బుధవారం 03 మార్చి 2021
Jayashankar - Apr 20, 2020 , 02:02:51

కూలీ కడుపున ఆత్మీయ ముద్ద

కూలీ కడుపున ఆత్మీయ ముద్ద

  • ఆదుకుంటున్న ‘దయా’మయులు 
  • కరోనా కాలంలో కరుణామూర్తులు 
  • ఆపన్నహస్తం అందిస్తున్న నేతలు 
  • అన్ని నియోజకవర్గాల్లో పట్టెడన్నం పెడుతున్న మంత్రి, ఎమ్మెల్యేలు 

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆకలిగొన్న కూలీ కడుపున ఆత్మీయ ముద్ద. కరోనా కాలంలో కరుణత్వం చూపుతున్న ‘దయా’ర్ద్ర హృదయులు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చూపిన దారి.. ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ చూపిన దాతృత్వం.. పెద్ది సుదర్శన్‌రెడ్డి పెద్దచేయి.. నన్నపునేని నరేందర్‌ చేయూత. అరూరి ఆత్మీయ పలకరింపు. చల్లా ‘ధర్మా’గుణం. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. శంకర్‌నాయక్‌, డీఎస్‌ రెడ్యానాయక్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, డాక్టర్‌ రాజయ్య, వొడితల సతీశ్‌ ఇలా అందరూ వారి నియోజకవర్గాల్లో రెక్కాడితే కానీ డొక్కాడని వారికి పట్టెడన్నం పెడుతున్నారు. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, జెడ్పీ చైర్మన్లు.. ఇలా ఎవరి పరిధుల్లో వారు కరోనా కాలంలో కరువు రుచి ఎరుగకుండా ఆకలిగొన్న వారికి బుక్కెడు బువ్వ పెడుతున్నారు. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు సకల వ్యవస్థలు లాక్‌డౌన్‌ పాటించాల్సిందేనని సీఎం కేసీఆర్‌ కరాఖండిగా తేల్చిచెప్పారు. తెలంగాణ నేల మీదున్న ప్రతి బిడ్డ ఆకలి తీరుస్తామని, కష్టకాలంలో కడుపుల పెట్టుకొని చూసుకుంటామని ఆయన విస్పష్టం చేశారు. అంతేకాదు రాష్ర్టేతరులైన వలస కూలీల కడుపున ఆయన అన్నం ముద్ద అయ్యారు. సీఎం కేసీఆర్‌ చూపిన దారిలోనే నేతలంతా నడుంకట్టారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ కూలీనాలి చేసుకొని గడిపే వారికి పట్టెడన్నం పెట్టాలని తలచారు. వారిని అనుసరించి అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు ముందడుగు వేశారు. ఆపదలో ఉన్నప్పుడు, ఆకలి బాధను గుర్తెరిగి ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాల్లోని పారిశుధ్య కార్మికులు, ఆటోడ్రైవర్లు, ఆశ వర్కర్లు, అడ్డా కూలీలు, చిరు వ్యాపారులు, మేదరి, మేరు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మాత్రమే కాకుండా పేద కళాకారులకు, ఆఖరికి మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆదుకోవాలన్న తలంపుతో కరోనా కాలంలో కడుపునింపుతూ మనోధైర్యం కల్పిస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఎవరికి తోచిన విధంగా వారు నెలగ్రాసం కిట్లను పంపిణీ చేస్తున్నారు. 

అందరం కలుద్దాం.. ఆకలితో ఉన్నవాళ్లను ఆదుకుందాం 

ఇది కష్టకాలం. అందరం ఒక్కటై ముందుకు కదులుదాం. కరోనాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రెక్కాడితే కానీ డొక్కాడని వారిని అన్ని తీర్ల ఆదుకోవాలి. వ్యాపారం చేసుకునే వారితో పాటు ఇతరులు ఎవరికి తోచిన రీతిలో వారు సాయం చేయాలి. మనం అన్నీ ఉన్నప్పుడు అన్నం పెడితే తృప్తి ఉండదు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు పిలిచి బుక్కెడు బువ్వ పెడితే ఎల్లకాలం గుర్తుంచుకుంటరు. పెద్ద ఎత్తున దాతలు ముందుకు రావాలి. పల్లెల్లో, పట్టణాల్లో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు అండగా ఉండాలి.

-ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

VIDEOS

logo