శనివారం 11 జూలై 2020
Jayashankar - May 28, 2020 , 01:40:58

శ్రమకు తగిన ఫలితం

శ్రమకు తగిన ఫలితం

  • మొక్కజొన్న పెట్టనేవద్దు..
  • సోనా వరి, పత్తి పండించాలి
  • ప్రతి నియోజకవర్గంలో గోదాములు 
  • మూడునెలల్లో రైతు వేదికల నిర్మాణం  
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు 
  • జయశంకర్‌ జిల్లాలోనూతన సాగుపై అవగాహన సదస్సు  

‘ఎవుసం కొత్త ఇగురుఎక్కాలి..దిగుబడికి తగిన ఆదాయం రావాలని సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చారు. ఈసారి మొక్కజొన్న పెట్టనే వద్దు.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన తెలంగాణ సోనా ధాన్యాన్ని పండించాలె.. పత్తి సాగు వైపు మొగ్గుచూపాలె. సర్కారు చెప్పిన పంటలు సాగు చేస్తే శ్రమకు తగిన ఫలం దక్కుతుంది’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో వానకాలం- 2020 నియంత్రిత పంటల సాగు విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య   అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. మూడు నెలలుగా సీఎం కేసీఆర్‌  వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉత్తమ రైతులు, నిపుణులతో చర్చించి నూతన సాగు విధానానికి రూపకల్పన చేశారన్నారు. మూడు నెలల్లో అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు.  

భూపాలపల్లి కలెక్టరేట్‌, మే 27: మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు వేసి ఆర్థిక పరిపుష్టి సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు రైతులకు సూచించారు. ఇల్లందు సింగరేణి క్లబ్‌ హౌజ్‌లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వానకాలం 2020 నియంత్రిత పంటల సాగు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మూడు నెలలుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉత్తమ రైతులు, వ్యవసాయ రంగంలో నిపుణులతో సీఎం కేసీఆర్‌ సంప్రదింపులు జరిపి నియంత్రిత పంటల సాగు విధానం రూపొందించారని తెలిపారు. కాళేశ్వరం జలాలు, ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రైతులు అంచనాలకు మించి ధాన్యం పండించారని గుర్తుచేశారు. మార్కెట్‌లో డిమాండ్‌ లేని పంటలు పండించడం ఎవరికీ ఉపయోగం కాదన్నారు.

తెలంగాణ సోనా ధాన్యం, పత్తికి అంతర్జాతీయ మార్కెట్‌ ఉందన్నారు. ఆయిల్‌ఫామ్‌ పంటలు, కూరగాయలు, పండ్లు ఎగుమతి చేస్తే స్థాయికి చేరాలని, దీనికి గాను రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు.రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు ప్రతి నియోజక వర్గంలో గోడౌన్‌లను నిర్మిస్తున్నామని తెలిపారు. మూడు నెలల్లో అన్ని  క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూని ట్‌ నిర్మాణానికి వెయ్యి ఎకరాల భూమి సేకరించాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌కు సూచించారు.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీ హర్షిణి మా ట్లాడుతూ నియంత్రిత పంటల సాగు విధానంతో రాష్ట్రం అన్నపూర్ణగా మారి, ఇతర దేశాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు. పాడి పరిశ్రమను వృద్ధి చేయాలని, ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని, సన్న రకం వరి ధాన్యానికి మద్దతు ధర పెంచాలని, మేలురకం విత్తనాలు సరఫరా చేయాలని  వారు కోరారు. పంటల సాగు వివరాల ను కలెక్టర్‌ ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. కార్యక్రమాల్లో జిల్లా సంయుక్త కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు కలెక్టర్‌ రాజా విక్రమ్‌ రెడ్డి,  మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ కల్లెపు శోభా రఘుపతిరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌యాదవ్‌, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పించాలి..

భూపాలపల్లి టౌన్‌: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి మాట్లాడారు. పంటల మార్పిడి, నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. 

రైతులకు అన్యాయం జరుగొద్దు.. అధికారులు గిట్టుబాటు ధర అందేలా చూడాలి. రైతులు ఇబ్బంది పడొద్దనే సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌లోనూ మార్కెట్లను ప్రారంభించారు. వరంగల్‌ మిర్చి, పత్తికి విదేశాలో డిమాండ్‌ ఉన్నది. ధరలు తక్కువ ఉంటే వెంటనే సరుకులు కోల్డ్‌ స్టోరేజీకి తరలించుకోవాలె.

  • -ఏనుమాముల మార్కెట్‌ పునఃప్రారంభం సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి


logo