మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Sep 19, 2020 , 05:43:49

ఉద్యమ ‘దరువు’

ఉద్యమ ‘దరువు’

  • అతడు దరువేస్తే చిందెయ్యాల్సిందే..! 
  • డప్పే ప్రాణంగా సాగుతున్న లక్ష్మణ్‌
  • ప్రభుత్వ పథకాల అమలుపై ప్రచారం
  • ప్రతిభతో ఎన్నో సన్మానాలు,
  •  ప్రశంసలు సొంతం

అతడు దరువేస్తే ఎవరైనా మైమరచి చిందేయాల్సిందే.. డప్పే ప్రాణంగా సాగుతున్న అతడు ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా అక్కడ కళతో అలరిస్తాడు. తెలంగాణ ఉద్యమానికీ ‘దరువ’య్యాడు. ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారంలో పాల్గొని, తెలంగాణ సాధన పోరులో భాగమయ్యాడు. ఇప్పుడు స్వరాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై తన డప్పెత్తి ప్రచారం చేస్తున్నాడు. 

- భూపాలపల్లిటౌన్‌


జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని వేశాలపల్లికి చెందిన చింతల లక్ష్మీనారాయణ అలియాస్‌ డప్పు లక్ష్మణ్‌కు చిన్నప్పటి నుంచీ కళలంటే ప్రాణం. అందులోనూ డప్పు కొట్టడం అంటే మరింత ఇష్టం. ఊరిలో జరిగే ప్రతి కార్యక్రమంలో ముందుండి డప్పుచప్పుడు వినిపించేవాడు. నాలుగో తరగతి దాకా గ్రామంలోనే చదివి, పక్క ఊరిలో పదో తరగతి పూర్తి చేసి, భూపాలపల్లిలో ఇంటర్‌, డిగ్రీ చదివి ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నాడు. టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని తన డప్పుతో ఉద్యమానికి తోడయ్యాడు. 

మహామహులతో...

తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత అనేక మంది మహామహులైన కళాకారులతో కలిసి తన డప్పు చప్పుడు వినిపించాడు. గద్దర్‌, డోలక్‌ రమేశ్‌, దేశపతి శ్రీనివాస్‌, గిద్దె రాంనర్సయ్య, గోదావరి పద్మక్క, రేలారెరేలా విజయ్‌, రేలారెరేలా కుమార్‌, అమ్మపాట తిరుపతి, ములుగు శంకర్‌, వైనాల రమేశ్‌, గడ్డం రమేశ్‌చంద్ర, డప్పు సత్తి, డప్పు వెంకటేశ్‌ లాంటి అనేక మంది కళాకారులతో కలిసి లక్ష్మణ్‌ పనిచేశాడు. 2006 ఉపఎన్నికలో జగిత్యాల, కరీంనగర్‌, రాయికల్‌ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ తరఫున గూడ అంజన్న, దయా నర్సింగ్‌ తదితరులతో కలిసి దరువేశాడు. భూపాలపల్లికి చెందిన ఓనపాకల కుమార్‌, ఈర్ల సదానందం, తాండ్ర మొగిలి బృందంతో కలిసి పాల్గొన్నాడు.

మచ్చుకు కొన్ని..

2010లో దళిత కళామండలి ఆధ్వర్యంలో తెలుగు లలిత కళాతోరణం హైదరాబాద్‌లో నిర్వహించిన 100గొంతుకలు, వెయ్యి డప్పులు కార్యక్రమంలో పాల్గొని ప్రశంసా పత్రం అందుకున్నాడు. సకల జనుల సమ్మెలో ప్రైవేట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భూపాలపల్లి నుంచి పరకాల అమరధామం వరకు కళాకారుల పాదయాత్రలో పాల్గొని డప్పు దరువేశాడు. భూపాలపల్లిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో వేసిన డప్పు దరువుకు ప్రశంసల వర్షం కురిసింది. హన్మకొండలో 2016లో జరిగిన ధూంధాం తెలంగాణ ఆవిర్భావ సభలో సకల జనుల కళాకారులతో పాల్గొన్నాడు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 2017లో భూపాలపల్లిలో నిర్వహించిన జాగృతి కవితాంజలి కార్యక్రమంలో ప్రత్యేక సన్మానం పొందాడు. 2017లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన యూత్‌ ఫెస్టివల్‌లో డప్పు మాస్టర్‌గా, ఫోక్‌ సింగర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. 2019, 2020లో భూపాలపల్లిలో జరిగిన జాతీయ యువజన దినోత్సవంలో పాల్గొని డీఎఫ్‌వోలు ప్రదీప్‌, పురుషోత్తం చేతుల మీదుగా ప్రశంసలందుకున్నాడు. భూపాలపల్లి ప్రగతి భవన్‌లో సారస్వత సమితి ఆధ్వర్యంలో జరిగిన ‘నిద్రలేచిన నిశబ్దం’ పుస్తకావిష్కరణ సభలో తన డప్పు దరువుతో మంత్ర ముగ్ధుల్ని చేశాడు. సాహిత్య ఆకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చేతులమీదుగా సన్మానం పొందాడు.  logo