మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Sep 15, 2020 , 07:29:30

భారీ వర్షానికి పొంగిన వాగులు

భారీ వర్షానికి పొంగిన వాగులు

  •  కోతకు గురైన కల్వర్టులు
  • నిలిచిన రాకపోకలు

తాడ్వాయి/ గోవిందరావుపేట/ వాజేడు/ కాటారం,  సెప్టెంబర్‌14: ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షం కారణంగా పలు మండలాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. కల్వర్టులు తెగిపోయాయి. తాడ్వాయి మండలంలోని అంకంపల్లి స్టేజీ వద్ద కల్వర్టు కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. వేసవిలో జంతువులకు తాగునీటిని అందిచేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కుంట తెగిపోవడంతో వరద ఎక్కువై కల్వర్టు రోడ్డు కొట్టుకుపోయింది. తాడ్వాయి, కాటాపురం మీదుగా బయ్యారం, ఖమ్మం జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

విషయం తెలుసుకున్న ఆర్‌అండ్‌బీ డీఈ రఘువీర్‌, ఏఈ ప్రమోద్‌కుమార్‌ రోడ్డు మరమ్మతు చేయించారు. రాకపోకలను పునరుద్ధరించారు. మరోసారి ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపడతామని డీఈ తెలిపారు. గోవిందరావుపేట మండలంలోని దయ్యాలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గుండ్లవాగు, దయ్యాల వాగు సమీపంలోని పంట పొలాలు, నీట మునిగాయి. లక్నవరం సరస్సు మరో సారి మత్తడి పోస్తున్నది.  వాజేడు మండలకేంద్రం తోపాటు మండలంలోని ప్రగళ్లపల్లి, జగన్నాథపురం, కోంగాల, గుమ్మడిదొడ్డి, చెరుకూరు, పేరూరు ధర్మవరం తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది . కొన్ని రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. మహాముత్తారం మండలం గిరిజన గ్రామాల్లోని వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. కేశాపూర్‌, పెగడపల్లి గ్రామాల మధ్యలో ఉన్న పెద్ద వాగు లోలెవల్‌ వంతనపై నుంచి వరద ఉప్పొంగింది. పెగడపల్లి, బోర్లగూడెం, కనుకునూర్‌, సింగంపల్లి, స్తంభంపల్లిపీకే, సింగారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహాముత్తారం మండలంలోని పోలంపల్లి గ్రామానికి చెందిన దుర్గం పోచయ్య ఇంట్లోకి వరద చేరడంతో నిత్యావసర సరకులు తడిసి ముద్దయ్యాయి.

ఏటూరునాగారం మండలంలోని జంపన్నవాగు ఉధృతికి జాతీయ రహదారిపై నిర్మించిన వంతెన ఒడ్డు కోతకు గురవుతున్నది. కొద్ది రోజుల క్రితం వరదకు కోతకు గురైన ప్రదేశంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి విభాగానికి చెందిన అధికారులు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు చేపట్టకపోవడంతో బ్రిడ్జి అంచున రోడ్డు కోతకు గురైంది. అధికారులు స్పందించి మరమ్మతు చేయాలని వాహన దారులు కోరుతున్నారు. ఏటూరునాగారం మండల కేంద్రం సమీపంలోని జంపన్న వాగు వరద ఉధృతి తీవ్రంగా ఉంది. మండల కేంద్రంలోని సీఎస్‌ఐ పాఠశాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో రాత్రి వరద చేరడంతో పరిసర నివాసితులు ఇబ్బందులు పడ్డారు. 

శివశంకర్‌ ప్రాజెక్ట్‌ చెరువు కట్టకు గండి

కాటారం మండలంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వీరాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని శివశంకర్‌ ప్రాజెక్ట్‌ చెరువు కట్ట తెగిపోయింది. సుమారు 200లకు పైగా ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ఇసుక మేటలు వేసి పొలాలు దెబ్బతిన్నాయి. అర్ధరాత్రి కుండపోతగా వర్షం కురియడంతో ఒక్కసారిగా కట్ట, తూము బలహీనమై గండి పడింది. చెరువు కట్టను వెంటనే పునరుద్ధరించాలని, తమను ఆదుకోవాలని రైతులు కోరారు. గోపాల్‌పూర్‌ సమీపంలో వాగు పొంగి పత్తి, వరి పంటలు నీట మునిగాయి. నష్టపోయిన పంటలకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


logo