మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Aug 16, 2020 , 02:14:33

చలివాగులో చిక్కిన రైతులు

చలివాగులో చిక్కిన రైతులు

  • మంత్రి కేటీఆర్‌ చొరవతో సురక్షితంగా ఒడ్డుకు
  • కరెంట్‌ మోటర్లు మునిగిపోతాయనివెళ్లిన పది మంది
  • వరద ఉధృతితో అయోమయం
  • రోడ్డు తెగిపోవడంతో పోలీస్‌, ఫైర్‌ సిబ్బంది వెళ్లలేని పరిస్థితి
  • కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే గండ్ర ఫోన్‌
  • ఆ వెంటనే రంగంలోకి రెండు హెలీకాప్టర్లు

 టేకుమట్ల : వరద ప్రవాహంలో చిక్కిన రైతులు ఎట్టకేలకు క్షేమంగా ఇంటికి చేరారు. వర్షానికి పొలం వద్ద మోటర్లు కోసం కొట్టుకుపోతాయేమోనని శనివారం ఉదయం కుందనపల్లి గ్రా మానికి చెందిన పది మంది రైతులు వెళ్లగా అదే సమయంలో చలివాగు ఉగ్రరూపం దాల్చింది. ఏం చేయాలో దిక్కుతోచక ముందుకు వెళ్లలేక వెనక్కిరాలేక బిక్కుబిక్కుమంటూ ప్రాణా లు అరచేతిలో పెట్టుకున్నారు. ఇంతలో స్థానిక అధికారుల ద్వా రా ఎమ్మెల్యేకు అటునుంచి మంత్రి ఎర్రబెల్లి దృష్టికి వెళ్లగా వెం టనే ఆయన మంత్రి కేటీఆర్‌కు సమాచారమిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు రెండు హెలీకాప్టర్లు రంగంలోకి దిగడంతో రైతులను సాయంత్రం 4గంటల వరక సురక్షితంగా దింపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అసలు బతికి వస్తామోలేదో అనుకున్న ఆ రైతులు ఇల్లుచేరడంతో వారి కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వివరాలు.. టేకుమట్ల మండలం కుందనపల్లికి చెందిన పది మంది రైతు లు (మాడుగుల ప్రకాశ్‌, అబ్బా అశోక్‌, సమ్మయ్య, రాజకొమురు, తిరుపతి రమేశ్‌, రవీందర్‌, పైడయ్య, మోహన్‌, గట్టు) వ్యవసాయ మోటర్లు తెచ్చుకునేందుకు శనివారం ఉదయం 6గంటలకు ట్రాక్టర్‌లో చలివాగు ఒడ్డుకు వెళ్లారు. ఆ తర్వాత అరగంటలోనే వాగు ఉగ్రరూపం దాల్చింది. పరిస్థితి నుంచి వెనక్కి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ వాగు ఊరిని ఆనుకొని కిలో మీటర్‌ వెడల్పుతో ఉప్పొంగడంతో మళ్లీ వెనక్కి వెళ్లి ఎల్లమ్మ గుడిలోకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు.

40నిమిషాల్లో ఘటనా స్థలికి హెలీకాప్టర్లు

విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు, అటు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చారు. టేకుమట్ల-రాఘవారెడ్డిపేట మధ్య వంతెన రోడ్లు వరద ఉధృతికి తెగిపోయే స్థితికి చేరుకుంది. దీంతో ఫైర్‌ సిబ్బంది తమ వాహనాన్ని టేకుమట్లలోనే నిలిపి ట్రాలీలో కుందనల్లికి చేరుకున్నారు. వరద తాకిడికి ఓ కల్వర్టు, సీసీరోడ్టు కొట్టుకుపోయి ఆ మార్గం తెగిపోయింది. ఇక తాము వెళ్లలేమని ఫైర్‌ సిబ్బంది చెప్పడంతో తహసీల్దార్‌ నరేశ్‌, ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి సంపత్‌గౌడ్‌లు.. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌లకు సమాచారమివ్వడంతో వెళ్లి పరిశీలించారు. ఎమ్మెల్యే రమణారెడ్డి, మంత్రి దయాకర్‌రావు మంత్రి కేటీఆర్‌కు విషయం చెప్పడంతో ఆయన ఏవియేషన్‌ డైరెక్టర్‌ భరత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌లతో ఫోన్లో మాట్లాడారు. ఆ వెంటనే 40 నిమిషాల్లోనే రెండు హెలీకాప్టర్లను సంఘటన స్థలానికి పంపారు. అవి నాలుగు రౌండ్లలో రైతులను సురక్షిత ప్రాంతానికి తరలించి వెళ్లిపోయాయి. దీంతో రైతులు గ్రామస్తులు మంత్రి కేటీఆర్‌కి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంటకరమణారెడ్డికి, కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సహాయక చర్యల్లో అదనపు కలెక్టర్‌ గణేశ్‌, ఏఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్‌ నరేశ్‌, సీఐ సాయి రమణ, ఎస్సై రమణారెడ్డి, ఎంపీపీ మాల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కత్తి సంపత్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

ప్రభుత్వ కంటిరెప్పలా కాపాడుకుంటుంది


ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డను కేసీఆర్‌ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. వాగులో పది మంది రైతులు చిక్కుకున్నారన్న విషయం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్‌కి ఫోన్‌లో చెప్పాను. వెంటనే హెలీకాప్టర్‌ పంపిస్తామన్నారు. విషయం తెలుసుకున్న కేసీఆర్‌ రైతుల ప్రాణాలే ముఖ్యమని సంఘటన స్థలంలో ఉండి పరిస్థితులను పరిశీలించాలని నాకు సూచించారు. వాతావరణం అనుకూలించపోయినా కూడా ఒక్క హెలికాప్టర్‌ అయితే ఇబ్బంది అవుతుందని, రెండు హెలికాప్టర్లను కేవలం 40 నిమిషాల్లో పంపి వాళ్ల ప్రాణాలు కాపాడారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు.

- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

బతుకుతం అనుకోలే..


ఉన్నట్టుండి ఉధృతంగా వచ్చిన వరదను చూసి భయమైంది. ఇగ బతుక తం అనుకోలే. మా పరిస్థితి ఎవ్వరికీ చెప్పేటట్టు లేదప్పుడు. సెల్‌ఫోన్లు లేవు.. మెత్తుకున్నా ఎవ్వలకి ఇనపడలే. ఇగ చావు తప్పదు అనుకున్నాం. ఒకరినొకరం చూసుకుంట బయపడుతూ ఎల్ల మ్మ గుడిలో నడుముల మట్టి నీటిలో దాక్కున్నం. మమ్ము ల కాపానిడిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటాం.

-మాడుల రాజకొమురయ్య వాగులో చిక్కుకున్న రైతు

హెలీకాప్టర్లను జూసి పానమచ్చింది..


వాగు ఒడ్డు దాంకనే కదా పోయి మోటర్లను తీసుకువద్దాం అనుకున్నం. కానీ వరద చూసిన తర్వాత ఎటుపో వాల్నో తెల్వక ఒకరినొకరు గట్టిగ పట్టు కున్నం. గింత వరదను నేను జీవితంలో చూడలే. సూత్తాంటె ఇంకా ఎక్కువనే అయితాంది. ఇగ మన అయిపోయిందరా అనుకున్నా. ఇంతల్నే పైకెల్లి హెలీ కాప్టర్లను తిరుగుతానయ్‌. వాటిని జూసినంక మాకు పాన మచ్చింది. మా కోసం సర్కారు హెలీకాప్టర్లు పంపుతదని కలల గూడ అనుకోలె. మా కోసం కష్టపడ్డోళ్లందరికీ దండాలు. 
  - రవీందర్‌, రైతు 


logo