శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jayashankar - Sep 27, 2020 , 07:27:54

దంచికొట్టిన వాన

 దంచికొట్టిన వాన

  • మత్తడి దుంకుతున్న చెరువులు
  • పొంగి ప్రవహిస్తున్న వాగులు
  • నీట మునిగిన పంటలు
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • చెన్నారావుపేటలో అత్యధికంగా 13సెంటీమీటర్ల వర్షపాతం

శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వేకువజాము వరకు ఉమ్మడి జిల్లాలో వాన దంచి కొట్టింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో సగటున 7.5 సెంటీమీటర్లు, అర్బన్‌లో 5.6, ములుగులో 3, భూపాలపల్లిలో 2, మహబూబాబాద్‌లో  5.5, జనగామలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మొన్నటిదాకా కురిసిన వర్షాలతోనే నీటి వనరులకు జలకళ రాగా, తాజా వానలతో మళ్లీ ఉప్పొంగాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. వరంగల్‌ నగరం, జనగామ పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 


 వరంగల్‌ రూరల్‌/ జనగామ/ మహబూబాబాబాద్‌/ జయశంకర్‌ భూపాలపల్లి, నమస్తే తెలంగాణ/వరంగల్‌ సబర్బన్‌

 ఈ ఏడాది వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో వర్షా లు విస్తారంగా కురిశాయి. ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఆగస్టులో ఎడతెరిపి లేని వానలకు ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. వరంగల్‌ మహానగరాన్ని వరదలు ముంచెత్తాయి. అనే క కాలనీలు జలమయమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, కుంటలు మత్తళ్లు దుం కాయి. వాగులు, ఒర్రెలు పొంగి ప్రవహించాయి. వరదలతో పంటలు, రహదారులు దెబ్బతిన్నాయి. గతంలో ఎప్పుడూలేని రీతిలో జరిగిన నష్టం నుంచి పల్లెలు, పట్టణాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్లీ కొద్ది రో జుల నుంచి వానలు  ముంచెత్తుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా పలుచోట్ల వర్షం కురిసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలో అత్యధికంగా 13 సెంటీమీటర్లు, అర్బన్‌ జిల్లాలోని భీమదేవరపల్లిలో 8సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులన్నీ ప్రవహిస్తున్నాయి. చెరువులన్నీ మత్తళ్లు పోస్తున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో మున్నేరువాగు, రాళ్లవాగు, దంతాలపల్లిలో పాలేరు వాగు, డోర్నకల్‌లో మున్నేరు వాగు, గార్లలో పాకాల ఏరు, కేసముద్రంలో వట్టివాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే వరుస వర్షాలతో పెసర పంటకు నష్టం జరిగిందని వ్యవసాయాధికారులు గుర్తించారు. తాజా వర్షాలతో అక్కడక్కడా పత్తికి నష్టం వాటిల్లే అవకాశాలున్నట్లు తెలిపారు.      

చెరువులకు మత్తడి

అర్బన్‌ జిల్లాలో మొత్తం 671 చెరువులుండగా ఇంతకు ముందే అన్నీ మత్తడి పడ్డాయి. శుక్రవారం కురిసిన వానతో 328 చెరువులు మళ్లీ అలుగు పారుతున్నాయి. ప్రధాన వాగులైన శనిగరం, నడికూడ వాగులు ఉధృతంగా పారుతున్నాయి. నాగారం పెద్ద చెరువు మట్టం పెరిగింది. వడ్డేపల్లి చెరువు మత్తడి దుంకింది. ముప్పారం చెరువు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు ధర్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి వస్తూ ట్యాంక్‌ ఫుల్‌ లెవల్‌కు చేరింది. ఇక రూరల్‌ జిల్లాలో 1,050 చెరువులుండగా 480 చెరువులు శనివారం నుంచి మత్తడి పోస్తున్నాయి. మరో 569 చెరువుల్లో 75నుంచి వంద శాతం నీరు చేరినట్లు జల వనరుల శాఖ జిల్లా అధికారి శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ యేడు జనగామ జిల్లాలోని 12 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా వర్షాలు పడ్డాయి. దేవరుప్పుల, రఘునాథపల్లి మండలాల్లో  రెట్టింపు వర్షపాతం నమోదైంది. వరి, పత్తి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. 8500 ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, 4500 మంది రైతుల పై నష్ట ప్రభావం ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇప్పటికే 12 మండలాల్లోని 53 గ్రామాల్లో వరి దెబ్బతినగా, ఆరు మండలాల్లోని 33 గ్రామాల్లో పత్తికి నష్టం వాటిల్లింది. కందులు, పెసర పంటలు నీట మునిగాయి.

నగరం జలమయం

భారీ వర్షంతో మహా నగరం మొత్తం జల మయమైంది. ఏ రోడ్డు చూసినా మోకాళ్ల లోతు నీళ్లు కనిపించాయి. గత అనుభవాల దృష్ట్యా అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టారు. నాలాలు, కాల్వలు కొంతమేర క్లీన్‌ చేసి ఉండడంతో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యాయి. ఇక ఎన్టీఆర్‌ నగర్‌, సంతోషిమాత కాలనీ, సమ్మయ్య నగర్‌, నానా మియా తోట, శివనగర్‌, హన్మకొండ బస్టాండ్‌ ప్రాంతాల్లో వరద చేరింది.