శనివారం 24 అక్టోబర్ 2020
Jayashankar - Sep 26, 2020 , 06:37:38

పునరావాస కేంద్రంలో వసతులు కల్పించండి

పునరావాస కేంద్రంలో వసతులు కల్పించండి

భూపాలపల్లి కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబర్‌ 25: బాలల న్యాయ చట్టాల ప్రకారం హెచ్‌ఎంఆర్డీఎస్‌ మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో వసతులను కల్పించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ సింగరేణి, ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీలో ఉన్న హెలెన్‌ మేయర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో వసతుల కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కృష్ణకాలనీలో సింగరేణి సంస్థ భవనంలో హెలెన్‌ మేయర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వారు నిర్వహిస్తున్న మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని జువెనల్‌ జస్టిస్‌ లా సభ్యులు, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు పరిశీలించి

ఆ పునరావాస కేంద్రంలో మానసిక దివ్యాంగత్వం ఉన్న బాల బాలికలు ఉండడానికి ప్రత్యేకమైన వసతులను బాలల న్యాయ చట్టాల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. ఆ పునరావాస కేంద్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు గదులకు అదనంగా మరి కొన్ని రూములను తాత్కాలికంగా నిర్మించడంతోపాటు బాలబాలికలకు ప్రత్యేక వసతి, మరుగుదొడ్ల సౌకర్యం, ప్రహరీ ఏర్పాటుకు సింగరేణి జీఎం, ఆర్డీవో, జిల్లా సంక్షేమాధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ సంయుక్త కమిటీగా ఏర్పడి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, జిల్లా సంక్షేమాధికారి శ్రీదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి హైదర్‌ హై, సింగరేణి ఎస్‌వోటు జీఎం రఘుపతి, ఏస్టేట్‌ అధికారి శివకుమార్‌, మున్సిపల్‌ టీపీబీవో అవినాష్‌, హెచ్‌ఎంఆర్డీఎస్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు రజిత, కార్యదర్శి రాజయ్య పాల్గొన్నారు.


logo