సోమవారం 28 సెప్టెంబర్ 2020
Jayashankar - Aug 04, 2020 , 09:09:33

ప్రజలకు నిరంతర వైద్యసేవలందించాలి

ప్రజలకు నిరంతర వైద్యసేవలందించాలి

  • ఎంపీపీ పంతకాని సమ్మయ్య
  •  ప్రైవేట్‌ దవాఖానల వైద్యులతో అత్యవసర సమావేశం

కాటారం, ఆగస్టు3: మానవతా ధృక్పథంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు నిరంతర వైద్యసేవలు అందించేందుకు ప్రైవేట్‌ దవాఖానల నిర్వాహకులు, వైద్యులు కృషి చేయాలని ఎంపీపీ పంతకాని సమ్మయ్య కోరారు.  సోమవారం ఎంపీపీ కార్యాలయంలో మండలకేంద్రంలోని ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలు, వైద్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మండలంలోని ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యాలు తీసుకున్న స్వచ్ఛంద లాక్‌డౌన్‌ నిర్ణయంతో గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దవాఖానల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అత్యవసర సేవలతో పాటు అన్ని రకాల వైద్య సేవలు అందించాలన్నారు.

సేవా ధృక్పథంతో ముందుకు వచ్చి వెంటనే దవాఖానలు తెరవాలని, ఇబ్బందులు కలుగకుండా తాము కూడా సహకారాన్ని అందిస్తామని అన్నారు. దీంతో వైద్యులు మంగళవారం నుంచి దవాఖానలో తెరుస్తామని హామీ ఇచ్చారు. కరోనా లక్షణాలు ఉన్న వారు, కరోనా సోకిన ప్రైమరీ కాంటాక్ట్‌ సభ్యులు ప్రభుత్వ దవాఖానకే వెళ్లాలని సూచించారు. వైద్యం కోసం వచ్చే రోగులు భౌతికదూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. ప్రజలు తగిన సహకారం అందిస్తేనే వైద్యసేవలు కొనసాగిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు తోట జనార్దన్‌, మహేశ్‌ రవీందర్‌రావు, ప్రైవేట్‌ దవాఖానల బాధ్యులు ఎండీ రఫీ, ప్రసాద్‌, సురేశ్‌, బండి శ్రీను, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo