శుక్రవారం 23 అక్టోబర్ 2020
Jayashankar - Sep 01, 2020 , 04:01:16

గంగారాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

గంగారాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా

  • కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌
  • గ్రామానికి జాతీయస్థాయి జీపీడీపీ అవార్డు అందజేత

కాటారం/ జయశంకర్‌భూపాలపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 31 : అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చేలా గంగారం గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. జాతీయ స్థాయిలో గ్రామపంచాయతీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌( జీపీడీపీ) కింద కేంద్ర ప్రభు త్వం ద్వారా ఉత్తమ గ్రామపంచాయతీగా కాటారం మండలంలోని గంగారం గ్రామం ఎన్నికైంది. కరోనా నేపథ్యంలో అవార్డుకు సంబంధించిన ధ్రువీకరణపత్రాన్ని, జ్ఞాపికను కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ పోస్ట్‌లో కలెక్టర్‌కు పంపించింది. ఈ నేపథ్యంలో సోమవారం ధ్రువీకరణ పత్రాన్ని, జ్ఞాపికను గంగారం సర్పంచ్‌ తెప్పల దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్యకు కలెక్టర్‌ అందజేశారు. ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డు సాధించినందుకు సర్పంచ్‌, పంచాయతీ పాలకవర్గాన్ని, మండల అధికారులను ఆయన అభినందించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... ప్రజాప్రతి నిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాభివృద్ధి సాధించాలన్నా రు. గంగారం గ్రామం దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా రెండు అవార్డులను పొందడం జిల్లాకే గర్వకారణమన్నారు.

గ్రామ మహిళలు, యువత, రైతులు, కూలీలు, ప్రతి పౌరుడు సంపూర్ణ అభివృద్ధి సాధించేందుకు  సహకారం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా గంగారం అభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్‌ను ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీవో మల్లిఖార్జున్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ శేనం సమ్మయ్య, వార్డు సభ్యుడు వేణు పాల్గొన్నారు. అదేవిధంగా 2018-19 సంవత్సరానికి గానూ మండలంలోని గంగారం గ్రామపంచాయతీకి డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ కార్యాలయంలో సర్పంచ్‌ తెప్పల దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్యకు కలెక్టర్‌ అవార్డును అందజేశారు.  logo