శనివారం 28 మార్చి 2020
Jayashankar - Mar 06, 2020 , 03:00:51

నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు

నిర్లక్ష్యానికి మూల్యం తప్పదు

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వాహనాల కాలుష్యంతో పర్యావరణం దెబ్బతింటున్నది. దీంతో సబ్బండ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో జీవకోటికి అనంతకోటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జరుగుతున్న నష్టాన్ని పూడ్చడంతో పాటు భవిష్యత్‌ తరాలకు పరిశుద్ధమైన పర్యావరణాన్ని అందించాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణంలో అతి ప్రమాదకరమైన రసాయనాలను విడుదల చేస్తూ, పర్యావరణ పరిమితులకు లోబడి వాహన చట్టంలో మార్పులు, చేర్పులు చేశాయి. వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన చట్టాలను రూపొందించడంతో పాటు ఆదేశాలను కూడా జారీ చేశాయి. దీనికితోడుగా జిల్లా స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించింది. అంతేకాకుండా ప్రతి వాహనదారుడిలో చైతన్యం నింపేందుకు కార్యక్రమాలను చేపట్టింది. వీటి అమలులో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ముందు వరుసలో నిలిచింది. ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న ‘భారత్‌ స్టేజ్‌-4’ వాహనాలు గల వాటి యజమానులు, డీలర్లు, తయారీ కంపెనీలకు బీఎస్‌-4 వాహనాల వల్ల ఉత్పన్నమవుతున్న సాంకేతిక పరమైన సమస్యలతో పాటు దెబ్బ తింటున్న పర్యావరణ సమస్యలను వివరించి 2017లోనే వీటి తయారీని నిలిపివేయాలని ప్రభుత్వాలు ఆదేశాలిచ్చాయి. అయినప్పటికీ ఆయా కంపెనీల వాహన తయారీదారులు మార్కెట్‌లో ఉన్న బీ-4 వాహనాలను విక్రయించుకునే గడువు ఇచ్చింది. 


2020 మార్చి 31వ తేదీ (ఈ మాసాంతానికి) బీఎస్‌-4 వాహనాలు మొత్తం విక్రయించాలని ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాలను ఈ గడువులోగానే రిజిస్ట్రేషన్‌ చేయించాలని ఆదేశాలిచ్చింది. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా, వాహనాలు అమ్మకున్నా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఆ వాహనాలు స్క్రాప్‌లాగానే పరిగణిస్తామని రవాణా శాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కఠినమైన ఆదేశాలను ఇచ్చారు. వీటిని అందిపుచ్చుకున్న భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారులు, సిబ్బంది గురువారం వాహనదారులకు ఈ సమాచారం చేరవేసే క్రమంలో చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగానే ప్రదర్శన, బ్యానర్లు, కరపత్రాలు ముద్రించి వాహనదారులకు సమాచారం చేరవేసేలా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా డీలర్ల వద్ద ఉన్న బీఎస్‌-4 వాహనాల క్రయ విక్రయాలకు సంబంధించి కూడా వారితో సమావేశమై అందిన ఆదేశాలను, ఉన్నతాధికారులు చేసిన సూచనలను వివరించారు. అంతటితో ఆగకుండా ప్రతి డీలర్‌ వద్ద ఉన్న వాహనాల వివరాలను సేకరించారు. 31 మార్చికల్లా వీటిని, ఇప్పటికే కొనుగోలు చేసిన యజమానుల వద్ద ఉన్న వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని, లేదంటే వాటిని రోడ్డు మీద తిరిగితే సీజ్‌ చేస్తామని చెబుతున్నారు. ఇక బీఎస్‌-4 వాహనాల స్థానంలో బీస్‌-6 వాహనాలు మార్కెట్‌లో ఉన్నాయని, వాహనదారులు కొనుగోలు చేసుకునేందుకు వారి వారి అవసరాలకు అనుగుణంగా డీలర్ల వద్ద అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. 


బీఎస్‌-6 వాహనాల మూలంగా ఎక్కడ కూడా పర్యావరణానికి నష్టం జరగదని రవాణా శాఖ అధికారులు తమ ప్రచారంలో భాగంగా వివరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పర్యావరణ హితమైన బీఎస్‌-6 పెట్రోల్‌ 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు పూర్తిస్థాయి సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో బీఎస్‌-6 ఇంధనం కూడా అన్ని రకాల వాహనాల్లో వాడవచ్చని, దీని వాడకం వల్ల వాహనాలు, వాహనాల జీవిత కాలం సవ్యంగా ఉంటుంది. బీఎస్‌-6 వాహనాల మూలంగా పర్యావరణాన్ని దెబ్బతీసే జీవకోటికి హాని కలిగించే ఎలాంటి రసాయనాలు విడుదల కావని, దీనివల్ల సభ్య సమాజానికి ఎన్నో మేళ్లు జరుగుతాయని అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌-4 వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసే సమస్యే లేదని, అందుకు సాఫ్ట్‌వేర్‌ కూడా అంగీకరించకుండా కార్యాచరణను రవాణా శాఖ రూపొందించింది. ఇప్పటికే ఈ బీఎస్‌-4 వాహనాలను కొనుగోలు చేసిన వాటి యజమానులు కూడా 2020 మార్చి 31లోపు కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందేనని, లేనియెడల వాటిని పూర్తిగా సీజ్‌ చేయాలని రవాణా శాఖ అధికారులకు అందిన ఆదేశాల్లో పేర్కొన్నారు. 


ప్రత్యేక బృందాలతో డ్రైవ్‌

జిల్లాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో 18 మండలాలు ఉండగా అన్ని చోట్ల ఈ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. జేటీసీ రమేశ్‌, డీటీసీ పాపారావుల ఆధ్వర్యంలో డీటీవో పీ. వేణు పర్యవేక్షణలో ఈ బృందాలు పని చేస్తున్నాయి. ఈ బృందాలకు భీంసింగ్‌, ప్రశాంత్‌, అనిత అనే అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలోని 18 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్‌ అనుమతులు లేకుండా మార్కెట్‌లో దొరుకుతున్న బీఎస్‌-4 వాహనాలతో పాటు అధిక లోడ్‌తో పాటుగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలను పట్టే పనిలో ఈ బృందాలు నిమగ్నమయ్యాయి. 


చైతన్య కార్యక్రమాలు

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు జిల్లాలో బీఎస్‌-4, బీఎస్‌-6 వాహనాలు, వాటి వినియోగం, వాటివల్ల జరిగే లాభ నష్టాలు, తదితర విషయాలపై చైతన్య కార్యక్రమాలను రవాణా శాఖ నిర్వహిస్తున్నది. జిల్లా రవాణా శాఖ అధికారి వేణు, సహాయాధికారి రాజశేఖర్‌ ఈ కార్యక్రమాలను చేపట్టారు. రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాల మేరకు బ్యానర్లు, కరపత్రాలను ముద్రించి జిల్లాలోని అన్ని మండలాల్లో జన సంచారం ప్రాంతాల్లో ప్రదర్శింపజేశారు. జన సమూహం ఉన్న చోట, వాహనాల తనిఖీల సందర్భంగా డ్రైవర్లు, యజమానులతో కూడా మాట్లాడుతున్నారు. 


మార్చి 31 తర్వాత చేసేదేమీ లేదు..

- పీ.వేణు, డీటీవో 

తాత్కాలిక రిజిస్ట్రేషన్‌పై తిరుగుతున్న బీఎస్‌-4 వాహనాలతో పాటు ఆ తర్వాత కొనుగోలు చేసే వాహనాల విషయంలో మార్చి 31 తర్వాత మేం చేసేదేమీ ఉండదు. ఈ వాహనాలను మార్చి 31లోగానే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లయితే రోడ్డుపై తిరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత వాటిని సీజ్‌ చేస్తాం. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఈ విషయంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మండలాల వారీగా చైతన్య కార్యక్రమాలతో పాటు బీఎస్‌-4, బీఎస్‌-6 వాహనాల మధ్య తేడా, వాటి వినియోగం, పర్యావరణం పట్ల వాటి ప్రభావం, తదితర అంశాలను కూలంకషంగా వివరిస్తున్నాం. ఎక్కడ కూడా తెలియదు అనే విషయం తలెత్తకుండా ఉండేలా వాహనదారుల వద్దకు కచ్చితమైన సమాచారాన్ని చేరవేసే పనిలో ఉన్నాం. ఏప్రిల్‌ ఒకటో తేదీ తర్వాత బీఎస్‌-6 వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తాం. భారత్‌ స్టేజ్‌-4, 6 వాహనాలకు సంబంధించి ఉన్నతాధికారులు స్పష్టమైన నిబంధనలను అందించారు. వాటి పరిధిలోనే అమలు చేయడం జరుగుతుంది. logo