శనివారం 24 అక్టోబర్ 2020
Jayashankar - Aug 10, 2020 , 00:53:47

నులిపురుగులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు

నులిపురుగులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు

పిల్లల పొట్టలో తిష్ఠవేసి, పోషకాలను ఆరగిస్తూ, ఆరోగ్యాన్ని హరించే నులిపురుగులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ముందుజాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అది వారి ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుంది. అందుకే ఏడాది వయస్సు నుంచి 19 ఏళ్లలోపు అందరికీ సంవత్సరానికి రెండు సార్లు(ఫిబ్రవరి 10, ఆగస్టు 10న) ఆల్బెండజోల్‌ మాత్రలు వేస్తూ నివారణకు కృషిచేస్తోంది ప్రభుత్వం. నేడు జాతీయ నులి పురుగుల నివారణ దినం సందర్భంగా ‘నమస్తే’ కథనం..  

ఎలా ప్రవేశిస్తాయి..

చిన్నారులు మట్టిలో ఆడి, చేతులు కడగకుండా భోజనం చేసినప్పుడు అందులో ఉండే రకరకాల నులిపురుగుల లార్వాలు నోటి ద్వారా కడుపులోకి ప్రవేశిస్తాయి. పేగుల్లో పూర్తిస్థాయి నులిపురుగులుగా అభివృద్ధి చెంది, అక్కడే తిష్ఠవేస్తాయి. 18 ఏళ్లలోపు చిన్నారులు, బాలబాలికల ఆరోగ్యంపై ఈ నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. వీరు తినే ఆహారం పేగుల్లోకి చేరినప్పుడు రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకోవడంతో చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయి వివిధ రోగాలబారిన పడుతారు. ఆకలి మందగించి ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

పురుగులు మూడు రకాలు

పిల్లల పేగుల్లో సాధారణంగా మూడు రకాల పురుగులు తిష్ఠవేస్తాయి. వీటిలో ఏలిక పాములు(ఆస్కారిస్‌ లుంబ్రికాయిడ్స్‌), కొంకి పురుగులు(అంకైలోస్టోమాడియోడెనేల్‌), చుట్టపాములు(టీనియా సోలియం) అనే మూడురకాలుంటాయి. ఈ నులిపురుగులు 55 ఫీట్ల(17 మీటర్ల)దాకా పెరిగి 25 ఏళ్ల దాకా బతుకుతాయి. వీటి గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి. సరిగ్గా ఉడికించని పంది, గొడ్డు మాంసాల ద్వారా చుట్టపురుగులు కడుపులోకి చేరుతాయి. మట్టిలో ఆడితే పాదాల ద్వారా కొంకి పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

పిల్లల్లో కనిపించే ఆరోగ్య సమస్యలు..

నులి పురుగుల వల్ల పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా రక్తహీనత, పోషకాహార లోపం బారినపడతారు. ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. నులి పురుగులు ఉన్న బాలబాలికలు ఆరుబయట మలవిసర్జన చేస్తే, అవి ఇతరుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. మల పరీక్ష ద్వారా నులి పురుగులను గుర్తించవచ్చు. నులి పురుగుల లార్వాలు 20 లోపు ఉంటే మా మూలు, 20 నుంచి 40 దాకా ఉంటే మధ్యస్తంగా, 40కి పైగా ఉంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు భావిస్తారు.

ముందుజాగ్రత్తే మేలు..

  • నులి పురుగుల నివారణకు పరిశుభ్రతను మించిన మందు లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వారిచ్చే ముఖ్య సలహాలివి.
  • గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి.
  • స్వచ్ఛమైన నీటిని తాగించాలి.
  • ఆహారంపై ఈగలు, దోమలు వాలకుండా చూడాలి.
  • పండ్లను, కాయగూరలను శుభ్రమైన నీటితో కడిగి ఇవ్వాలి.
  • బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా మరుగుదొడ్డిని మాత్రమే ఉపయోగించాలి.
  • మలవిసర్జన తర్వాత, భోజనానికి ముందు చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
  • ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • షూ, చెప్పులను ధరించి బయటకు వెళ్లాలి.

ఎలా తగ్గిద్దామంటే..

మల బద్ధకం తగ్గేందుకు పీచు పదార్థాలు, మజ్జిగ, నీరు ఎక్కువగా తీసుకోవాలి. నులి పురుగులకు ముల్లంగి, మెంతికూర, వాము, ఇంగువ, జీలకర్ర చక్కని ఔషధాలు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పొట్టలోని నులి పురుగులు వెలుపలికి వచ్చేందుకు వాము పొడిని కప్పు నీళ్లలో కాచి, వడబెట్టి, చెంచా చొప్పున తులసి ఆకు రసం, తమలపాకు రసం కలిపి పిల్లలకు పట్టించాలి. పెద్దవాళ్లయితే ఆముదం ఒక చెంచా, వాము అరచెంచా, నల్ల జీలకర్ర పావు చెంచా, బెల్లం తగినంత, నల్ల నువ్వులు చెంచా తీసుకోవాలి. ఆముదాన్ని వేడినీటిలో కలిపి ఈ ద్రవాలను విడిగా కలిపి ఉండలా చేసి ఆముదం నీటిని అనుపానంగా రాత్రి భోజనం అయ్యాక తీసుకోవాలి. 


logo