గురువారం 29 అక్టోబర్ 2020
Jayashankar - Sep 27, 2020 , 07:31:33

భూ నిర్వాతులకు పరిహారం చెల్లించండి

భూ నిర్వాతులకు పరిహారం చెల్లించండి

  • కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌
  • అధికారులు, భూ నిర్వాసితులతో సమావేశం

భూపాలపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబర్‌ 26: చట్ట ప్రకారం భూ నిర్వాతులకు నష్టపరిహారం చెల్లించి త్వరగా భూ సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జెన్‌కో, సింగరేణి సంస్థల విస్తరణకు అవసరమైన భూ సేకరణపై ప్రజలు, అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెన్కో, సింగరేణి సంస్థల వల్ల ఇండ్లు, పంట పొలాలు కోల్పోయిన తమకు మార్కెట్‌ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని గణపురం మండలం దుబ్బపల్లి, ధర్మారావుపేట, భూపాలపల్లి మండలం గడ్డిగానిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పంట పొలాలు కోల్పోతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత జెన్‌కో, సింగరేణి సంస్థలదే అన్నారు. ఆర్డీవో, జెన్‌కో ఎస్‌ఈ, తహసీల్దార్లు అంతర్గత భూ సేకరణ కమిటీ ఏర్పాటు చేసి నష్టపరిహారంపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

దసరా నాటికి వేదికలు పూర్తి చేయండి

అనంతరం పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించి రైతు వేదిక నిర్మాణాలపై సమీక్షించారు. జిల్లాలో చేపట్టిన వేదికల నిర్మాణాలకు అవసరమైన నిధులు, మెటీరియల్‌ అందుబాటులో ఉన్నందున నిర్ధేశిత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. దసరా నాటికి అన్ని నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈలు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ పనులను పరిశీలించాలన్నారు. సమావేశాలలో జిల్లా అదనపు కలెక్టర్‌, భూపాలపల్లి ఇన్‌చార్జి ఆర్డీవో వైవీ గణేశ్‌, జెన్‌కో ఎస్‌ఈ తిరుపతయ్య, సింగరేణి జీఎం నిరీక్షన్‌ రాజ్‌, గణపురం, భూపాలపల్లి తహసీల్దార్లు మాధవి, అశోక్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఈఈ రాంబాబు, ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరాజు, జిల్లా ప్రణాళిక అధికారి భిక్షపతి, కలెక్టర్‌ కార్యాలయ ఏవో మహేశ్‌బాబు పాల్గొన్నారు.logo