గురువారం 02 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 06, 2020 , 02:56:24

టార్గెట్‌..పట్టణ సుందరీకరణ

టార్గెట్‌..పట్టణ సుందరీకరణ

భూపాలపల్లి టౌన్‌, మార్చి 05 : పట్టణ సుందరీకరణ మన ముందున్న లక్ష్యమని, ఇందుకు సింగరేణి, జెన్‌కో సంస్థలు భాగస్వామ్యం కావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎండీ అబ్దుల్‌ అజీమ్‌, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం నిరీక్షణ్‌రాజ్‌తో కలిసి భూపాలపల్లి పట్టణంలో పర్యటించారు. భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా గుర్తించిన సమస్యలను పరిశీలించారు. ముందుగా ఉదయం జెన్‌కో గెస్ట్‌హౌజ్‌లో సింగరేణి, జెన్‌కో అధికారులతో కలిసి పట్టణ అభివృద్ధిపై చర్చించి గణపురం మండలం కుందయ్యపల్లి వద్దకు వెళ్లి అక్కడి నుంచి భూపాలపల్లి పట్టణ పరిధి ప్రారంభమయ్యే కుందూరుపల్లి వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీకి ఇరువైపులతోపాటు రోడ్డు మధ్య డివైడర్‌ ఏర్పాటు చేసి పూల మొక్కలను పెంచడం, సెంట్రల్‌ లైటింగ్‌, చెల్పూర్‌లో జెన్‌కో స్థలంలో బస్టాండ్‌, సంత ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి జెన్‌కో భాగస్వామ్యం కావాలని జెన్‌కో ఎస్‌ఈ తిరుపతమయ్యను ఆదేశించారు.  అనంతరం కుందయ్యపల్లి నుంచి సీఆర్‌ నగర్‌, బాంబులగడ్డ వరకు 9.5 కిలోమీటర్ల రోడ్డును, పట్టణంలో ఫారెస్ట్‌ అధికారి కార్యాలయం, జంక్షన్లు, ఎర్ర చెరువు, బాంబులగడ్డలో శ్మశాన వాటిక, అంబేద్కర్‌ సెంటర్‌లో పార్కింగ్‌ స్థలం, బస్‌డిపో పక్కన ప్రభుత్వ ఖాళీ స్థలం, ఎల్బీ నగర్‌లో డ్రైనేజీ, జంగేడు కేజీబీవీ ముందు ఖాళీ స్థలం, జంగేడు జెడ్పీహెచ్‌ఎస్‌లో నీటితో నిండిన ఖాళీ స్థలం, జంగేడులో గాండ్ల చెరువు, కాసింపల్లిలో పెద్ద చెరువులను, గడ్డిగానిపల్లిలో శ్మశాన వాటిక ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. 


ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసినందున పది రోజులుగా జరిగిన పట్టణ ప్రగతిపై యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని, వార్డుల్లో, పట్టణంలో ఎక్కడెక్కడ ఏం పనులు చేయాలో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. జెన్‌కో, సింగరేణి అధికారులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఎర్ర చెరువును ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌గా మారుస్తామని, శ్మశాన వాటికను అన్ని హంగులతో సిద్ధిపేట తరహాలో నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గడ్డిగానిపల్లి గ్రామాన్ని వీలైనంత త్వరగా తరలించాలని కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రధాన రహదారి పొడవున ఫుట్‌పాత్‌లు అభివృద్ధి చేస్తూ తొమ్మిది కిలోమీటర్ల పొడవున ఇంటిగ్రేటెడ్‌ డ్రైనేజీని ఏర్పాటు చేస్తూ సోలార్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అధికారులు 17లోగా యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని కోరారు. సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్‌ మాట్లాడుతూ.. భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి సింగరేణి సంస్థ పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నారు. ఎర్ర చెరువును చదును చేసి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కోసం అప్పగిస్తామన్నారు. logo
>>>>>>