శనివారం 24 అక్టోబర్ 2020
Jayashankar - Aug 06, 2020 , 03:14:48

అలమటింత.. లేదిక చింత‌

అలమటింత.. లేదిక చింత‌

వన్యప్రాణుల ఆకలి తీర్చేందుకు అటవీ శాఖ వనాల్లో విరివిగా గడ్డిక్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఆహారం కోసం అడవి దాటి బయటకు వెళ్లేటప్పుడు, ఉన్నచోట గడ్డి దొరక్క ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు జంతువులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతుంటాయి. అందుకే వాటి కోసం వనంలోనే పుష్కలంగా ఆహారం దొరికేలా గ్రాస్‌ ప్లాంటేషన్‌ చేశారు. ఫలితంగా జంతువులే గాక పక్షులు సైతం వృద్ధి చెందుతుండగా జీవవైవిధ్యం పెంపొందుతున్నది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో 65.27 హెక్టార్లలో అడవి కంది, అడవి పెసర, అడవి చిక్కుడు, సజ్జ లాంటి గడ్డి జాతి మొక్కలు పెంచుతూ జీవుల మనుగడ కోసం చర్యలు తీసుకుంటున్నారు. -  

వన్యపాణులకు అందుబాటులో ఆహారం దొరికేలా అటవీ శాఖ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని అడవుల్లో 65.27 హెక్టార్లలోని గడ్డి క్షేత్రాల్లో గడ్డి పెంచుతోంది. భూపాలపల్లి అటవీ డివిజన్‌లోని అజంనగర్‌ అటవీ రేంజ్‌ పరిధిలో 7.37 హెక్టార్లు, భూపాలపల్లి అటవీ రేంజ్‌ పరిధిలో ఎనిమిది హెక్టార్లు, చెల్పూర్‌ అటవీ రేంజ్‌ పరిధిలో 5.70 హెక్టార్లు, దూదేకులపల్లి అటవీ రేంజ్‌ పరిధిలో ఎనిమిది హెక్టార్లు, కొయ్యూరు అటవీ రేంజ్‌ పరిధిలో 15 హెక్టార్లలో గడ్డి పెంచుతోంది. అలాగే మహదేవ్‌పూర్‌ అటవీ డివిజన్‌లోని కాటారం అటవీ రేంజ్‌ పరిధిలో ఏడు హెక్టార్లు, పెగడపల్లి అటవీ రేంజ్‌ పరిధిలో 4.50 హెక్టార్లు, మహదేవ్‌పూర్‌ అటవీ రేంజ్‌ పరిధిలో ఒక హెక్టారు, పలిమెల అటవీ రేంజ్‌ పరిధిలో 8.70 హెక్టార్లలోని గడ్డి క్షేత్రాల్లో 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అటవీ శాఖ గడ్డి పెంచుతోంది.

వన్యప్రాణుల కోసం గడ్డి క్షేత్రాలు

ప్రధానంగా వేసవి కాలంలో ఆహారం దొరకక వన్యప్రాణులు అడవి నుంచి బయటకు వచ్చి వేటగాళ్ల బారినపడి మృత్యువాతపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరికొన్ని సార్లు ఆహారం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. వీటిని గమనించి అటవీ శాఖ వన్యప్రాణులకు అడవిలోనే పుష్కలంగా ఆహారం దొరికేలా గడ్డిక్షేత్రాలు ఏర్పాటుచేసింది. ఇందుకోసం అడవి కంది, అడ వి పెసర, అడవి చిక్కుడు, సజ్జ లాంటి అడవిజాతి మొక్కలను పెంచుతోంది. ఇందులోని గడ్డి ఏపుగా పెరగడంతో కుందేళ్లు, అడవి పందులు, చుక్కల జింకలు, కొండ గొర్రెలు, మనుబోతులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, నీలుగాయిలకు ఇప్పుడు ఆహారం పుష్కలంగా దొరుకుతోంది. దీంతో పాటు జంతువులు దాహం తీర్చుకునేందుకు అడవుల్లో నీటి కుంటలు, సాసర్‌ పిట్లు ఏర్పాటు చేసింది. తద్వారా శాకాహారంపై ఆధారపడే వన్యపాణి సంపద గణనీయంగా వృద్ధి చెందుతున్నది

పెరుగుతున్న జంతు సంపద

గడ్డి క్షేత్రాల ఏర్పా టుతో వన్యప్రాణులతో పాటు ఇతర జంతు సం పద కూడా వృద్ధి చెందు తున్నది. చిరుత పులులు, అడవి కుక్కలు, తోడేళ్లు, హైనాలు, నక్కలు తదితర జంతువులకు మాంసా హారం కావాలి. ఇవి ఎక్కువగా వన్యప్రాణులను వేటాడి చంపి తింటుంటాయి. అటవీ శాఖ గడ్డి పెంచడం వల్ల వన్యప్రాణులకు సరిపడా ఆహారం దొరకడమే గాక వాటిపై ఆధారపడే జంతువులకు సరిపడా ఆహారం అందుతున్నది. ఫలితంగా మాంసాహార జంతువుల సంఖ్య పెరుగుతున్నది. వీటితో పాటు పక్షులు కూడా వృద్ధి చెందుతున్నాయి. నీటి జాతి పక్షులైన జకానస్‌, నీటి బాతులు, ఇతర పక్షి జాలం వృద్ధి చెందడంతో పాటు, గడ్డి తేమను ఆపడం వల్ల వానపాములు, నత్తలు, కప్పలు, పాములు, జెర్రులు వృద్ధి చెందుతున్నాయి. 

జీవవైవిధ్యం పెంపు

గడ్డి క్షేత్రాలతో చాలా ప్రయోజనాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న కంపా, హరితహారం పథకాలతో అటవీ వృక్ష సంపద గణనీయంగా వృద్ధి చెందుతున్నది. గడ్డి క్షేత్రాలతో వన్య పాణులు, పక్షుల సంఖ్య పెరుగుతున్నది. ఫలితంగా పర్యావరణ సమతుల్యతతో పాటు జీవవైవిధ్యం పెంపొందుతున్నది.  - పురుషోత్తం, డీఎఫ్‌వో, జయశంకర్‌ భూపాలపల్లి


logo