ఆదివారం 24 మే 2020
Jayashankar - Mar 04, 2020 , 02:03:48

భూపాలపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

భూపాలపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
  • నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది
  • గజ్వేల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
  • ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు ప్రాధాన్యతనివ్వాలి
  • ఆరు నెలల్లో ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరందాలి
  • బడ్జెట్‌ తర్వాత 57 ఏళ్ల వారికి పింఛన్‌
  • గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి
  • పట్టణ ప్రగతి నిర్విరామం : ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి టౌన్‌/కృష్ణకాలనీ, మార్చి 03 : భూపాలపల్లి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని 17, 28, 29 (సుభాష్‌ కాలనీ, ఎండీ క్వార్టర్స్‌, న్యూ సుభాష్‌ కాలనీ) వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగింది. మంత్రితోపాటు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, రాష్ట్ర దివ్యాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సుభాష్‌ కాలనీ సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోయే స్విమ్మింగ్‌పూల్‌ స్థలాన్ని పరిశీలించారు. కాలనీలోని కార్మికులతో మాట్లాడారు. అనంతరం సుభాష్‌ కాలనీలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి వేదికపై మంత్రి మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని ఆ పట్టణానికి దీటుగా భూపాలపల్లిని అభివృద్ధి చేయాలని కోరారు. 


మిషన్‌ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆరు నెలల్లో ఇంటింటికి గోదావరి జలాలు అందించాలని కోరారు. ప్రస్తుతం 60 ఏళ్లకు ఆసరా పింఛన్‌ వస్తుందని, ఈ వయోపరిమితిని సడలించి 57 ఏళ్లు దాటిన వారికి సీఎం కేసీఆర్‌ ఆసరా పింఛన్‌ అందించనున్నారని, వచ్చే బడ్జెట్‌ తర్వాత 57 ఏళ్లు దాటిన ఆసరా వారికి పింఛన్‌ అందబోతుందన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా చేసుకొని మున్సిపల్‌ సిబ్బందికి వాహనాల్లో వేయాలన్నారు. శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డు, మరుగుదొడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులను కోరారు.  కాగా భూపాలపల్లి మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లో విరిగిన, ఇనుప విద్యుత్‌ స్తంభాలను తొలగించండని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ నరేష్‌ను ఆదేశించారు. కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్తున్న క్రమంలో జిల్లా కేంద్రంలోని సత్తార్‌నగర్‌లో ఇనుప విద్యుత్‌ స్తంభం మంత్రి కంటపడింది. దీంతో తన కాన్వాయిని ఆపి ఇనుప స్తంభం వద్దకు వెళ్లి పరిశీలించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఈ ఇనుప స్తంభాన్ని తొలగించి ప్రజలను విద్యుత్‌ ప్రమాదం నుండి కాపాడాలన్నారు.


పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే రమణారెడ్డి

పట్టణ ప్రగతి కార్యక్రమం ఇప్పటితో పూర్తి కాదని, నిర్విరామంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్‌ అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. మార్పు ఏదో ఒక చోట ప్రారంభం కావాలనే ఉద్దేశంతో పట్టణ ప్రగతిని ప్రారంభించి పట్టణాలు, వార్డులను పరిశుభ్రంగా మారుస్తున్నారన్నారు. భూపాలపల్లి పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేయించామన్నారు. రూ.1.70 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మిస్తున్నామన్నారు. స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణ స్థలంలో కొన్ని గుడిసెలు వెలిశాయని, వాటిని తొలగించాలని, వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు అవకాశం కల్పిస్తామన్నారు. తొలగించనిచో మున్సిపల్‌ అధికారులు తొలగించాలన్నారు. సుభాష్‌ కాలనీ, కృష్ణకాలనీ ప్లాట్స్‌కు త్వరలోనే పట్టాలు అందిస్తామన్నారు. రూ.65 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేసేందుకు టెండర్లు పిలుస్తామని, ఆరు నెలల్లో ఇంటింటికీ గోదావరి జలాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, ఆర్డీవో వైవీ గణేశ్‌, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎంపీపీ మందల లావణ్య సాగర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, టీపీవో గిరిధర్‌, కౌన్సిలర్లు మాడ కమల, గండ్ర హరీష్‌రెడ్డి, ఏఈ వెంకటరమణ, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షులు క్యాతరాజు సాంబమూర్తి, టీజేఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు మాడ హరీష్‌రెడ్డి, నాయకులు బుర్ర రమేష్‌, మేనం తిరుపతి, జాడి అశోక్‌ తదితరులున్నారు.  


‘సఖి’తో మహిళలకు భరోసా

భూపాలపల్లి టౌన్‌: సఖి కేంద్రం మహిళలకు భరోసానిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ను మంత్రి సత్యవతి రాథోడ్‌తోపాటు జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌లు ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మాట్లాడుతూ సఖి అంటే భరోసానిచ్చే దోస్త్‌ అని, మహిళలకు అలాంటి భరోసానిచ్చే కేంద్రమే సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ అని అన్నారు. ఇది స్వచ్ఛంద సంస్థ కాదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యాలయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ.. సఖి కేంద్రం మంచి కార్యక్రమాలకు నిలయం కావాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ మంచి కార్యక్రమం అని, దుర్మార్గుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ మాట్లాడుతూ.. సఖి కేంద్రానికి నా పూర్తి సహకారం ఉంటుందన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, పీఎంయూ కో ఆర్డినేటర్‌ గిరిజ, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, కేఎస్సార్‌ ట్రస్టు అధ్యక్షుడు  రాంనర్సింహారెడ్డి, శ్రీరాంరెడ్డి పాల్గొన్నారు. 


logo