శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jayashankar - Jun 11, 2020 , 04:26:40

మంకీ ఫుడ్‌ కోర్ట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోండి

మంకీ ఫుడ్‌ కోర్ట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోండి

  • భూపాలపల్లి కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌ : జిల్లాలో కోతులు ఎక్కువగా ఉన్నందున మంకీ ఫుడ్‌ కోర్ట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికా రులతో సమావేశం నిర్వహించి జిల్లాలో మంకీ పుడ్‌ కోర్ట్‌ల ఏర్పాటు, మియావాకి పద్ధతిన మొక్కలను పెంచడంపై సమీక్షించారు. ఈ సందర్భంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కోతులు భూపాలపల్లి పట్టణంతో పాటు గ్రామాలకు వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రత్యేకంగా వీటిని ఏర్పాటుచేయాలని చెప్పారు. ఈమేరకు జగిత్యాల జిల్లాలోని మంకీ ఫుడ్‌ కోర్ట్‌లను అధికారులు పరిశీలించారని దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటుచేసేందుకు త్వరలో ప్రణాళికలు రూపొందించాలన్నారు. నిర్ణయించిన స్థలాల్లో పండ్ల మొక్కలు పెంచాలన్నారు.

మియావాకి పద్ధతిలో మొక్కలు పెంచాలి

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి తక్కువ సమయంలో అడవిని తలపించేలా వృక్షాలను పెంచే మియావాకి పద్ధతిని అవలంబించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. మియావాకి పద్ధతిలో మొక్కలు పెంచడం వల్ల భూగర్భజలాలు పెరుగుతాయని, రెడీమేడ్‌గా మైక్రో ఫారెస్ట్‌ సృష్టించవచ్చని చెప్పారు. అటవీ తరహాలో మొక్కలు పెరగడంతో పాటు పక్షులు, సీతాకోక చిలుకలు, చిన్న చిన్న జంతువులు జీవిస్తూ బయోడైవర్సిటీ ఏర్పడుతుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి కే.పురుషోత్తం, డీఆర్డీవో సుమతి, జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్‌ నగేశ్‌, జిల్లా పశుసంవర్థక అధికారి డాక్టర్‌ బాలకృష్ణ, ఎంపీడీవోలు పెద్ది ఆంజనేయులు, రవీందర్‌, ఫారెస్ట్‌ రేంజ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.