ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Aug 10, 2020 , 01:05:31

పశువులను మేపేందుకు వెళ్లి విగత జీవులై

పశువులను మేపేందుకు వెళ్లి విగత జీవులై

మొగుళ్లపల్లి, ఆగస్టు 9 : పశువులను మేపేందుకు వెళ్లిన తండ్రీకొడుకులు విగత జీవులై తిరిగొచ్చారు.  హృద య విదారకమైన ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తు లు, పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుల్యాల ఓదెలు(75)కు ఆరుగురు కొడుకులు. అందులో నలుగురికి వివాహం జరిగింది. మిగిలిన ఇద్దరు కొడుకులతో కలిసి గ్రామంలో పశువులను మేపుతూ  జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్న కుమారుడు పుల్యాల మధుకర్‌(28)తో కలిసి శనివారం ఉదయం పశువులను మేపేందుకు గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో గేదెలు చెరువులోకి వెళ్లడంతో ఓదెలు వాటిని బయటకు తోలుకొని వచ్చేందుకు అందులోకి దిగాడు. అయితే, లోపల ఉన్న చెట్లకు చిక్కుకొని నీటిలో మునిగాడు. దీనిని గమనించిన మధుకర్‌ వెంటనే తండ్రిని కాపాడేందుకు చెరువులోకి దిగి తాను కూడా మునిగిపోయాడు. అయితే, శనివారం రాత్రి వరకూ వీళ్లిద్దరు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అంతటా గాలించారు. అయినా వారి ఆచూకీ దొరకలేదు. చివరకు చెరువు వద్ద గేదెలు కాస్తూ కనిపించారని గ్రామస్తులు చెప్పడంతో ఆదివారం ఉదయం అక్కడికి వెళ్లి వెతకడంతో మొదట ఓదెలు చేతికర్ర కనిపించింది. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలు చెరువులో బయటపడ్డాయి. సంఘటన స్థలానికి ఎస్సై నిహారిక చేరుకొని మృతదేహాలను బయటకు తీయించారు. ఓదెలు పెద్దకొడుకు సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఒకేసారి తండ్రీకొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

దంతాలపల్లి, ఆగస్టు 9 : చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తి పడి ఉన్నట్లు ఆదివారం తెల్లవారుజామున స్థానికులు తెలపడంతో పోలీసులు వెళ్లారు. ఆ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉండడంతో సర్పంచ్‌ సుస్మిత, ఎంపీటీసీ యాకన్న సహకారంతో 108 వాహనంలో మహబూబాబాద్‌ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడు సుమారు 45 ఏళ్లు ఉంటాడని, సంబంధించిన వారు తొర్రూరు సీఐ 94406 27758, దంతాలపల్లి ఎస్సై 79010 97182 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.logo