బుధవారం 21 అక్టోబర్ 2020
Jayashankar - Jul 29, 2020 , 02:36:09

ఆగస్టు 7 లోగా కో ఆప్షన్‌ ఎన్నిక

ఆగస్టు 7 లోగా కో ఆప్షన్‌ ఎన్నిక

కౌన్సిల్‌ సమావేశానికి  అధికారుల సన్నాహాలు

బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన

భూపాలపల్లి టౌన్‌, జూలై 28 : మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 7 లోగా కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసి నలుగురు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహింనున్నారు. ఎంపీపీ ఎన్నిక తరహాలో చేతులు ఎత్తే పద్ధతిలో ఉంటుందని అధికారులు చెప్తు న్నారు. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అధికారులు పరిశీలించి తుది జాబితా ప్రకటించారు. గతంలో మున్సిపాలిటీలో ముగ్గురు కో ఆప్షన్‌ సభ్యులు ఉండ గా ఈ సారి కొత్త చట్టం ప్రకారం నాలుగుకు పెరిగింది.  ఆశావహులు పదవిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నాలుగు కో ఆప్షన్‌ పదవుల్లో ఇద్దరు ముస్లిం మైనార్టీలు, ఇద్దరు ప్రజా ప్రతినిధులుగా అనుభవం ఉన్నవారు, మాజీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్‌ ఉద్యోగులకు అవకాశం క ల్పిస్తారు. మున్సిపల్‌ పరిధిలో 30 వార్డులు ఉండగా 24 మం ది టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఉన్నారు. ఇద్దరు సీపీఐ, ఏఐఎఫ్‌బీ ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  

కో ఆప్షన్‌కు 17 దరఖాస్తులు

కో ఆప్షన్‌ పదవులకు ఈ నెల 24 వరకు 17 దరఖాస్తులు వచ్చాయి. మున్సిపల్‌ పాలనలో ప్రత్యేక అనుభవం కలిగిన వాళ్లకు కేటాయించిన రెండు స్థానాలకు పురుషుల నుంచి 4, మహిళల నుంచి 5, మైనార్టీ నుంచి కేటాయించిన రెండు స్థానాలకు పురుషుల నుంచి 3, మహిళల నుంచి 5 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనరల్‌ స్థానాలకు బేతోజు వజ్రమణి, తాటి హైమావతి, పెద్దిరెడ్డి దేవేంద్ర, పప్పుల రజిత, బోడ పద్మ, పిల్లి వేణు, దొంగల ఐలయ్య, వేముల మల్లేశ్‌గౌడ్‌, గురిజాల శ్రీనివాస్‌, రిజర్వుడ్‌ స్థానాలకు  నెరవట్ల కమల, దాసరి నిర్మల, నెరపాటి రజిత, మహ్మద్‌ హసీనా బేగం, ఫౌజియా, గడికొప్పుల ఇసాక్‌, కరీం మహ్మద్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌ దరఖాస్తు చేసుకున్నారు. 

బరిలో 16 మంది 

దరఖాస్తుల పరిశీలన అనంతరం నాలుగు కో ఆప్షన్‌ స్థానాలకు 16 మంది బరిలో నిలిచారు. మున్సిపల్‌ పాలనలో ప్రత్యేక అనుభవం ఉన్న వారికి కేటాయించిన రెండు స్థానాలకు 9 మంది, మైనార్టీలకు కేటాయించిన రెండు స్థానాలకు ఏడుగురు బరిలో నిలిచారు. మైనార్టీ స్థానానికి దాసరి నిర్మల దరఖాస్తు చేయగా తిరస్కరణకు గురైంది.  


logo