ఆదివారం 24 జనవరి 2021
Jayashankar - Jun 05, 2020 , 02:04:35

పల్లె ప్రగతికి పంచ సోపానాలు..!

పల్లె ప్రగతికి పంచ సోపానాలు..!

సత్ఫలితాలనిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు

సమగ్రాభివృద్ధి దిశగా గ్రామాలు 

డంపింగ్‌ యార్డు, వైకుంఠధామం, కంపోస్ట్‌ షెడ్‌, నర్సరీ, ట్రాక్టర్‌ కొనుగోలుతో అభివృద్ధికి అడుగులు 

మౌలిక వసతుల మెరుగుతో ప్రజల్లో సంతోషం

జిల్లాలో 398 కంపోస్టు షెడ్ల నిర్మాణం

304 వైకుంఠధామాలు పూర్తి

వర్ధన్నపేట : గ్రామాల సమస్యలను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డును నిర్మిస్తున్నది. తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చేందుకు కంపోస్టు షెడ్లను నిర్మిస్తున్నది. జీపీల స్థాయిని బట్టి ప్రభుత్వం ట్రాక్టర్‌, ట్రాలీని కొనుగోలు చేసి అందజేసింది.  

అన్ని వసతులతో వైకుంఠధామాలు..

ఎవరైనా మరణిస్తే అతడి అంత్యక్రియలు నిర్వహించేందుకు గతంలో ఆ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు పడేవారు. సొం తిల్లు లేని వారి బాధలను సీఎం కేసీఆర్‌ గుర్తించి, ఎన్నో సభల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా దహన సంస్కారాల నిర్వహణకు వైకుంఠధామాలు లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఆ పరిస్థితి ఉండవద్దనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో అన్ని వసతులతో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో రెవె న్యూ శాఖ ద్వారా ప్రత్యేక స్థలాన్ని గుర్తించారు. స్థలాలు లేని చోట శ్మశానవాటికలోనే వసతులు కల్పిస్తున్నారు. శ్మశాన వాటికకు ముఖద్వారంతోపాటు రెండు గద్దెలు, రెండు గదులు, హాల్‌ను నిర్మిస్తున్నా రు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 16 మండలాల పరిధిలో 401 గ్రా మాలకు 316 వైకుంఠధామాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా గ్రామాల్లో వాటి నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.  

గ్రామానికో డంపింగ్‌ యార్డు.. 

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రతి గ్రామంలో ప్రభుత్వం డంపింగ్‌ యార్డును నిర్మిస్తున్నది. గ్రామానికి అనువుగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసి గ్రామంలో సేకరించిన చెత్తను వేసేందుకు 25 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో గొయ్యిని తవ్వించింది. ఇందులో చెత్త వేసేందుకు వాహనాలు రావడానికి వీలుగా నిర్మాణం చేపట్టారు. అయితే సేకరించిన చెత్తలో ప్లాస్టిక్‌, గాజు వస్తువులు భూమిలో కరగకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గుర్తించి, ప్లాస్టిక్‌, గాజు వ్యర్థాలను వేరు చేయిస్తున్నది. తర్వాత వాటిని విక్రయించుకునే అవకాశం ఉంటుంది.

కంపోస్టు షెడ్ల నిర్మాణం..

గ్రామంలో చెత్తను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేయడం కోసం కంపోస్ట్‌ షెడ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. షెడ్డులో ప్రత్యేకంగా తయారు చేసిన అరలలో వ్యర్థాలు వేస్తున్నారు. ప్రతి గ్రామంలో 30 ఫీట్ల పొడవు, 23 ఫీట్ల వెడల్పుతో రేకుల షెడ్డును నిర్మించి ఇందులో ప్రత్యేకంగా అరలను ఏర్పాటు చేస్తున్నారు. చెత్తను అరల్లో వేస్తే సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో 398 కంపోస్టు షెడ్ల నిర్మాణాలను అధికారులు పూర్తి చేయించారు. 

పచ్చదనానికి నర్సరీ..

గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేశారు. అటవీశాఖ, ఈజీఎస్‌ల ద్వారా మొక్కలను పెంచుతున్నారు. వర్షాలు కురవగానే అనువైనచోట మొక్కలు నాటి సంరక్షించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కలు నాటడంతోపాటు సంరక్షించే విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వన సంరక్షకులను నియమించి నర్సరీల్లో నాణ్యమైన మొక్కలను పెంచుతున్నారు. 

జీపీలకు ట్రాక్టర్లు..

ప్రతి జీపీకి జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం ట్రాక్టర్లను సమకూర్చింది. పెద్ద గ్రామాలకు ట్రాక్టర్లు, చిన్న గ్రామాలకు చెత్త సేకరించేందుకు ట్రాలీ ఆటోలను కేటాయించింది. ట్రాక్టర్లతోపాటు వాటర్‌ ట్యాంకర్లను జీపీలు కొనుగోలు చేశాయి. వేసవిలో మొక్కలకు నీటిని అందించడంతోపాటు వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించడంతో గ్రామాలు పరిశుభ్రంగా తయారవుతున్నాయి. 


logo