బుధవారం 30 సెప్టెంబర్ 2020
Jayashankar - Aug 06, 2020 , 03:55:38

దవాఖానలో వంద పడకలు సిద్ధం చేయాలి

 దవాఖానలో వంద పడకలు సిద్ధం చేయాలి

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 5: కరోనా చికిత్స కోసం 100 పడకల దవాఖానను సిద్ధం చేయాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. కరోనా నియంత్రణ, వైద్య సేవలు, ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌, రైతు వేదికలు, కల్లాల నిర్మాణం, అర్బన్‌ ట్రీ పార్క్‌, చెత్త డంపింగ్‌ యార్డులు, ఇంకుడు గుంతల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాధి బారినపడుతున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భూపాలపల్లి పట్టణంలోని దవాఖానలో వంద పడకలను సిద్ధం చేయాలన్నారు. వాటిలో 30 పడకలతో  ఐసీయూ వార్డు ప్రత్యేకంగా రూపొందించాలన్నారు. వైద్యానికి అవసరమైన అన్ని వైద్య పరికరాలను నాలుగైదు రోజుల్లోగా సమకూర్చుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధార్‌సింగ్‌ను ఆదేశించారు. ప్రతి పీహెచ్‌సీలో కరోనా ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించి కరోనా పాజిటివ్‌ వచ్చినవారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీ ప్రాంతాల్లోని వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేసేందుకు మున్సిపాలిటీ వారితో కలిసి బ్యాంకర్లు  ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 23 రైతు వేదికల నిర్మాణ పనులు ప్రారంభం కాగా మిగతావి వెంటనే చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును వేగంగా చేయాలని, ప్రభుత్వ భూములు అందుబాటులో లేని గ్రామాల్లో అటవీ శాఖ సహకారంతో  ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 60 అర్బన్‌ ట్రీ పార్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు. నాలుగు రోజుల్లోగా పట్టాదారు పాసుపుస్తకాల వివరాలను క్రమబద్దీకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం, జిల్లా వ్యవసాయ అధికారి సత్యంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ఎల్డీఎం శ్రీనివాస్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సుధార్‌సింగ్‌ పాల్గొన్నారు.


logo