శుక్రవారం 07 ఆగస్టు 2020
Jayashankar - Jul 02, 2020 , 02:01:57

వైద్యులు అంకిత భావంతో పనిచేయాలి : కలెక్టర్‌

వైద్యులు అంకిత భావంతో పనిచేయాలి : కలెక్టర్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌, జూలై 01: వైద్యులు అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. నేషనల్‌ డాక్టర్స్‌డే సందర్భంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం కలెక్టర్‌ కార్యాలయం నుంచి సింగరేణి ఇల్లందు క్లబ్‌ హౌస్‌ వరకు కొనసాగింది. అనంతరం సింగరేణి ఇల్లందు క్లబ్‌ హౌస్‌లో జిల్లాలోని ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేట్‌ వైద్యులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్‌ బిధాన్‌ చంద్ర రాయ్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నేషనల్‌ డాక్టర్స్‌ డే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బిధాన్‌ చంద్ర రాయ్‌ వైద్య వృత్తి ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా పశ్చిమబెంగాల్‌ రాష్ర్టానికి రెండు పర్యాయాలు సీఎం సేవలు అందించి భారతరత్న పురస్కారాన్ని పొందారు. డాక్టర్‌ బిధాన్‌ చంద్రరాయ్‌ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1991 నుంచి ఆయన జయంతి, వర్ధంతి నేషనల్‌ డాక్టర్స్‌డేగా నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలకు అత్యవసర సమయంలో రక్తాన్ని అందుబాటులో ఉంచేందుకు సింగరేణి ఏరియా ఆస్పత్రిలో తాత్కాలిక బ్లడ్‌ బ్యాంక్‌ స్టోరేజీ యూనిట్‌ను నెలకొల్పనున్నామని అన్నారు. వైద్య వృత్తి చాలా గొప్పదని ఏదేని కారణాల వల్ల కూడా వైద్యులపై ప్రజలు దాడులు చేయొద్దని, దాడులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండి వైద్య సేవలందించిన జిల్లాలోని ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేట్‌ వైద్యులను కలెక్టర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుధార్‌ సింగ్‌, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ప్రభుత్వ, సింగరేణి, ప్రైవేట్‌ వైద్యులు, జిల్లా అధికారులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

మల్హర్‌లో..

మల్హర్‌ : మల్హర్‌ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ 143, వాసవి క్లబ్‌  ఆధ్వర్యంలో వేర్వేరుగా తాడిచెర్ల పీహెచ్‌సీలో ఏఎంఆర్‌ కంపెనీ డాక్టర్‌ శ్రీకాంత్‌, ఏఎంఆర్‌ కంపెనీ హెడ్‌ ప్రభాకర్‌రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఆర్‌ కంపెనీ మేనేజర్‌ ముర్తి, సీపీఆర్వో వెంకట్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, వాసవి క్లబ్‌ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


logo