బుధవారం 01 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 03, 2020 , 03:00:58

జీఎస్టీ చెల్లింపునకు సహకరించాలి

జీఎస్టీ చెల్లింపునకు సహకరించాలి

భూపాలపల్లి టౌన్‌, మార్చి 02 : జీఎస్టీ చెల్లింపునకు వ్యాపార వాణిజ్య వర్గాలు సహకరించాలని హైదరాబాద్‌ జోన్‌ సెంట్రల్‌ జీఎస్టీ చీఫ్‌ కమిషనర్‌ వాస శేషగిరిరావు కోరారు. జిల్లా కేంద్రంలోని దేవీ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం సాయంత్రం వ్యాపార వర్గాలతో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేషగిరిరావు ముఖ్య అతిథిగా హాజరై వ్యాపారస్తులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ‘కేంద్ర జీఎస్టీ మీ వద్ద’కు అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని, ఇప్పటికే 15 జిల్లాల్లో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చాలా మంది వ్యాపారులకు జీఎస్టీపై అవగాహన లేదన్నారు. 

వ్యాపారులందరికీ జీఎస్టీపై అవగాహన కల్పించడంతో పాటు వారి సందేహాలను, సమస్యలను నివృత్తి చేయడం జరుగుతుందన్నారు. వివిధ డిపార్ట్‌మెంట్లకు సంబంధించి 17 రకాల ట్యాక్స్‌లు ఉంటాయని, వాటన్నింటినీ ఒకే ట్యాక్స్‌ కిందికి తీసుకురావడం జరిగిందని, అదే జీఎస్టీ అన్నారు. ఈ సందర్భంగా క్లాత్‌ షో రూం అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈగ రవికిరణ్‌తో పాటు కిరాణ అసోసియేషన్‌, ఇతర అసోసియేషన్‌ నేతలు తమ సందేహాలను, సమస్యలను కమిషనర్‌ ముందుంచారు. వారి సమస్యలకు కమిషనర్‌ పరిష్కారం చూపారు. రెగ్యులర్‌గా ట్యాక్స్‌ కట్టే వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని, కట్టని వారిని పట్టించుకోవడం లేదని, ప్రతిఒక్క వస్తువును జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి అప్పుడు ట్యాక్స్‌ వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రబాద్‌ కమిషనరేట్‌ కమిషనర్‌ ఎంఆర్‌ఆర్‌ రెడ్డి, కమిషనరేట్‌ కమిషనర్‌ డీవీ రెడ్డి, జీఎస్టీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి నాగనాథ్‌, వరంగల్‌ జీఎస్టీ ఇన్‌చార్జి ఓంప్రకాశ్‌ ఉన్నారు.


logo
>>>>>>