బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 03, 2020 , 03:07:45

ప్రభుత్వ భూములను గుర్తించండి

ప్రభుత్వ భూములను గుర్తించండి

భూపాలపల్లి టౌన్‌, మార్చి 02: మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికారులను కోరారు. సోమవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2, 14, 15 (జంగేడు, పక్కీరుగడ్డ, ఆకుదారివాడ) వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యేతోపాటు, కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డులో ప్రభుత్వ భూములను గుర్తించి, ప్రజావసరాల వినియోగానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, పార్కులు, శ్మశాన వాటికలు తదితర ప్రజావసరాలకు కేటాయించుకోవాలన్నారు. భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. జంగేడులోని కసూర్బా పాఠశాల పక్కన ఉన్న మూడెకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచె వేయాలని, గతంలో చూసిన పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ స్థలాన్ని పరిరక్షించాలన్నారు. వార్డులన్నీ శుభ్రంగా తీర్చిదిద్ది అప్పగిస్తామని, భవిష్యత్‌లో మళ్లీ చెత్తా చెదారం పేరుకుపోకుండా చూసుకోవాలని వార్డు కౌన్సిలర్లు, ప్రజలను కోరారు. వార్డుల వారీగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు పెడుతామన్నారు. పట్టణంలోని పెద్దకుంటపల్లిలో బొడ్రాయి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ బానోతు రజిత జుమ్ములాల్‌ పాల్గొన్నారు. కాగా భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, నేరేడుపల్లి, గుడాడ్‌పల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే  గండ్ర శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి , జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కల్లెపు శోభ, ఎంపీపీ మందల లావణ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు మందల రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కల్లెపు రఘుపతిరావు, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ మందల విద్యాసాగర్‌రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యులు మైనోద్దిన్‌, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.  

ఉత్తమ వార్డులకు బహుమతులు : కలెక్టర్‌ 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా శుభ్రంగా తీర్చిదిద్దిన వార్డులకు బహుమతులు అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ అన్నారు. మొదటి బహుమతిగా రూ.5 వేలు, రెండో బహుమతిగా రూ.2 వేలు, మూడో బహుమతిగా రూ.వెయ్యి అందించనున్నట్లు తెలిపారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పట్టణ ప్రగతిలో ఎక్కడ కనిపించడం లేదన్నారు. పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను పరిష్కరించడంతోపాటు గ్రామసభల్లో సమస్యలను గుర్తించి, తెలుసుకొని ఎప్పుడు పరిష్కరిస్తామో ప్రజలకు చెప్పాలన్నారు. ఓసీకి సంబంధించిన సమస్యలపై సింగరేణి జీఎంను పంపిస్తానని, గ్రామసభలు ఏర్పాటు చేసుకొని పరిష్కరించుకోవాలన్నారు. డ్రోన్ల ద్వారా పట్టణ ప్రగతిని పర్యవేక్షిస్తున్నామన్నారు. పట్టణంలో సోలార్‌ వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, ఆర్డీవో గణేష్‌, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌యాదవ్‌, కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్లు ఆకుదారి మమత రాయమల్లు, దార పూలమ్మ, నాగవెల్లి సరళ రాజలింగమూర్తి, నూనె రాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.  


logo