ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Aug 09, 2020 , 01:40:53

గ్రామాల్లో ‘గందగీ ముక్త్‌ భారత్‌' నిర్వహించాలి

గ్రామాల్లో ‘గందగీ ముక్త్‌ భారత్‌' నిర్వహించాలి

  • పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  • కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌
  • ఎంపీడీవోలు, సర్పంచులతో వెబినార్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 8 : ప్రజల్లో పారిశుధ్యం, పరిశుభ్రతపై వాంఛనీయ మార్పు తీసుకువచ్చేలా గందగీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అ జీమ్‌ సర్పంచులను కోరారు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ వెబ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని సర్పంచులు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన గందగీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరా తలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి సర్పంచులు, కార్యదర్శులు, ఎం పీడీవోలు, మండల పంచాయతీ అధికారులు కృషి చేయాలన్నారు. నేటి నుంచి వారం రోజులపాటు గ్రామాల్లో గందగీ ముక్త్‌ భారత్‌ వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా 9వ తేదీన సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి వాటి నుంచి మళ్లీ ఉపయోగపడే ప్లాస్టిక్‌ను వేరు చేసేలా అవగాహన కల్పించడం, 10 న ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసేందుకు శ్రమదానం నిర్వహించాలని, 11 న ప్రజలకు పరిశుభ్రతపై ప్రేరణ కలిగేలా గోడలపై పెయింటింగ్స్‌ వేయించాలని, 12 న మొక్కలు నాటాలని, 13 న ‘గ్రామం మురికి రహితం’ అనే అంశంపై 6,7 తరగతుల విద్యార్థులకు పెయింటింగ్స్‌, 9,10 తరగతుల వారికి వ్యాసరచన పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని, 14 న పీహెచ్‌సీల్లో పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని, 15 న గ్రామ సభ నిర్వహించి పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజలతో ప్రమాణం చేయించాలన్నారు. ఈ వెబ్‌ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, డివిజనల్‌ పంచాయతీ అధికారి సుధీర్‌కుమార్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ జిల్లా ప్రాజెక్ట్‌ అధికారి వెంకటేశ్‌, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ఐసొలేషన్‌ కేంద్రాలు తెరవాలి..

మంథని నియోజకవర్గంలో వెంటనే ఐసొలేషన్‌ కేంద్రాలను తెరవాలని కోరుతూ కలెక్టర్‌కు ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌బాబు ఆన్‌లైన్‌లో వినతిపత్రం అందజేశారు. మంథని నియోజకవర్గంలో జిల్లాలోని కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌, పలిమెల మండలాల పరిధిలో గుర్తించిన ఐసొలేషన్‌ కేంద్రాలను వెంటనే తెరవాలని కోరారు.


logo