బుధవారం 01 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 04, 2020 , 01:55:25

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
  • జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలు
  • హాజరుకానున్న 5793 మంది విద్యార్థులు
  • నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • సేవలందించనున్న ఆర్టీసీ
  • కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

కలెక్టరేట్‌, మార్చి 03: జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పగడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్చి 4వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మొదటి సంవత్సరం, మార్చి 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. కావున మాస్‌ కాపీయింగ్‌ నివారణకు అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచి 8.45 నిమిషాల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. 8.45 నిమిషాల నుండి 9 గంటల వరకు గ్రేస్‌ పీరియడ్‌గా అనుమతిస్తారు. 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరేందుకు ఆర్టీసీ బస్సులను సమయానికూలంగా నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.


జిల్లా వ్యాప్తంగా 5793 మంది..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మెత్తం 26 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరానికి గాను 2626 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి గాను 1951 మంది, ఒకేషనల్‌, ప్రైవేట్‌ విద్యార్థులు 1216 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మొత్తంగా జిల్లాలో 5793 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి మండలంలో మూడు  కేంద్రాలు పవిత్ర జూనియర్‌ కాలేజీ. తేజస్వీని జూనియర్‌ కాలేజీ, భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, కాటారం మండలంలో రెండు కేంద్రాలు కాటారం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, మోడల్‌ స్కూల్‌ కాటారం (గంగారం), మహాదేవ్‌పూర్‌ మండలంలో ఒక కేంద్రం మహాదేవ్‌పూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, చిట్యాల మండలంలో రెండు కేంద్రాలు చిట్యాల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, చిట్యాల మోడల్‌ స్కూల్‌లలో పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 


పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ప్రాథమ చికిత్స మందులు, ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించారు. పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను పరీక్ష జరిగే సమయంలో మూసివేయాలని ఆదేశించారు. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు 145 మంది ఇన్విజిలేటర్లు, ముగ్గురు ైఫ్లయింగ్‌ స్కాడ్స్‌, ఇద్దరు సిట్టింగ్‌ స్కాడ్స్‌, ఎనిమది మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఒకరు కస్టోడియన్‌ అధికారి, ఎనిమిది మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌ అధికారులను నియమించారు. మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా తనిఖీలు నిర్వహించేందుకు సమాయత్తం చేశారు.


సీసీ కెమెరాల ఏర్పాటు 

మాస్‌ కాపీయింగ్‌, అవకతవకలు చోటుచేసుకోకుండా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను నిషేధించారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేంపదకు సెంటర్‌ లోకేటర్‌ యాప్‌ రూపొందించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో అధికారులు ఇంటర్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.


పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో ఇంటర్మిడియట్‌ పరీక్షల నిర్వహణకు ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేశాం. ఈ సెంటర్లలో 5793 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నందున విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్నిమౌలిక వసతులు కల్పించాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. నిముషం ఆలస్యమైనా అనుమతించేది లేదు.

- దేవా రాజమ్‌, ఇంటర్మీడియట్‌ నోడల్‌ ఆఫీసర్‌logo
>>>>>>