ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jayashankar - Aug 08, 2020 , 02:54:54

ముఖాల్లో చిరునవ్వులు చిందించాలి

ముఖాల్లో చిరునవ్వులు చిందించాలి

కృష్ణకాలనీ, ఆగస్టు7: స్ట్రీట్‌ వెండర్స్‌ పథకం ద్వారా వీధి వ్యాపారులు ముఖాల్లో చిరువ్వులు చిందించాలని జయశంకర్‌ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల అజీమ్‌ అన్నారు. భూపాలపల్లి పట్టణం కారల్‌ మార్క్స్‌ కాలనీ జంగేడు ఎస్బీఐలో శుక్రవారం మెప్మా ఆధ్వర్యంలో స్ట్రీట్‌ వెండర్స్‌ పథకం ద్వారా పట్టణంలోని వీధి వ్యాపారులకు రుణ సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వీధి వ్యాపారులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తోందన్నారు. ఇప్పటికే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బ్యాంకర్లు మున్సిపాలిటీ అధికారుల సహకారంతో వీధి వ్యాపారులను గుర్తించారని అన్నారు. వారికి రుణాలను అందించి మళ్లీ వారు వ్యాపారాలను చేసుకొని ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకర్లు లక్ష్యం మేరకు రుణాలను మంజూరు చేయాలని అన్నారు. 

సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే గండ్ర

వీధి వ్యాపారులను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్ట్రీట్‌ వెండర్స్‌ పథకాన్ని ప్రతి వీధి వ్యాపారి సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌ డౌన్‌ విధించిన నేపథ్యంలో వాపారాలను మూసి వేయడం ద్వారా ఉపాధి కోల్పోయి బతకడమే భారం అవుతున్న ఈకష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారులను గుర్తించి స్ట్రీట్‌ వెండర్స్‌ కార్యక్రమాన్ని తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అందించే రుణాలకు వడ్డీ లేనందున వీధి వ్యాపారులు ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని, మళ్లీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకొని సకాలంలో బ్యాంకు రుణాలను చెల్లించాలని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని రుణాలను తీసుకోవాలని వీధి వ్యాపారులకు సూచించారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్లు శిరుప అనిల్‌, ఎడ్ల మౌనిక శ్రీనివాస్‌, ముంజాల రవీందర్‌, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, నాయకులు బుర్ర రమేశ్‌, కుమార్‌ రెడ్డి, బ్యాంకు మేనేజర్‌ కుమారస్వామి తదితరలు పాల్గొన్నారు. 


logo