సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 03, 2020 , 03:10:21

లక్ష్యసాధన డౌటే..!

లక్ష్యసాధన డౌటే..!

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయగనులు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు దూరంగా ఉన్నాయి. సంస్థ నిర్ధేశిత లక్ష్యాలను చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మరో 30 రోజుల్లో ముగియనుంది. మార్చి 31తో ఈ ఆర్ధిక సవవత్సరం పూర్తి కానుండగా ఇప్పటి వరకు భూపాలపల్లి ఏరియాలో కేవలం 70 శాతం బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. 30 రోజుల్లో లక్ష్యాన్ని చేరడం గగనమేనని అధికారులే చెబుతున్నారు. ఏరియాలోని గనుల్లో 36 ఎస్‌డీఎల్‌ యంత్రాలు పనిచేస్తున్నప్పటికీ యంత్రాల పనితీరులో పురోగతి కనిపించడం లేదు. భూపాలపల్లి ఏరియాలో ఉత్పత్తి లక్ష్యాన్ని చేర్చడంలో కేటీకే ఓసీ-2 తోడ్పడుతుందని ఆశతో ఉన్న అధికారులకు ఓసీ-2 నిరాశే మిగుల్చుతుంది. ఏరియా సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్‌ బొగ్గు ఉత్పత్తి తగ్గుదలపై ప్రత్యేక దృష్టి సారించారు. గనుల వారీగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఉన్నతాధికారులు సైతం భూపాలపల్లి ఏరియాపై నిఘా పెట్టి సమీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సింగరేణి వ్యాప్తంగా పరిశీలిస్తే.. ఇల్లందు ఏరియా బొగ్గు ఉత్పత్తిలో అగ్రభాగంలో ఉండగా ఆర్‌జీ-1, బెల్లంపల్లి, భూపాలపల్లి ఏరియాలు వెనుకంజలో ఉన్నాయి. ఈ ఏరియాలు బొగ్గు ఉత్పత్తిలో నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడం కష్టమే.

70 శాతం బొగ్గు ఉత్పత్తి

భూపాలపల్లి ఏరియాలో ఈ ఆర్ధిక సంవత్సరం  ఇప్పటివరకు 70 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఏరియాలో కేటీకే 1, 5, 6, 8 ఇైంక్లెన్లతోపాటు ఓపెన్‌ కాస్టు సెక్టార్‌-2 ప్రాజెక్టు ద్వారా రోజుకు సుమారు యావరేజీగా 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో అధిక శాతం బొగ్గు ఉత్పత్తి ఓసీ-2  నుంచే జరుగుతుండడంతో ఏరియా నుంచి ఉత్పత్తి సంఖ్య అధికంగా కనిపిస్తుంది. కేటీకే ఓసీ-3 ప్రాజెక్టు ప్రారంభంలో జాప్యం జరుగుతుంది. ఈ ఓసీ గనిని ప్రారంభించి రోజుకు ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభం కాలేదు. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1 ఇైంక్లెన్‌లో3,67,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగాల్సి ఉండగా, 3,12,181(85 శాతం), 6వ గనిలో 2,20,000 టన్నులకు 1,79,507 (82 శాతం), 5 వ గనిలో 3,67,000 టన్నులకు గాను 3,13,578 టన్నులు (85 శాతం), 8వ గనిలో 3,67,000 టన్నులకు 2,55,843 టన్నులు (70 శాతం), ఓసీ 2 నుండి 13,20,000 టన్నులకు 9,92,969 టన్నుల బొగ్గు ఉత్పత్తి  (75 శాతం) జరిగింది. ఓసీ -3 నుంచి 3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభం కాలేదు. మొత్తం భూపాలపల్లి ఏరియాలో ఇప్పటి వరకు 29,41,000 టన్నులకు 20,54,078 టన్నుల బొగ్గు ఉత్పత్తి (70 శాతం)జరిగింది. 

ఫిబ్రవరిలో 52 శాతం 

భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో ఫిబ్రవరిలో జరిగిన ఉత్పత్తి వివరాలు .. ఏరియాలోని 1, 5, 6, 8 గనుల్లో 36 ఎస్‌డీఎల్‌ యంత్రాలు పనిచేస్తున్నాయి. కేటీకే 1 గనిలో 10 ఎస్‌డీఎల్‌ యంత్రాలు ఈ నెలలో ఇప్పటివరకు 31,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 26,434 టన్నులు (85 శాతం) ఉత్పత్తి చేశాయి. అలాగే 6వ గనిలోఆరు ఎస్‌డీఎల్‌ యంత్రాలు 19,000 టన్నులకు 11,459 టన్నులు (60శాతం), 5వ గనిలో 10 ఎస్‌డీఎల్‌ యంత్రాలు 31,000 టన్నులకు 22,430 టన్నులు (72 శాతం), 8వ గనిలో 10 ఎస్‌డీఎల్‌ యంత్రాలు 31,000 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 25,062 టన్నుల బొగ్గు ఉత్పతి (81శాతం) చేశాయి. ఓసీ -2 నుంచి 1,80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగాల్సి ఉండగా, 1,45,068 టన్నుల బొగ్గు ఉత్పత్తి ( 81 శాతం) జరిగింది. ఇందులో కేటీకే 6, 5 గనుల్లో యంత్రాలు బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి లక్ష్యాలకు దూరంగా ఉన్నాయి.

సింగరేణి వ్యాప్తంగా 92 శాతం బొగ్గు ఉత్పత్తి

సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 92 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది. ఏరియాల వారీగా బొగ్గు ఉత్పత్తిని పరిశీలిస్తే కొత్తగూడెం ఏరియాలో 1,21,12,500 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 1,21,38,169 (100 శాతం), ఇల్లందు ఏరియాలో 56, 25000 టన్నులకు 62,20,591 టన్నులు (111 శాతం), మణుగూరు ఏరియాలో 86,18,800 టన్నులకు 88,80,440 టన్నులు (103 శాతం), ఆర్‌జీ -1 ఏరియాలో 36,45,700 టన్నులకు  22,49,135 (62 శాతం), ఆర్‌జీ-2 ఏరియాలో 71,94800 టన్నులకు 68,90,559 (96 శాతం), ఆర్‌జీ-3 ఏరియాలో 67,45,000 టన్నులకు 62,93,971 (93 శాతం), అడ్రియాల ప్రాజెక్టులో 19,71,250 టన్నులకు 2009790 (102 శాతం), భూపాలపల్లి ఏరియాలో 29,41,000 టన్నులకు 20,54,077 (70 శాతం), బెల్లంపల్లి ఏరియాలో 42,10,000 టన్నులకు 27,31,700 (65 శాతం), మందమర్రి ఏరియాలో 47,39,400 టన్నులకు 3936856 (83 శాతం), శ్రీరాంపూర్‌ ఏరియాలో 5309900 టన్నులకు గాను 46,96,572 (88 శాతం) బొగ్గు ఉత్పత్తి జరిగింది.  

ఇల్లందు టాప్‌.. ఆర్‌జీ-1 లాస్ట్‌

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణిలో ఇల్లందు ఏరియా ప్రధమ స్థానంలో ఉంది. అలాగే ఆర్‌జీ -1 ఏరియా చివరి స్థానంలో ఉంది. బెల్లంపల్లి, భూపాలపల్లి ఏరియాలు సైతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో వెనుకంజలో ఉన్నాయి. ఇల్లందు ఏరియా గనులు ఇప్పటికే లక్ష్యాలను అధిగమించి 111 శాతం బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా ఆర్‌జీ-1 లో 62 శాతం, బెల్లంపల్లిలో 65 శాతం, భూపాలపల్లి ఏరియాలో ఇప్పటివరకు 70 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది. సింగరేణి వ్యాప్తంగా ఓసీలే ఉత్పత్తి లక్ష్యాలను చేధిస్తున్నాయి. భూపాలపల్లి ఏరియాలో ఓసీ-2 నుంచి ఊహించని విధంగా బొగ్గు ఉత్పత్తి జరుగకపోవడంతో ఏరియా ఉత్పత్తిలో వెనుకబడిపోతుంది. ఓసీ -3 ప్రాజెక్టుకు ఇటీవల అధికారులు భూమి పూజ చేసినా ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఈ ఓసీ ప్రారంభమైతే బొగ్గు ఉత్పత్తి పెరిగే అవకాశాలున్నాయి. 

రూ.288.98 కోట్ల నష్టాల్లో కాకతీయ గనులు

భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనులు రూ. 288.98 కోట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి.  ఇందులో కేటీకే 1 ఇైంక్లెన్‌ రూ.90.03 కోట్ల నష్టాల్లో, కేటీకే 5 ఇైంక్లెన్‌ రూ.88.75 కోట్ల నష్టాల్లో, కేటీకే 6 ఇైంక్లెన్‌ రూ.54.04 కోట్ల నష్టాల్లో, కేటీకే 8 ఇైంక్లెన్‌ రూ.83.65 కోట్ల నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓసీ 2 గని మాత్రం రూ.28.83 కోట్ల లాభాల్లో కొనసాగుతుంది. గత సంవత్సరం కాకతీయ గనులు రూ.301.20 నష్టాల్లో ఉండగా ఈ సంవత్సరం నష్టాలు రూ.12.23 కోట్లు తగ్గాయి.logo