ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Aug 26, 2020 , 02:16:25

దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మతు చేయండి

దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు మరమ్మతు చేయండి

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 25: వర్షాలతో దెబ్బతిన్న రహదారులు, వంతెనలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేపట్టి ప్రజారవాణాకు అంతరాయం కలుగకుండా చూడాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. అధిక వర్షాలతో జిల్లాలో జరిగిన పంట, ఆస్తి నష్టంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వరుసగా కురిసిన వానలతో రహదారులకు, పంటలకు తీవ్ర నష్టం కలిగిందని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టాలను నివారించగలిగామని అన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం అధిక వర్షాలతో జిల్లా వ్యాప్తంగా 17798 మంది రైతులకు చెందిన 34337 ఎకరాల్లో వరి, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న పంటల విలువ రూ.16 కోట్ల 25 లక్షల ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు.  జిల్లాలో 1124 పాక్షికంగా, 104 పూర్తిగా ఇళ్లు దెబ్బతిన్నాయని వాటి విలువ సుమారు రూ.63 లక్షల 85 వేల ఆరువందలు ఉంటుందని అన్నారు. 62 చెరువులు కోతకు గురయ్యాయని వారి మరమ్మతుకు కూ. కోటి 3 లక్షలు అవసరమని, రూ.7 లక్షల 36 వేల రూపాయల విలువైన 20 మంది రైతులకు చెందిన 70 పశువులు మృత్యువాత పడ్డాయని, రూ.7 లక్షల 36 వేల విలువైన 262 విద్యుత్తు స్తంభాలు 239 ఇతర విద్యుత్తు పరికరాలు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రహదారులు, వంతెనల విలువ రూ.కోటి 99 లక్షలు, దెబ్బతిన్న పంచాయతీరాజ్‌ రహదారులు, ఇతర భవనాల విలువ రూ.5 కోట్ల 72 లక్షలుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపపారు. భూపాలపల్లి పట్టణ పరిధిలో 27 ఇళ్లు పాక్షికంగా, 4 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేలా నివేదికలు సిద్ధం చేసి చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో చలివాగు, మోరంచ వాగుల పరీవాహక ప్రాంతాల్లో పంటలకు అధిక నష్టం వాటిల్లిందని, వర్షం నీటితో తాగునీరు కలుషితం కాకుండా పైపులైన్లను పరిశీలించాలని, మురుగు కాలువలను శుభ్రం చేసి పారిశుధ్య పనులు చేయించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, జిల్లా పంచాయతీ అధికారి సుధీర్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటేశ్‌, ఇరిగేషన్‌ ఈఈ జగదీశ్‌, జిల్లా వ్యవసాయ అధికారి సత్యంబాబు, సీపీవో భిక్షపతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ నిర్మల, మిషన్‌ భగీరథ డీఈ పరమేశ్వరీ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ పాల్గొన్నారు.


logo