గురువారం 02 జూలై 2020
Jayashankar - May 28, 2020 , 01:26:09

వన నర్సరీల్లో యజ్ఞంలా మొక్కల పెంపకం

వన నర్సరీల్లో యజ్ఞంలా మొక్కల పెంపకం

  • మూడుపూటలా నీళ్లు.. 
  • మండుటెండల్లో కంటికి రెప్పలా కాపాడుతున్న నిర్వాహకులు
  • జూన్‌ 20 నుంచి హరితహారానికి సిద్ధం
  • పండ్ల మొక్కలు పెంచుకునే రైతులకు ప్రోత్సాహం
  • ఉచితంగా డ్రిప్‌ పరికరాలు

హరితహారం మొక్కల పెంపకం యజ్ఞంలా కొనసాగుతున్నది. ఊరూరా ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో మొక్కల పెంపకం తుది దశకు చేరుకున్నది. మండుటెండల్లో ఎక్కడా ఒక్క మొక్కకూడా ఎండిపోకుండామొక్కవోని దీక్షతో  సిబ్బంది మూడు పూటలా నీళ్లు పోస్తూ సంరక్షిస్తున్నారు. ఎండ వేడి నుంచి రక్షణగా నర్సరీల వద్ద గ్రీన్‌ నెట్‌లు ఏర్పాటు చేశారు. ఉపాధిహామీ నిధులతో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ పర్యవేక్షణలో సర్పంచులు నర్సరీలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల వారీగా నాటాల్సిన మొక్కలపై ప్రణాళికలు రూపొందించారు. పూలు, పండ్లు, కలపనిచ్చే మొక్కలు ఏపుగా పెరుగుతుండగా, వర్షాలు ప్రారంభం కాగానే జూన్‌ 20 నుంచి హరితహారం మొదలు పెట్టి యుద్ధప్రాతిపదిక పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో పండ్ల తోటలు పెంచే వారికి ప్రోత్సాహకాలిస్తున్నారు.

జనగామలో 59 వేల మొక్కలు..

దేవరుప్పుల: జనగామ జిల్లాలో 2020 హరితహారంలో 59 లక్షలు మొక్కలు నాటేందుకు అధికార యంత్రాగం ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో 281 గ్రామపంచాయతీల్లో వన నర్సరీలు ఏర్పాటు చేసి 45 లక్షల మొక్కలు పెంచుతున్నారు. అటవీశాఖ నర్సరీల్లో 14 లక్షల మొక్కలు సిద్ధమవుతున్నాయి. జూన్‌ 20న హరితహారం ముహూర్తం నిర్ణయించగా,  తొలకరి ప్రారంభం కాగానే మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. వన నర్సరీల్లో 15 లక్షల పాత మొక్కలుండగా 30 లక్షల విత్తనాలు సంచుల్లో పెట్టారు. ఎక్కడెక్కడ ఎన్ని మొక్కలు నాటాలనే విషయంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల నుంచి మొక్కలు తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు

 రైతులకు ప్రోత్సాహకం..

హరితహరంలో భాగంగా వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కలు నాటుకునే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అన్నదాతలకు ఎలాంటి పండ్ల తోటలు అవసరమో అధికారులకు వివరిస్తే అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. ఎకరాకు ఏడాదికి రూ. 40 వేలు లబ్ధి జరిగేలా సౌకర్యాలు కల్పిస్తారు. మామిడి, ఆపిల్‌బేర్‌(రేగు), బత్తాయి, నిమ్మ, సీతాఫలం, జామ, ఇతర పండ్ల మొక్కలు, వాణిజ్య తోటల పెంపకానికి ప్రోత్సహం అందిస్తున్నారు. రైతులే మొక్కలు కొని తెచ్చేకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. వ్యవసాయ క్షేత్రాల్లో మొక్క నాటేందుకు రంధ్రాన్ని తీయించి దానికయ్యే ఖర్చును సైతం ప్రభుత్వమే భరిస్తుంది. ఎరువు ఖర్చు, మొక్కలను పెంచేందుకు నెలనెలాఒక్కోమొక్కకు రూ. 15 చొప్పున మూడేళ్ల పాటు చెల్లిస్తుంది. మొక్క కు రూ. 50 చొప్పున ఎకరాకు రూ.3500విలువైన ఎరువులు అందిస్తుంది.  పండ్ల తోటలు పెట్టిన రైతులకు ప్రభుత్వం ఉచితంగా డ్రిప్‌ పరికరాలు అందిస్తుంది. ఐదెకరాల్లోపు భూమి ఉన్న వా రు అర్హులు. వారు ధరలో పదిశాతం చెల్లిస్తే డ్రిప్‌ పరికరాలు ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రాల్లో ఫిట్‌ చేయిస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీ రైతులు డ్రిప్‌ ధరకు గాను జీఎస్‌టీ చెల్లిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.

16.64 లక్షల మొక్కలు టార్గెట్‌..

సుబేదారి: వరంగల్‌ అ ర్బన్‌ జిల్లాలోని ఏడు మండలాల్లో మొత్తం 130 వన నర్సరీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 7.13 లక్షల మొక్కలు పెంచుతున్నారు. గతేడాదికి సం బంధించి ఇప్పటికే 9.51 లక్షల మొ క్కలు అందుబాటులో ఉన్నాయి. ధర్మసాగర్‌, ఐనవోలు, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్‌, హసన్‌పర్తి మండలాల్లో మొత్తం 130 గ్రామపంచాయతీల్లో 16.64 లక్షల మొక్కలు పెంచాలని టార్గెట్‌గా నిర్ణయించారు. ఆ మొక్కలను జూలైలో నాటేందుకు ప్రణాళికలు తయారు చేశారు.  ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండడంతో ఒక్క మొక్కకూడా ఎండిపోకుండా సిబ్బంది సంరక్షిస్తున్నారు. 

 26 రకాలు మొక్కలు..

నర్సరీల్లో 26 రకాల మొక్కలు పెరుగుతున్నాయి. నీడ, పూలు, కలపనిచ్చే మొక్కలపై అధికారులు దృష్టి సారించారు. టేకు, మామిడి, వేప, రావి, ఎర్రచందనం, కానుగ, నేరేడు, అడవిబాదం, అడవి తంగేడు, గుల్‌మొహర్‌, పండ్ల మొక్కలైన బొప్పాయి, సీతాఫలం, చింత, వేప, గన్నేరు, చింత, జామ, నిమ్మ, దానిమ్మ, పూలనిచ్చే మొక్కలైన గులాబీ, మందార, మల్లె, కనకాంబరం, పారిజాతం, గన్నేరు మొక్కలు పెంచుతున్నారు. రోడ్లకు ఇరువైపులా, చెరువు గట్ల మీద, అంతర్గత రోడ్ల మధ్య నీడ నిచ్చే మొక్కలు, ఇండ్లలో పండ్లు, పూల మొక్కలు నాటనున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 10 లక్షలు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 10లక్షల మొక్కలను హసన్‌పర్తి, మడిపల్లి, భట్టుపల్లి, కేయూ నర్సరీల్లో పెంచుతున్నారు. ఇందులో పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో ధర్మసాగర్‌ మండలం గుండ్లసాగర్‌, దేవునూర్‌, ముప్పారం,  కేయూ నర్సరీల్లో 2 లక్షల మొక్కలు పెరుగుతున్నాయి.

సూరంపేట నర్సరీలో ఔషధ మొక్కలు!

శాయంపేట: హరితహారంలో భాగంగా వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలంలో 24 నర్సరీలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో కలిపి 3లక్షల మొక్కలు పెంచుతున్నారు. సూరంపేటలో నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించి మూడు రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఇందులో రణపాల, ఓమ, ఇన్సులిన్స్‌ మొక్కలు ఎంతో ప్రత్యేకమైనవి. వివిధ ప్రాంతాల నుం చి రెండు నెలల క్రితం వీటిని నర్సరీకి తీసుకొచ్చారు. ఒక్కో రకం మొక్కలు యాభై వరకు ఇక్కడ పెరుగుతున్నాయి. అవసరం ఉన్నవారికి మొక్కలు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 

  • రణపాల: ఈ మొక్క కిడ్నీలో రాళ్లను కరిగదీస్తుం ది. వీటి ఆకులను రోజుకొకటి చొప్పున పడిగడుపున తీసుకోవాలి. గంట వరకు ఏమీ ముట్టుకోవదు. ఇరవై రోజుల్లో ఫలితం ఉంటుంది. 
  • ఓమ: వేడి నీళ్లలో వేసి చిన్న పిల్లలకు తాగించాలి. పెద్దవాళ్లు తాగొచ్చు. దగ్గు, జలుబు తగ్గడానికి ఓమ మొక్క ఎంతో ఉపయోగపడుతుంది. 
  • ఇన్సులిన్‌ : షుగర్‌ వ్యాధి నియంత్రణకు ఇన్సులిన్‌ మొక్క దోహద పడుతుంది. దీని ఆకును తినొచ్చు. జ్యూస్‌ మాదిరిగా చేసుకొని తాగొచ్చు. 

అంచనాలకు మించి మొక్కలు నాటుతాం..

ఈ సారి జిల్లాలో అంచనాలకు మించి మొక్కలు నాటేందుకు నిర్ణయించాం. వన సర్సరీల్లో సర్పంచ్‌లకు కీలక భాగస్వామ్యం కల్పించాం. జిల్లాకు కేటాయించిన 50 లక్షల మొక్కలు నాటేందుకు 26 ప్రభుత్వ శాఖల సహకారం అవసరం. ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్తాం. ఐకేపీ మహిళా సంఘాల ప్రాతినిధ్యం సైతం ఉంటుంది. ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటును వినియోగించుకొని రైతులు పండ్ల తోటలు పెట్టుకోవాలని సూచిస్తున్నాం. 

-రాంరెడ్డి, డీఆర్డీవో, జనగామ జిల్లా


logo