బుధవారం 28 అక్టోబర్ 2020
Jayashankar - Jul 29, 2020 , 02:36:07

పనులు త్వరగా పూర్తి చేయాలి

పనులు త్వరగా పూర్తి చేయాలి

డీపీవో వెంకయ్య తాడ్వాయి, గోవిందరావుపేట  మండలాల్లో పర్యటన

తాడ్వాయి/ గోవిందరావుపేట, జూలై 28 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని డీపీవో వెంకయ్య అన్నారు. మంగళవారం ఆయన తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో పర్యటించారు. ముందుగా తాడ్వాయి మండలంలోని దామరవాయిలో చేపట్టిన శ్మశాన వాటిక, చెత్తను వేరు చేసేందుకు నిర్మిస్తున్న షెడ్డు, డంపింగ్‌యార్డు, రైతువేదిక భవన నిర్మాణ పనులను ఎంపీడీవో  సత్యాంజనేయప్రసాద్‌, ఎంపీవో భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించొద్దని, నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌, కార్యదర్శి, వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. వానకాలం సీజన్‌లో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పారిశుధ్య పనుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. అనంతరం గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామ శివారు గౌరారం గడ్డ వద్ద నూతనంగా నిర్మించనున్న పల్లె ప్రకృతి వనం పనుల గురించి సర్పంచ్‌ ఈసం సమ్మయ్యను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా శ్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేయడం సంతోషకరమన్నారు. అదేవిధంగా పొడి, తడి చెత్త వేరు చేసేలా చేపడుతున్న డంపింగ్‌యార్డును త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పల్లె ప్రకృతి వనంతో ఆ ప్రాంతమంతా పచ్చని గార్డెన్‌లా ఉండేలా ప్లాన్‌ చేయడం అభినందనీయమన్నారు. పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా రైతు వేదిక పనులు కూడా శ్మశాన వాటిక పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా  ఉంచాలని అన్నారు. ఆయన వెంట ఎంపీవో రామకృష్ణ, ఉప సర్పంచ్‌ తేళ్ల హరిప్రసాద్‌, వార్డు సభ్యుడు సామ రాంరెడ్డి, ఈజీఎస్‌ సిబ్బంది ఉన్నారు. 


logo