బుధవారం 30 సెప్టెంబర్ 2020
Jayashankar - Aug 08, 2020 , 02:49:16

‘గని ప్రమాదం’పై డీడీఎంఎస్‌ (మెడికల్‌) విచారణ

‘గని ప్రమాదం’పై డీడీఎంఎస్‌ (మెడికల్‌) విచారణ

భూపాలపల్లి : ఇటీవల  గని ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్న  సింగరేణి కార్మికుడు నామాల శ్రీనివాస్‌కు వైద్యం చేస్తున్న తీరుపై శుక్రవారం డిప్యూటీ డైరెక్టర్‌ మైన్స్‌ సేఫ్టీ (డీడీఎంఎస్‌) మెడికల్‌  డాక్టర్‌  కౌశిక్‌ సర్కార్‌ శుక్రవారం విచారణ జరిపారు, జూలై 24న కేటి కే 5 భూగర్భ గనిలో పైకప్పు కూలి పడిన ఘటనలో సపోర్ట్‌మెన్‌ నామాల శ్రీనివాస్‌  కుడికాలు విరిగిన విషయం విదితమే. కాగా, భూపాలపల్లి ఏరి యా దవాఖానలో శ్రీనివాస్‌కు ప్రథమ చికిత్స చేసిన తర్వాత డీవైసీఎంవో డాక్టర్‌ పద్మజారాణి వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు పంపించారు. చికిత్స అనంతరం జూలై 29న  శ్రీనివాస్‌ను భూపాలపల్లి సింగరేణి ఏరియా దవాఖానకు పంపించారు. కాగా, పరీక్షించిన వైద్యుడు వరంగల్‌ దవాఖానలో సరిగా వైద్యం చేయలేదని, హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం శ్రీనివాస్‌ను ఇంతకు ముందు వైద్యం అందించిన వరంగల్‌ దవాఖానకే పంపించారు. ఆ దవాఖానలో కొవిడ్‌ కేసులు ఉన్నాయనే కార ణం చూపి వారు అడ్మిట్‌ చేసుకోలేదు. దీంతో వరంగల్‌లోని మరో దవాఖానకు పంపించారు. అక్కడి డాక్టర్లు పరిక్షీంచి కాలుకు ఇన్‌ఫెక్షన్‌ అయ్యిందని, అక్కడి వరకు తొలగించాలని చెప్పారు. కాగా, శుక్రవారం ఉదయం ఇన్‌ఫెక్షన్‌ అయిన కాలు భాగాన్ని డాక్టర్‌ తొలగించారని శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్‌కు కాలు తీసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయమై సంబంధిత డాక్టర్లు, వైద్య సిబ్బందిని డీడీఎంఎస్‌ విచారించారు. గని ప్రమాద బాధితులకు సరైన వైద్యం అందుతున్నదా? సకాలంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా? తదితర అంశాలపై విచారణ జరిపారు. సమగ్ర విచారణ చేస్తున్నామని, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీడీఎంఎస్‌, డాక్టర్‌  కౌశిక్‌ తెలిపారు. 

తాజావార్తలు


logo