శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jayashankar - Aug 10, 2020 , 00:45:01

తీరిన ప్ర‌యాణ క‌ష్టాలు

తీరిన ప్ర‌యాణ క‌ష్టాలు

మహాముత్తారం : మండలంలోని దౌతుపల్లి వాగుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షలతో కల్వర్టు నిర్మించింది. దీంతో చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు రాకపోకల ఇబ్బందులు తీరిపోయాయి. సమైక రాష్ట్రంలో పాలకులు పట్టించుకోక ఇక్కడ ఇంతకు ముందున్న కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. చిన్న పాటి వర్షానికే రెండు మూడు రోజులు వాగు ఉప్పొంగి, గిరిజన గ్రామాలకు రవాణా స్తంభించేది. వందల మీటర్ల దూరం వాగు పైనుంచి వరద పోవడంతో పంట పొలాలన్నీ నాశనమయ్యేవి. గతంలో వాగులో పడి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. అటవీశాఖ సిబ్బంది వాహనం వాగు ప్రవాహనికి కొట్టుకు పోయింది. యామన్‌పల్లికి చెందిన ఓ రైతు దుక్కిటెడ్లు సైతం కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయి. రెవెన్యూ కార్యాలయంలో పని చేసే ఉద్యోగి కల్వర్టు గుంతలో బైక్‌ పడి అతడి చెయ్యి విరిగింది. గిరిజన గ్రామాల ప్రజల ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీ పైపులతో కూడిన కల్వర్టును నిర్మించింది. దీంతో ఇక్కడి వారికి రాకపోకల కష్టాలు తీరిపోయాయి.