ఆదివారం 29 మార్చి 2020
Jayashankar - Mar 03, 2020 , 03:01:33

కోటి వరాల క్షేత్రం కొడవటంచ

కోటి వరాల క్షేత్రం కొడవటంచ

రేగొండ, మార్చి 02  : కోరిన కోరికలు తీర్చుతూ భక్తజన బంధువుడిగా పేరుగాంచి నిత్యపూజలందుకుంటున్న, రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనృసింహస్వామిని సత్యనిష్టతో నమ్మికొలిచిన భక్తుల కష్టాలు తీర్చడం స్వామి వారి ప్రత్యేకత. ప్రతి ఏటా పాల్గుణ శుద్ధదశమి రోజున ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు  వారం రోజలపాటు నేత్రపర్వంగా జరుగనున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కోడవటంచ క్షేత్రం భక్తుజనుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నది. మానసిక రుగ్మతులను పారద్రోలుతూ భక్తుల కష్టాలు తీరస్తుండటంతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కొడవటంచలోని లక్ష్మీనరసింహస్వామిక్షేత్రం సుప్రసిద్ధమైంది. జయశంకర్‌(భూపాలపల్లి) రేగొండ మండల కేంద్రానికి 9 కిలోమీటర్లు దూరంలో కొడవటంచ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. మార్చి 04 నుంచి 11వ తేదీ వరకు కనుల పండువగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి వేలాది మంది భక్తులు దూరప్రాంతలనుంచి తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు అంబరమంత సంబురపడుతారు. 

బ్రహ్మోత్సవ వైభవం 

ఏటా ఫాల్గుణ మాసంలో స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.అందులో భాగంగా  మార్చి 4న  బుధవారం  ఉదయం అభిషేకం, సూర్యవాహనసేవ, సాయంత్రం పుట్టబంగారుసేవ, శేషవాహనసేవ, అంకురారోహణము. 5న గురువారం  మధ్యాహ్నం ధ్వజారోహణము, రాత్రి అశ్వవాహనసేవ, పల్లకిసేవ, ఎదుర్కోలు, కల్యాణం, 6న శుక్రవారం నిత్యనిధి, గజవాహనసేవ, 7న శనివారం సింహవాహనసేవ, హోమ బలిహరణము. గరడోత్సవం. 8న ఆదివారం  హనుమంత వాహనసేవ, చిన్నరథసేవ, 9న సోమవారం పూర్ణహుతి, జాతర భోనాలు, వాహనములు, బండ్లు తిరుగుట, సాయంత్రం రథోత్సవం, జాతరప్రారంభం, 10న మంగళవారం నిత్యనిధి, జాతరసేవలు, 11న బుధవారం జాతర, సాయంత్రం హంసవాహనసేవ, శ్రీపుష్పయాగంతో బ్రహ్మోత్సవాల ముగింపు.

5న స్వామివారి కల్యాణం

కోటి సూర్యకాంతులు వెదజల్లే కొటంచ నరిసింహుని కల్యాణ మహోత్సవం యావత్‌ జగత్‌కు సుఖసౌభాగ్యాలు ప్రసాదిస్తున్న శ్రీలక్మీదేవితో 5న గురువారం రాత్రి 9.30 గంటలకు వైభవోపేతంగా పరిణయం జరుగనుంది. కళాణం బ్రహ్మాది దేవతులుగా వేధమంత్రోచ్ఛరణలు, హవనంతో కల్యాణం జరుగుతుంది. 

ఆలయ చరిత్ర

వందల ఏళ్లకు పూర్వం ఆలయ వ్వవస్థాపక ధర్మకర్తల వంశీయుడైన  తూపురానిణి రంగాచార్యులు ఈ ఆలయన్ని వెలుగులోకి తెచ్చారు. ఒకనాడు రంగాచార్యులు ఆలయ ప్రాంతమందు ఉన్న చేదబావిలో నీరు తోడుచుండగా ఆచేదలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రతిమ లభించింది. తర్వాత ఆచార్యులకు కలలో కనిపించిన స్వామి తాను బావి సమీపంలో శిల విగ్రహం రూపంలో వెలసిఉన్నట్లు చెప్పి అంతర్ధానమయ్యాడు. ఎంత వేదికినా స్వామి  వారి ప్రతిమ కనిపించలేదు. తర్వత రంగాచార్యులకు మళ్లీ కలలో సాక్షాత్కారమైన స్వామి తన విగ్రహం గల ప్రదేశానికి ఆనవాళ్లుగా ఇటుక ఉన్న శిలలపై శ్రీఆంజనేయ స్వామి వారి విగ్రహం, దాని చెంతగల పుట్టలో తాను నిక్షిప్తమై ఉన్నట్లు చెప్పి అంతర్ధానమైనట్లు భక్తులు పేర్కొంటున్నారు. దీంతో రంగాచార్యలు కొడవలి సాయంతో పుట్టను పెకిలించగా అందులోని మహిమాన్వితమైన స్వామి వారి విగ్రహం తాకినంతనే కొడవలి వంగిపోయిందట కొడవలిని వంచిన స్వామి పేరా క్షేత్రం కొడవటంచగా పిలువబడుతున్నది. స్వామి వారి విగ్రహం ఉన్న ప్రదేశంలోనే ఆలయ నిర్మాణం జరిగింది.

మహిమాన్వితం.. అలయ సన్నిధానం

కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిది మహిమాన్వితమైనది. మానసిక వ్యాధులతో బాధపడే వారు స్వామి వారిని కొలిస్తే వారి వ్యాధులు మటుమయం చేస్తూ తన భక్తులుగా మలచుకొని నిత్యం పూజలందుకుంటూ లక్ష్మీనరసింహస్వామి ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. నిత్యం ఆలయ సన్నిధిలో మానసిక వ్యాధిగ్రస్తులు ఉండటం కొడవటంచ నరసింహస్వామి ప్రత్యేకత, ఆదేవిధంగా సంతానంలేని వారు మండలం పాటు ఉదయంసాయంత్రం స్వామి వారిని దర్శించుకొని సామ్రాని పొగ వేస్తే సంతానవంతులు అవుతారని, వ్యాధిగ్రస్తులకు నయం అవుతుందని భక్తుల నమ్మకం. ఏనుగు, మేక, ప్రభబండ్లును తిప్పడం ఇక్కడ ఆనవాయతీగా వస్తున్నది. 

నిత్య పూజలు..

నిత్య పూజలతో కొడవటంచ క్షేత్రం. భక్తి పారవశ్యాన్ని పెంపొందిస్తున్నది. ప్రతిరోజు ఉదయం 5గంటలకు స్వామి వారి సేవా కార్యక్రమాలు ఎక్కడా లేనివిధంగా త్రికాల ఆరగింపు కేవలం కొడవటంచ ఆలయంలో నిర్వహించడం ప్రత్యేకత. నివేదన సమయంలో ఆలయ సన్నిధిలో సమానత్వానికి సూచికగా భక్తులను కూర్చోబెట్టి స్వామి వారి ప్రసాదాన్ని ఆందిస్తారు. పెరుగుతున్న భక్తుల తాకిడి ఒకపుడు బ్రహ్మోత్సవాల సందర్భంగా మాత్రమే భక్తుల తాకిడి ఉండేది. కానీ ప్రస్తుతం నిత్యం భక్తుల పూజలతో కొడవటంచ పుణ్యక్షేత్రం కళకళలాడుతున్నది. కోరిన కోరికలు తీర్చే స్వామివారికి భక్తులు పల్లకీసేవలు, అభిషేకాలు, పూజలు చేయడం, కార్తీక మాసంలో చేపట్టే సత్యానారాయణ వ్రతాలు, దీపోత్సవం, లాంటి కార్యక్రమాలతో స్వామివారి క్షేత్రం మహిమాన్వితంగా విరాజిల్లుతున్నది. 

ముస్తాబైన ఆలయం 

జాతర సందర్భంగా ఆలయం విద్యుత్‌ దీపాలతో, కొత్తరంగులతో కనువిందు చేస్తున్నది. అలయ ఆవరణంలో చలువ పందిళ్లు వేయించారు. వీఐపీలు విడిది చేయడానికి విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేశారు. 


logo