బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 08, 2020 , 02:50:05

ఆమె..ఆకాశమంత

ఆమె..ఆకాశమంత

ములుగు, నమస్తేతెలంగాణ : మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదని స్వామివివేకానంద అన్న మాటలను మరోసారి స్మరిస్తూ జయహో మహిళా మూర్తులు.. అని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ములుగు జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించేందుకు స్త్రీ,శిశు సంక్షేమ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలమని, ఇదే నినాదంతో  ఐక్య రాజ్యసమితి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా జిల్లాలో సైతం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు వెంకటాపూర్‌, గోవిందరావుపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(నూగూరు) మండలాల్లోని అంగన్‌వాడీ సెంటర్లు , ప్రభుత్వ వైద్యశాలలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్సు లంక వాణితో పాటు  మహిళ ఉద్యోగులను ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడుతూ మెమెంటోలను అందజేశారు.


 జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు 

ముందస్తు వేడుకల్లో భాగంగా జిల్లాలో ఇప్పటికే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆదివారం నిర్వహించనున్న మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసే  సఖిసెంటర్‌ను ప్రారంభించనున్నారు.  


ప్రతీ మగాడి విజయంలో మహిళ పాత్ర కీలకం 

మహిళల శక్తి ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ ప్రతీ మగాడి విజయంలో మహిళ పాత్ర లేనిదే పురుషులకు మనుగడ లేదన్నట్లుగా ప్రతీ విషయంలో మహిళలు పురుషులకు తోడు ఉంటున్నారు. మహిళలు కుటుంబ భారాన్ని మోస్తూ జీవితాంతం కుటుంబం కోసం సర్వం త్యాగం చేస్తున్నారు. అంతటి గొప్ప మహిళలకు ఆదివారం జరుపుకునే అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మనసార ధన్యవాదాలు తెలుపుకునే సమయం ఆసన్నమైంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా జరుపుకునే సంబరాలలో మహిళలకు చక్కని బహుమతులతో పాటు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాలను నిర్వహించేందుకు వేదికను సిద్ధం చేశారు. సోషల్‌ మీడియాలో తమ కుటుంబ సభ్యులకు అందమైన కొటేషన్‌లతో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉత్తమ మహిళలను గుర్తించి అభినందన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ,ప్రైవేటు కార్యాలయాల్లో వృత్తి రీత్యా మెరుగైన సేవలు అందించిన  మహిళ అధికారులను గుర్తించి ప్రత్యేకంగా సన్మానోత్సవ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

 

నేడు ప్రగతి భవన్‌లో..

మంజూర్‌నగర్‌ : ప్రగతి భవన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారిణి పీ శ్రీదేవి శనివాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌, జేసీ, జెడ్పీ చైర్‌పర్సన్‌ హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు జిల్లాలోని మహిళా అధికారులు, వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్‌, ఐసీపీఎస్‌, ఎంఎస్‌కే, సఖీ కేంద్రాల మహిళా ఉద్యోగినులు అధికసంఖ్యలో పాల్గొనాలని డీడబ్ల్యువో ఆమె తెలిపారు. 


కసూర్బాలో మహిళా దినోత్సవ వేడుకలు

కాటారం:మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌వో ఆధ్వర్యంలో విద్యార్థులతో భేటీ పడావో-భేటీ బచావో కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. ఉపాధ్యాయురాళ్లు, విద్యార్థినులతో కలిసి ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఉపాధ్యాయురాళ్లు విజయ, నళిని, జ్యోత్స్న, లక్ష్మీ, సహన, శ్రీలత, లక్ష్మీ, పద్మ పాల్గొన్నారు. 


స్త్రీ శక్తికి సాటి లేదు : సింగరేణి జీఎం 

భూపాలపల్లి టౌన్‌ : స్త్రీ శక్తికి సాటి లేదని, మహిళలు ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఏరియా సింగరేణి జీఎం ఈసీహెచ్‌ నిరీక్షణ్‌రాజ్‌ అన్నారు. శనివారం భూపాలపల్లిలోని సింగరేణి జీఎం కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి మంచాల శ్రీనివాస్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పి రాజేశం, ఫైనాన్స్‌ మేనేజర్‌ అనురాధ, సీనియర్‌ ప్రోగ్రామర్‌ రజినీకుమార్‌, ప్రాతినిథ్య సంఘం నాయకులు కే రాజ్‌కుమార్‌, జీఎం కార్యాలయ మహిళా ఉద్యోగినులు రాజ్యలక్ష్మి, సునిత, ప్రతిభ, కీర్తిప్రియ తదితరులు పాల్గొన్నారు. 
logo