సోమవారం 06 ఏప్రిల్ 2020
Jayashankar - Mar 03, 2020 , 02:58:00

జీపీలకు ట్రాక్టర్ల పంపిణీ

జీపీలకు ట్రాక్టర్ల పంపిణీ

కాటారం, మార్చి 02 : మహాత్మగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ప్రభుత్వ ధ్యేయమని, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకే సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారని జెడ్పీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి-రాకేశ్‌ అన్నారు. మండలకేంద్రంలోని షోరూంలో సోమవారం కాటారం మండలం అంకుసాపూర్‌ గ్రామపంచాయతీ, పలిమెల మండలం లెంకలగడ్డ జీపీలకు నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్లను పాలకవర్గాలకు చైర్‌పర్సన్‌ అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి బాటలో నడిచేలా అంకితభావంతో పని చేయాలన్నారు. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటిస్తే పలు వ్యాధులు ధరిచేరవన్నారు. ట్రాక్టర్లను హరితహారం, పారిశుధ్యం నిర్వహణ, తాగునీటి సరఫరా కోసం వాడాలన్నారు. ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం త్వరగా జరగడానికి చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అయిలి సుమలత, తోట రమాదేవి, ఉపసర్పంచ్‌లు ప్రమీల, నాగయ్య, సింగిల్‌ విండో డైరెక్టర్లు అయిలి రాజబాబు, సుధాకర్‌, జీపీ ప్రత్యేకాధికారి దివ్యజ్యోతి, నాయకులు జువ్వాజి తిరుపతి, శ్యామ్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు. 

లెంకలగడ్డ గ్రామ పంచాయతీకి.. 

పలిమెల : మండలంలోని లెంకలగడ్డ గ్రామ పంచాయతీకి జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి సోమవారం ట్రాక్టర్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ట్రాక్టర్‌ను పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహణకు, చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించేందుకు, హరితహరంలో నాటిన మొక్కలకు నీరు అందించేందుకు ట్రాక్టర్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామ అవసరాలకు మాత్రమే ట్రాక్టర్‌ను వాడాలని, వ్యక్తిగత అవసరాలకు వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ తోట రమాదేవి, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, ఉపసర్పంచ్‌ పడాల నాగయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు జవ్వాజీ తిరుపతి, పీఏపీఏసీ డైరెక్టర్‌ తోట సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. logo