శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Jul 01, 2020 , 01:23:15

233 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

233 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

కురవిలో 211, బేతోలులో 22 క్వింటాళ్లు

అక్రమార్కులకు కఠిన శిక్షలు

లారీ సీజ్‌, 9 మందిపై కేసు

మానుకోట ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

మరిపెడ, జూన్‌ 30: కురవి నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్న 211 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని తాళ్లసంకీస గ్రామం వద్ద పట్టుకున్నట్లు మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ కోటిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కురవి మండలం అయ్యగారిపల్లికి చెందిన చిరివిరాల నవీన్‌, మానుకోట పట్టణవాసి తవిసి వీరభద్రం కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకుని పల్లెల్లో పీడీఎస్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని లారీల్లో కాకినాడకు తరలిస్తున్నారు. ఈ మేరకు అందిన సమాచారంతో సీరోలు ఎస్సై తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టి లారీలో లోడ్‌ చేసి తరలిస్తున్న 211 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్‌ చేసినట్లు ఎస్పీ చెప్పారు.

 ఇందుకు కారకులైన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నవీన్‌, వీరభద్రంపై ఇదివరకే పీడీయాక్టు నమోదైనట్లు తెలిపారు. ఈ ఇద్దరిపై మళ్లీ పీడీయాక్టు నమోదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే, వల్లపు ఎల్లయ్య(మానుకోట), మాలె లక్ష్మీనారాయణ (రాజోలు),  బండారపు యాదగిరి(మాదాపురం), గండమళ్ల మహేందర్‌, బండారు సతీశ్‌(మహబూబాబాద్‌)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. పేరం దశరథ, బంటు నరేశ్‌(మాదాపురం) పరారీలో ఉన్నారన్నారు. ఎస్సై చంద్రమోహన్‌, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, పీసీలు బిజేందర్‌, విద్యాసాగర్‌, మహిపాల్‌, మధు, సురేశ్‌కు ఎస్పీ రివార్డులు అందజేశారు. తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ, మరిపెడ సీఐ ఎం కరుణాకర్‌ను అభినంధించారు. అనంతరం ఎప్పీ మాట్లాడుతూ నల్ల బెల్లం, పీడీఎస్‌ బియ్యం, ఇసుక అక్రమ రవాణా చేసే అక్రమార్కులకు ఇక నుంచి కఠిన శిక్షలు పడేలా జిల్లా పోలీస్‌ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో మరిపెడ ఎస్సైలు సిరిసిల్ల అశోక్‌, ఆర్‌ భిక్షపతి పాల్గొన్నారు.

రేషన్‌ డీలర్‌ వక్రబుద్ధి..

మహబూబాబాద్‌  రూరల్‌: ఓ రేషన్‌ డీలర్‌ వక్రబుద్ధి ప్రదర్శించాడు. ఈ మేరకు అక్రమంగా తరలిస్తున్న 22 క్వింటాళ్ల బియ్యాన్ని మానుకోట పట్టణ శివారులో సివిల్‌ సప్లయ్‌ అధికారులు పట్టుకున్నారు. సివిల్‌ సప్లయ్‌ డీటీ నారాయణరెడ్డి, ఆర్‌ఐ ప్రవీణ్‌రెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని బేతోలు  రేషన్‌ డీలర్‌ గుగులోత్‌ బాలు గ్రామంలోని తెల్లరేషన్‌ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు రేషన్‌ బియ్యాన్ని సేకరించి ఖమ్మంలోని ఓ రైస్‌మిల్లుకు వాహనంలో తరలించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. వాహనంలో ఉన్న 22 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.