికి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద కొత్తగా నిర్మించబోయే ఉపయోగపడుతుంది. ప్లాంట్‌లో ఉత్పత్తయిన విద్యుత్‌ను రికార్డు చేసేందుకు ఒక విద్యుత్‌ మీటర్‌ను సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో, మరొక విద్యుత్‌ మీటరును సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసి, సోలార్‌ పవర్‌ప్లాంట్‌ నుంచి వచ్చే విద్యుత్‌ను రికార్డు చేస్తారు. అనుసంధానం చేసిన విద్యుత్‌ ఎన్పీడీసీఎల్‌కు సంబంధించి ఇదివరకే పరకాల-హన్మకొండ రహదారిలో ఉన్న ఓగ్లాపూర్‌ పవర్‌గ్రిడ్‌కు వెళ్తుంది. సింగరేణి సంస్థ ఎన్పీడీసీఎల్‌కు అనుసంధానం చేసిన సోలార్‌ విద్యుత్‌ పోను సింగరేణి వాడుకున్న మిగతా విద్యుత్‌కు సంబంధించి ఎన్పీడీసీఎల్‌కు బిల్లు చెల్లించనున్నది.

నెలకు 48.50 లక్షల యూనిట్ల వినియోగం..

భూపాలపల్లి ఏరియాలో నెలకు సుమారు 48.50లక్షల యూనిట్ల విద్యుత్‌ను సింగరేణి సంస్థ వినియోగిస్తున్నది. ఇందుకుగాను రూ.3 కోట్ల నుంచి 3.50కోట్ల చార్జీలను ఎన్పీడీసీఎల్‌కు చెల్లిస్తున్నది. గనులు, డిపార్ట్‌మెంట్లకు 37లక్షల యూనిట్ల విద్యుత్‌ అవసరం కాగా ఒక యూనిట్‌కు రూ.6.15 పైసలు, అలాగే సింగరేణి క్వార్టర్లు, బ్యారెక్‌లకు 11లక్షల యూనిట్ల వినియోగం అవుతుండగా ఒక యూనిట్‌కు రూ.6.30 పైసలు, సింగరేణి ఏరియా దవాఖాన 50వేల యూనిట్లకు గాను ఒక్కో యూనిట్‌కు రూ.7చొప్పున సంస్థ చెల్లిస్తున్నది. ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే నెలకు సుమారు రూ.19 లక్షల చొప్పున ఏడాదికి రూ.2 కోట్ల పైగా విద్యుత్‌ బిల్లుల ఖర్చు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు.

వచ్చే జనవరిలో ఉత్పత్తి ప్రారంభిస్తాం.. 

వచ్చే జనవరిలోగా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తాం. సోలర్‌ పవర్‌ అందుబాటులోకి వస్తే సింగరేణికి విద్యుత్‌ చార్జీల భారం తగ్గుతుంది. థర్మల్‌ కంటే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పర్యావరణానికి ఎంతో మేలు. కరోనా కారణంగా నిర్మాణ పనులపై కొంతమేర ప్రభావం పడింది. ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నాయి.

-ఈ సీహెచ్‌. నిరీక్షణ్‌రాజ్‌, భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం