గురువారం 22 అక్టోబర్ 2020
Jayashankar - Jun 14, 2020 , 00:52:40

భూపాలపల్లిలో ఆధునిక పబ్లిక్‌ టాయిలెట్స్‌

 భూపాలపల్లిలో ఆధునిక పబ్లిక్‌ టాయిలెట్స్‌

ములుగు : భూపాలపల్లి జిల్లాకేంద్రంగా అవతరించిన తర్వాత అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజల అవసరాల మేరకు పట్టణంలో రద్దీ కలిగిన ప్రదేశాల్లో పబ్లిక్‌ టాయిలెట్లను నిర్మించాలని  కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ఆజీమ్‌ మున్సిపాలిటీ కమిషనర్‌తో కలిసి నిర్ణయించారు. జిల్లాలో సింగరేణితోపాటు కేటీపీపీ, జెన్‌కో వంటి ప్రఖ్యాత కంపెనీలు ఉన్న నేపథ్యంలో రోజురోజుకూ జనసంఖ్య పెరిగిపోతున్నది. ప్రస్తుతం కనీస అవసరాల్లో ముఖ్యమైన టాయిలెట్లను నిర్మిస్తే  పట్టణానికి వచ్చే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయంతో ఈ బృహత్తర కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ప్రజలు అత్యధికంగా ఉండే ప్రదేశాలైన బస్టాండ్‌,  కూరగాయల మార్కెట్‌, మాంసం మార్కెట్‌, వ్యాపార సముదాయ ప్రాంతాలు, అంబేద్కర్‌, జయశంకర్‌ కూడలిలో పబ్లిక్‌,  కమ్యూనిటీ,  మహిళా టాయిలెట్ల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించారు. 

ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన కోవిష్టో టెక్నాలజీ సంస్థకు చెందిన ప్రతినిధులు మూడు నాలుగు రోజుల్లో జిల్లాకేంద్రాన్ని సందర్శించనున్నారు. పట్టణంలో అవసరమున్న, ఎంపిక చేసిన ప్రదేశాలను పరిశీలించి, ఆ ప్రాంతాల్లో వారు ఏర్పాటు చేయనున్న టాయిలెట్లపై డెమో ఇవ్వనున్నారు. బృందం సభ్యులు జిల్లాలో ఏర్పాటు చేసిన టెక్నికల్‌ కమిటీ సభ్యులతో చర్చించి ప్రదేశాలను గుర్తిస్తారు. ఎట్టకేలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ప్రజలకు అధునాతన పబ్లిక్‌ టాయిలెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నయి. జిల్లాలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మాత్రమే పబ్లిక్‌ టాయిలెట్లను సులభ్‌ కాంప్లెక్స్‌ వారి ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్నారు. కొత్తవి అందుబాటులోకి వస్తే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌ వంటి ఆరోగ్యకర కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు అవకాశాలు సులభతరం కానున్నాయి.


logo