శుక్రవారం 05 జూన్ 2020
Jayashankar - May 07, 2020 , 02:22:38

జోన్ల వారీగా సడలింపులివే..

జోన్ల వారీగా సడలింపులివే..

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. జి ల్లాలను రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లుగా విభజించి కొన్ని సడలింపులు ఇచ్చారు. కేంద్రప్రభుత్వం జారీ చేసిన  మార్గదర్శకాలు యథాతథంగా రాష్ట్రంలో కూడా అమలు లో ఉంటాయని సూచించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్‌ అర్బన్‌ రెడ్‌జోన్‌ పరిధిలో ఉండగా, వరంగల్‌ రూ రల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలు గ్రీన్‌జోన్‌, జనగామ, జయశంకర్‌  జిల్లాలు ఆరెంజ్‌ జోన్‌ పరిధిలో ఉన్నాయి. బుధవారం ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, జనగామ జిల్లా కలెక్టర్‌ నిఖిల, మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ హరిత ఆయా జిల్లాల అధికారులతో వేర్వేరుగా సమీక్షించారు.  నిబంధనల ప్రకారం వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని సూచించారు. గ్రీన్‌జోన్‌ పరిధిలోని అన్ని మండలాల్లో వంద శాతం, మున్సిపల్‌ పరిధిలో 50 శాతం దుకాణాలు తెరవాలని సూచించారు. దుకాణాలకు సరి-బేసి సంఖ్యలను కేటాయించాలని, ఒక రోజు సరి, మరుసటి రోజు బేసి సంఖ్య గల దుకాణాలు మాత్రమే తెరవాలని సూచించారు. దుకాణదారులు, కొనుగోలు దారులు తప్పకుండా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని షాపులపై చర్యలు తీసుకోవడంతో పాటు సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు రాత్రి 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని అన్నారు. 

గ్రీన్‌జోన్‌లో: క్రషర్లు, ఇటుక బట్టీలు, చేనేత పరిశ్రమలు, ఫుడ్‌ప్రాసెసింగ్‌, మెకానిక్‌ షాపులు, బీడీ తయారీ, మద్యం అమ్మకాలు, ఇసుక తవ్వకం, భవన నిర్మాణ పనులు, టైల్స్‌ దుకాణాలు, సిమెంట్‌ ఫ్యాక్టరీ, ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఇండస్ట్రీస్‌, జిన్నింగ్‌ మిల్లులు, శానిటరీ పైపుల తయారీ, పేపర్‌ ఇండస్ట్రీస్‌, ప్లాస్టిక్‌ రబ్బర్‌ ఇండస్ట్రీస్‌, ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి ఉంటుంది. గ్రీన్‌జోన్‌లో సైతం స్కూల్స్‌,  కళాశాలలు, ప్రార్థన మందిరాలు, ప్రజా రవాణా, టూరిజం స్థలాల సందర్శనకు అనుమతి లేదు.

రెడ్‌జోన్‌లో: నిత్యావసరాలు, మద్యం షా పులు, భవన నిర్మాణం, ఇసుక మైనింగ్‌, వ్యవసాయ పనులు, ఆస్తుల క్రయ విక్రయాలు, స్టాంపులు రిజిస్ట్రేషన్‌, ఆర్టీఏ, వాహనాల రిజిస్ట్రేషన్‌, మెడికల్‌ షాపులు, సిమెంట్‌, ఐరన్‌, శానిటరీ,హార్డ్‌వేర్‌, ఎలక్ట్రికల్‌, వెల్డింగ్‌ షాపులు, ఎరువులు, విత్తనా ల దుకాణాల నిర్వహణకు అనుమతి ఉం ది.  కాగా వరంగల్‌ రెడ్‌జోన్‌లో అమలు చేయాల్సిన అంశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావల్సి ఉందని జిల్లా అధికారులు తెలిపారు. 

ఆరెంజ్‌ జోన్‌లో ఏ,బీ,సీ కేటగిరీలు

ఏ-కేటగిరీలో: నిత్యావసర దుకాణాలు, కూరగాయలు, పాలు, మెడికల్‌ షాపులు, వ్యవసాయ అనుబంధ దుకాణాలు

బీ-కేటగిరీలో: బట్టలు, బంగారం, ఎలక్ట్రికల్‌ షాపులు, గృహోపకరణాలు మొదలగు దుకాణాలకు సరి, బేసి నంబర్‌ కేటాయిస్తారు. ఒక రోజు సరి సంఖ్య, మరో రోజు బేసి సంఖ్య దుకాణాలు ఉదయం 10నుంచి సాయంత్రం 6గంటల వరకు తెరిచి ఉంటాయి.

సీ-కేటగిరీలో: విద్యాలయాలు, కళాశాలు, కోచింగ్‌ సెంటర్లు, దాబాలు, హోటళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, సినిమాహాల్స్‌, పార్కు లు, బార్లు, ఆడిటోరియం, మతపర సమావేశాలు, పార్థనలు నిషేధం. 65 ఏళ్ల వృద్ధులు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు ఇంట్లోనే ఉండాలి. 


logo