బుధవారం 21 అక్టోబర్ 2020
Jayashankar - Sep 24, 2020 , 05:41:23

అటవీ భూముల సర్వే

అటవీ భూముల సర్వే

  • సర్కారు ఆదేశాల మేరకు  కదులుతున్న అటవీశాఖ 
  • ‘పోడు’ పేరిట అన్యాక్రాంతంపై సమాచార సేకరణ  
  • ‘గూగుల్‌ మ్యాప్‌' ద్వారా   వేగవంతంగా గుర్తింపు ప్రక్రియ

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అటవీ భూముల ఆక్రమణపై ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీశాఖ సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నది. ‘పోడు’పేరిట అన్యాక్రాంతమైన భూములను ‘గూగుల్‌ మ్యాప్‌' ద్వారా గుర్తిస్తున్నది. సమైక్య పాలనలో పోడు వ్యవసాయం పేరిట వనమేధం యథేచ్ఛగా సాగింది. పెద్ద ఎత్తున భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అటవీ భూముల రక్షణపై పకడ్బందీ చర్యలు చేపట్టింది. తాజాగా అటవీ శాఖ రంగంలోకి దిగి ఆక్రమిత భూములపై సమాచారం సేకరిస్తున్నది. 2007 నుంచి ఏ బీట్‌లో ఏ కంపార్ట్‌మెంట్‌ నంబర్‌లో ఎంత భూమి ఆక్రమణ అయిందనే విషయమై గూగుల్‌ మ్యాప్‌ ద్వారా గుర్తిస్తున్నది. 

1,69,245.21 హెక్టార్లలో అటవీ విస్తీర్ణం 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మహదేవపూర్‌, భూపాలపల్లి అటవీ డివిజన్లున్నాయి. వీటి పరిధిలో భూపాలపల్లి, ఆజాంనగర్‌, పెగడపల్లి, చెల్పూరు, మహదేవపూర్‌, పలిమెల, దూదేకులపల్లి, కొయ్యూరు, కాటారం అటవీరేంజ్‌లు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 51 అటవీ సెక్షన్లు, 185 అటవీ బీట్లు ఉండి, 1,69,245.21 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పోడు పేరిట అడవుల నరికివేత ఇష్టారాజ్యంగా సాగింది.

పోడుదారులతో కలిసి రెవెన్యూ భూమి సర్వే నంబర్ల పేరిట  అటవీభూములకు మహాముత్తారం సౌత్‌, చాత్రాజ్‌పల్లి అటవీ బీట్లలోని భూములకు  మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లో గతంలో పనిచేసిన పలువురు తహసీల్దార్లు అక్రమంగా పట్టాలు జారీ చేసిన ఉదంతాలు వెలుగు చూశాయి. మహాముత్తారం సౌత్‌, చాత్రాజ్‌పల్లి, గుర్రంపేట, పొనగల్లు, కనుకునూరు. ఆజాంనగర్‌, పెగడపల్లి, ఎర్రారం దీక్షకుంట, పంబాపూర్‌, దూదేకులపల్లి, సూరారం అటవీ బీట్లలో 2007 తర్వాత కూడా అడవి పెద్ద ఎత్తున నరికివేతకు గురైంది. రెండు దశాబ్దాల క్రితం దాకా అటవీభూములను ప్రధానంగా జీవనోపాధి కోసం గిరిజనులు కొంత మేర పోడు చేసుకొని వ్యవసాయం చేసుకునేవారు. 2007 నుంచి సమైక్య పాలనలో గిరిజనేతరులు, పలువురు నేతలు, ఉద్యోగులు అడవిని నరికించి పెద్ద ఎత్తున అటవీభూములను కబ్జా చేసుకున్నారు. 

అడవుల రక్షణకు సర్కారు ప్రాధాన్యం

స్వరాష్ట్రంలో ప్రభుత్వం అడవుల అభివృద్ధి, రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా ‘పోడు’ను నిరోధానికి కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అప్పటినుంచి అటవీశాఖ యంత్రాంగం పోడు వ్యవసాయానికి అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టింది. మహాముత్తారం సౌత్‌, చాత్రాజ్‌పల్లి అటవీ బీట్లలో పెద్ద మొత్తంలో అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయని గతంలో అధికారులు గుర్తించారు. అటవీ భూములకు పట్టాలు ఇవ్వవద్దని రెవెన్యూ అధికారులకు, విద్యుత్‌ లైన్లు వేయవద్దని ఎన్పీడీసీఎల్‌ అధికారులకు, రుణాలు ఇవ్వవద్దని బ్యాంకర్లకు రెండేళ్ల క్రితం లేఖలు కూడా రాశారు. బోర్లు వేయవద్దని బోర్‌వెల్స్‌ యజమానులకు హెచ్చరికలు సైతం జారీచేశారు.

పోడుదారులతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న పలువురు అటవీ సిబ్బందిపై, ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు. 2007 నుంచి ఇప్పటి వరకు ప్రతి బీట్‌, కంపార్ట్‌మెంట్‌ పరిధిలో ఎంత భూమి అన్యాక్రాంతం అయిందనే విషయంపై గూగుల్‌ మ్యాప్‌, ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. వారం, పదిరోజులుగా సమాచార సేకరణ వేగవంతంగా కొనసాగుతున్నది.

సమగ్ర సమాచారం సేకరిస్తున్నాం : పురుషోత్తం, డీఎఫ్‌వో


 2007 నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో ఎంత పోడు జరిగి అటవీ భూమి ఆక్రమణకు గురైందనే విషయమై సమగ్ర సమాచారం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ముందుకు పోతున్నాం. తెలంగాణ ఏర్పడక ముందు చాలా ప్రాంతాల్లో అడవిని నరికివేసి పోడు చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా వదిలేశారు. ఆ వివరాలు కూడా సేకరిస్తున్నాం. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా ముందుకు సాగుతున్నాం. ఇటీవల సూరారం,చాత్రాజ్‌పల్లి, దూదేకులపల్లి అటవీ బీట్లలో 20 హెక్టార్ల చొప్పున, కనుకునూర్‌ అటవీ సెక్షన్‌ పరిధిలో 60 హెక్టార్ల పోడు భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నాం.


logo