మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Jun 06, 2020 , 02:36:39

ఇరిగేషన్‌ ల్యాండ్స్‌ అప్‌డేట్‌!

ఇరిగేషన్‌ ల్యాండ్స్‌ అప్‌డేట్‌!

సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాల ఆరా

రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరగకపోవడమే కారణం

పరిహారం పొందిన వారి  పేర్ల తొలగింపు 

మ్యుటేషన్‌, ధరణి వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌

వరంగల్‌రూరల్‌-నమస్తేతెలంగాణ : ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాగు నీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములను ధరణి వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. శనివారం వరకు గడువు నిర్దేశించింది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు సాగు నీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల రికార్డులను బయటకు తీస్తున్నారు. సేకరించిన భూమి ఎంత?, ఇందులో రెవెన్యూ అధికారులు ఎంత మ్యుటేషన్‌ చేశారు?, ధరణి వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసింది ఎంత? అనేది పరిశీలిస్తున్నారు. మ్యుటేషన్‌, అప్‌డేట్‌ కోసం రెవె న్యూ అధికారులకు పంపిన దస్ర్తాలను వెతుకుతున్నారు. భూసేకరణకు సంబంధించి తమ వద్ద ఉన్న రికార్డులు, ఫైళ్లను రెవెన్యూ అధికారులకు అందజేస్తున్నారు. వీటిని, తమ వద్ద ఉన్న రికార్డులను రెవెన్యూ అధికారులు వెరిఫై చేస్తున్నారు. తేడాలను గుర్తించి మ్యుటేషన్‌, అప్‌డేట్‌ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో సాగు నీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల్లో కొన్నింటిని సందర్శించి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వం మొదటినుంచి అవసరమైన భూ ములను రైతులు, వివిధ శాఖల నుంచి సేకరిస్తున్నది. అటవీ భూమిని తీసుకుంటే ప్రత్యామ్నాయంగా మరోచోట ప్రభుత్వ భూమి కేటాయిస్తున్నది. రైతుల నుంచి సేకరించే భూములకు చట్ట ప్రకారం పరిహారం ఇస్తున్నది. ఈ భూసేకరణ సమయంలో రెవెన్యూ అధికారులు రైతుల అంగీకారంతో అవార్డు(ఆర్డర్‌) పాస్‌ చేస్తారు. అవార్డు కాపీలు తమకు అందగానే రెవెన్యూ అధికారులు రికార్డుల్లో మార్పులు చేర్పులు చేస్తారు. ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకుని సాగు నీటి ప్రాజెక్టుకు తమ భూములు ఇచ్చిన రైతుల పేర్లు తొలగించి ప్రాజెక్టు (నీటి పారుదల శాఖ) పేరు రెవెన్యూ రికార్డుల్లో చేర్చుతారు. ఆ తర్వాత ధరణి వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేస్తారు.

రంగంలోకి దిగిన అధికారులు

ప్రభుత్వ ఆదేశాలతో నీటి పారుదల, రెవెన్యూశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇరిగేషన్‌ అధికారులు తమ వద్ద ఉన్న భూసేకరణకు సంబంధించిన రికార్డులు, దస్ర్తాలను వెతికి రెవె న్యూ అధికారులకు అందజేస్తున్నారు. వీటిని, తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు నివ్వెరపోతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం సేకరించిన భూ మి, రెవెన్యూ అధికారులు అప్‌డేట్‌ చేసిన భూమికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు వరంగల్‌రూరల్‌ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 38,864 ఎకరాల భూమిని సేకరించినట్లు నీటి పారుదలశాఖకు చెందిన ప్రాజెక్టు మానిటరింగ్‌ సిస్టం(పీఎంఎస్‌) వెల్లడిస్తున్నది. ఇది రెవెన్యూశాఖ నిర్వహిస్తున్న ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎంఎస్‌)లో కేవలం 10,418 ఎకరాలు మాత్రమే ఉంది. ఎల్‌ఆర్‌ఎంఎస్‌ ప్రకారమే ధరణి వెబ్‌సైట్‌లో ఈ 10,418 ఎకరాల అప్‌డేట్‌ కనపడుతున్నది. ఈ ఒక్క జిల్లాలోనే సుమారు 28 వేల ఎకరాల తేడా ఉంది. దీన్ని అప్‌డేట్‌ చేసే పని గత మే 25వ తేదీ నుంచి మొదలైంది. నీటి పారుదల, రెవెన్యూశాఖ అధికారులు ఈ 28 వేల ఎకరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. అప్‌డేట్‌ కాని భూముల్లో కొన్నింటిని సందర్శిస్తున్నారు. ప్రభుత్వం సేకరించిన భూముల్లో కొన్ని పరిహారం పొందిన వ్యక్తులు, కొనుగోలుదారుల ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామాన్ని సందర్శించిన సమయంలో ఇరిగేషన్‌ రికార్డుల్లోని భూముల లెక్కల్లోనూ తేడా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చా రు. పరిహారం పొందిన వ్యక్తుల పేర ఉన్న భూములను రికార్డుల్లో ఆన్‌సైన్‌ చేసి(తొలగించి) సంబంధిత ప్రాజెక్టు, నీటి పారుదలశాఖ పేర మ్యుటేషన్‌ చేస్తున్నారు. ఈ భూములను మొదట మాన్యువల్‌ రికార్డుల్లో రాసి తర్వాత ధరణి వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేస్తున్నారు. పూర్తి చేయాల్సిన గడువు సమీపించిన దరమిలా కొద్ది రోజుల క్రితం కలెక్టర్‌ ఎం హరిత జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి, పని మరింత వేగవంతం చేయాలని ఆదేశించగా, నీటి పారుదల, రెవెన్యూశాఖ అధికారులు ఈ పనిలో తలమునకలయ్యారు.

జరిగింది ఇలా..

ఎస్సారెస్పీ కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం పూర్వ వరంగల్‌ జిల్లాలో దశబ్దాల క్రితం భూసేకరణ జరిగింది. కా ల్వలు, రిజర్వాయర్ల నుంచి తీసే మట్టిని ఒకచోట పోసేందుకు అప్పట్లో ప్రభుత్వం రైతుల నుంచి భూమిని సేకరించింది. ఆ తర్వాత జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పైపులైన్‌, సొరంగం, పంపుహౌస్‌లు, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు, ప్రధాన, ఉప, పంట కాల్వల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భూ సేకరణ జరిగింది. అటవీ భూములకు ప్రత్యామ్నయంగా మరోచోట ప్రభుత్వ భూములను సర్కారు కేటాయించింది. రైతుల నుంచి సేకరించిన భూములకు ఎకరం లెక్కన అగ్రిమెంటు ప్రకారం పరిహారం చెల్లించింది. మినీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంలు, చెక్‌డ్యాంలు, వివిధ చెరువుల నిర్మాణంలోనూ ఇదే జరిగింది. వీటికి కేటాయించిన భూములు రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్‌ కాలేదు. నీటి పారుదల శాఖ పేర మ్యుటేషన్‌ జరగలేదు. మట్టి, మెటీరియల్‌ కోసం వాడుకుని వదిలేసిన భూములు పరిహారం పొందిన వ్యక్తుల పేరిట, వారి ఆధీనంలో ఉన్నాయి. రికార్డుల్లో పేరు మారకపోవడం, నిరూపయోగంగా ఉండడంతో సదరు వ్యక్తులు ఆ భూములను ఇతరులకు విక్రయించారు. ఇలా ఇద్దరు ముగ్గురి చేతులు మారాయి కూడా. ఈ భూములకు రైతుబంధు సాయం అందుతున్నట్లు సమాచారం. ఇవన్నీ దృష్టికి రావడంతో ప్రభుత్వం తాజాగా సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములన్నింటినీ రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్‌ చేయాలని నిర్ణయించింది.logo