శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Jul 26, 2020 , 07:02:52

కూలిన కేటీకే 5వ గని పైకప్పు

కూలిన కేటీకే 5వ గని పైకప్పు

  • సపోర్ట్‌మెన్‌ శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు
  • మైనింగ్‌ సర్దార్‌తో పాటు మరో ముగ్గురు
  • కార్మికులకు  తప్పిన ప్రమాదం

భూపాలపల్లి : గని ప్రమాదంలో సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. గని కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రెండో షిఫ్ట్‌(రాత్రి)లో భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని కేటీకే 5వ  భూగర్భ గనిలో 2వ సీమ్‌ 13వ డిస్టిక్ట్‌ 15 లేవల్‌లోని పని స్థలంలో సపోర్ట్‌మెన్‌ కార్మికులు నామాల శ్రీనివాస్‌, ప్రసాద్‌రెడ్డి, తిరుపతి, దుర్గయ్య రూఫ్‌ బోల్టింగ్‌ పనులు చేస్తున్నారు. మైనింగ్‌ సర్ధార్‌ నారాయణ రెడ్డి అక్కడే  ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. రూఫ్‌ బోల్టింగ్‌ పనుల్లో భాగంగా డబుల్‌ స్టాఫ్‌ ఎక్కిస్తున్న క్రమం లో హఠాత్తుగా ఫేస్‌ నుంచి డబుల్‌ స్టాఫ్‌ వరకు గని పై కప్పు రెండు మీటర్లకు పైగా కూలింది. బొగ్గు పెళ్లలు సపోర్ట్‌మెన్‌ నామాల శ్రీనివాస్‌ కుడి కాలుపై పడడంతో విరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మిగతా కార్మికులు గాయపడిన శ్రీనివాస్‌ను హుటాహుటిన గని పైకి తీసుకొచ్చి  సింగరేణి ఏరియా దవాఖానకు అంబులెన్స్‌లో తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా గాయపడిన సపొర్ట్‌మెన్‌ శ్రీనివాస్‌ యాక్టింగ్‌ కోన్‌ ఆపరేటర్‌గా గనిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం రెండో షిఫ్ట్‌లో యాక్టింగ్‌ కోన్‌ ఆపరేటర్‌గా పని లేకపోవడంతో గని అధికారు లు శ్రీనివాస్‌ను రూఫ్‌బోల్టింగ్‌ పనులకు పంపగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న మైనింగ్‌ సర్ధార్‌తో పాటు మిగతా ముగ్గురు కార్మికులకు ప్రాణా పాయం తప్పింది. ఈ విషయమై గని మేనేజర్‌ జాకీర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ... పని స్థలానికి ఓవర్‌మెన్‌, మైనింగ్‌ సర్ధార్‌ను నియమించామని, వారు ఆ పని స్థలాన్ని ముందుగానే తనిఖీ చేశారన్నారు. రూఫ్‌ బోల్టింగ్‌ వేసే ముందు తాత్కాలికంగా దాట్లు పెట్టిన తర్వాత బోల్టింగ్‌ వేయాల్సి ఉంటుంది. కానీ, వారు అలా  దాట్లు పెట్టకుండానే బోల్టింగ్‌ వేయడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందన్నారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు.